శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 03, 2020 , 01:10:19

మల్లన్నసాగర్‌ సొరంగంలోకి గోదావరి

మల్లన్నసాగర్‌ సొరంగంలోకి గోదావరి

  • రంగనాయకసాగర్‌ నుంచి నీళ్ల వదిలిన ఈఎన్సీ హరిరాం

సిద్దిపేట కలెక్టరేట్‌, నమస్తే తెలంగాణ/తొగుట: రంగనాయకసాగర్‌ నుంచి గోదావరి జలాలు మల్లన్నసాగర్‌ సొరంగంలోకి ప్రవేశించాయి. శనివారం ఉదయం 11.10 గంటలకు నీటిపారుదలశాఖ ఈఎన్సీ హరిరాం, ఎస్‌ఈ ఆనంద్‌, మెగా ఏజెన్సీ ప్రతినిధి ఉమామహేశ్వర్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి రంగనాయకసాగర్‌ హెడ్‌రెగ్యులేటర్‌ గేట్లను ఎత్తి నీటిని విడుదలచేశారు. అక్కడి నుంచి ఫీడర్‌ చానల్‌ ద్వారా రెండు కిలోమీటర్లు ప్రవహించిన జలాలు.. 16.17 కిలోమీటర్ల సుదీర్ఘ సొరంగంగుండా మధ్యాహ్నం 2.45 గంటలకు మల్లన్నసాగర్‌లోని తుక్కాపూర్‌ సర్జ్‌పూల్‌కు చేరుకొన్నాయి. 

ఈఎన్సీతోపాటు మెగా చైర్మన్‌ కృష్ణారెడ్డి, మెగా ప్రెసిడెంట్‌ గోవర్ధన్‌రెడ్డి పర్యవేక్షించారు. సర్జ్‌పూల్‌లోకి నిర్ణీత సామర్థ్యంమేరకు నీళ్లు చేరుకోగానే గేట్లు మూసివేశారు. సర్జ్‌పూల్‌ వద్ద వారంపాటు ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తారు. ఒక్కో మోటర్‌ను పరీక్షించిన అనంతరం అన్నింటినీ పవర్‌గ్రిడ్‌కు అనుసంధానంచేస్తారు. అక్కడినుంచి 18 కిలోమీటర్లు ఫీడర్‌ చానల్‌ ద్వారా మూడురోజులపాటు జలాలు ప్రయాణించి అక్కారం చేరుకుంటాయి. అక్కడ కూడా ట్రయల్‌ రన్‌ నిర్వహించి మర్కూక్‌ పంపుహౌజ్‌కు నీటిని తరలిస్తారు. మర్కూక్‌ పంపుహౌజ్‌కు చేరుకున్న జలాలను కొండపోచమ్మసాగర్‌లోకి ఎత్తిపోస్తారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మతో పాటు ఇరిగేషన్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


logo