మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 19, 2020 , 02:35:08

ఘనంగా శరన్నవరాత్రోత్సవాలు

ఘనంగా శరన్నవరాత్రోత్సవాలు

  • బ్రహ్మచారిణి అలంకారంలో అమ్మవారు  
  • భద్రాచలంలో సంతానలక్ష్మి.. వరంగల్‌లో అన్నపూర్ణగా దర్శనం 

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: దేవీ శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండోరోజు ఆదివారం అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శ నమిచ్చారు. ప్రముఖ క్షేత్రాలైన శ్రీశైలం, వేములవాడ, ధర్మపురి, అలంపూర్‌ జోగుళాంబ, బాసర జ్ఞానసరస్వతి  ఆలయాల్లో అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో, భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి సన్నిధిలో అమ్మవారు సంతానలక్ష్మి రూపంలో, వరంగల్‌ భద్రకాళి దేవాలయంలో అన్నపూర్ణ దేవీగా దర్శనమిచ్చారు. వేములవాడ రాజన్న సన్నిధిలో ఉదయం మంగళ వాయిద్యాలు, వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛరణల మధ్య విశేష పూజలు నిర్వహించారు. 

బాసరలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. శ్రీశైల మహాక్షేత్రంలో భ్రమరాంబ దేవీ బ్రహ్మచారిణి అలంకారంలో ముక్కంటీశుడితో కలిసి మయూర వాహనంపై విహరించారు. వరంగల్‌ భద్రకాళి దేవస్థానంలో తెల్లవారుజామునే అమ్మవారికి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం నిర్వహించి అన్నపూర్ణేశ్వరిగా అలంకరించారు. ఉదయం అమ్మవారిని బ్రహ్మచారిణీ క్రమంలో ఆరాధించి మకర వాహన సేవలో, సాయంకాలం దేవజా క్రమంలో ఆరాధించి చంద్రప్రభ వాహనంపై ఊరేగించారు. భక్తులు విశేష అలంకరణలో ఉన్న అమ్మవార్లను దర్శించుకుని తరించారు.


logo