శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 07, 2020 , 15:34:59

టీఎస్ఆర్‌టీసీతో జీఎంఆర్ ఎయిర్ కార్గో ఒప్పందం

టీఎస్ఆర్‌టీసీతో జీఎంఆర్ ఎయిర్ కార్గో ఒప్పందం

హైద‌రాబాద్ : టీఎస్ఆర్‌టీసీతో జీఎంఆర్ ఎయిర్ కార్గో ఒప్పందం కుదుర్చుకుంది. జీఎంఆర్ ఎయిర్ కార్గో & ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లిమిటెడ్ (జీఏసీఎఈఎల్‌) డివిజన్‌కు చెందిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో (జీహెచ్ఏసీ) శనివారం తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (టీఎస్‌ఆర్‌టీసీ)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఫస్ట్ మైల్ అదేవిధంగా లాస్ట్ మైల్ కార్గో బస్ ఫీడర్ సర్వీస్ (బీఎఫ్ఎస్) ప్రారంభించడం ద్వారా అంతర్జాతీయ ఎగుమతుల‌ను, దిగుమ‌తుల‌ను సంయుక్తంగా ప్రోత్స‌హించ‌నున్నారు. ఈ చ‌ర్య జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో టెర్మినల్‌ను తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలకు అనుసంధానిస్తుంది. రాష్ర్ట రవాణాశాఖ మంత్రి పువ్వాడ‌ అజయ్ కుమార్ సమక్షంలో జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో సీఈవో సౌరభ్ కుమార్, టీఆర్ & బీ ప్రిన్సిపల్ సెక్రటరీ, టీఎస్ఆర్‌టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ ఒప్పందంపై సంతకాలు చేశారు. 

జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో భారతదేశపు ప్రముఖ ఆధునిక ఎయిర్ కార్గో టెర్మినల్‌లో ఒకటి. వివిధ రకాల సరుకులను చేర‌వేడంలో స‌క‌ల స‌దుపాయాల‌ను క‌లిగిఉంది. ఫార్మా, వ్యాక్సిన్లు, పెరిషబుల్స్, ఏరోస్పేస్, ఇంజనీరింగ్ & ఎలక్ట్రానిక్ గూడ్స్ వంటి సరుకులను నిర్వహించడంలో జీహెచ్ఏసీ ప్రత్యేకతను కలిగి ఉంది. అంతర్జాతీయ కనెక్టివిటీ ఎంపికలతో జీహెచ్ఏసీ దేశంలోని దక్షిణ-మధ్య ప్రాంతాన్ని ప్రపంచవ్యాప్తంగా 200 గమ్యస్థానాలకు అనుసంధానించే ఒక గేట్‌వే అని సంస్థ అధికారిక ప్రకటనలో తెలిపింది.

అవగాహన ఒప్పందం ప్రకారం.. జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో టెర్మినల్‌కు టీఎస్‌ఆర్‌టీసీ మొదటి మైల్‌ పిక్-అప్, డెలివరీ సేవలను ప్రారంభించ‌నుంది. అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులోని ప్రాంతాలకు హైదరాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్ అయ్యే అంతర్జాతీయ దిగుమతి రవాణాకు లాస్ట్ మైల్ కనెక్టివిటీని అందిస్తుంది. ఒప్పందం ప్ర‌కారం.. కీ ఫీడర్, డెలివరీ మార్గాలను కవర్ చేసే కార్గో బస్ సేవల‌ను జీఎంఆర్ కార్గో ప్రారంభిస్తుంది. జీఎంఆర్ కార్గో బుకింగ్, డెలివరీ సంబంధిత సేవల కోసం కార్గో ట్రేడ్ కోసం ఎంపిక‌చేసిన కార్గో టెర్మినల్స్ వద్ద టీఎస్ఆర్‌టీసీ కౌంటర్లను కూడా తెరవ‌నుంది. 

ఈ కార్య‌క్ర‌మంలో జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఈడీ-సౌత్ అండ్ సీఐవో ఎస్‌జీకే కిశోర్‌, టీఎస్ఆర్‌టీసీ పార్సిల్‌, కొరియ‌ర్ అండ్ కార్గో స‌ర్వీసెస్ స్పెష‌ల్ ఆఫీస‌ర్ ఎస్‌. కృష్ణ‌కాంత్‌, ఎయిర్ కార్గో ఏజెంట్స్ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియా హైద‌రాబాద్ రీజియ‌న్ చైర్మ‌న్ తుల‌సి ప్ర‌సాద్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.