శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Oct 27, 2020 , 02:24:42

పీవీ ఖ్యాతిని చాటడమే లక్ష్యం

పీవీ ఖ్యాతిని చాటడమే లక్ష్యం

  • పీవీ శత జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్‌ కే కేశవరావు 
  • స్విట్జర్లాండ్‌లో ఘనంగా వేడుకలు ప్రారంభం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా ఆయన ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని పీవీ శత జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్‌, టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు చెప్పారు. మార్పు నిరంతర ప్రక్రియ అని విశ్వసించిన పీవీ.. నిత్య సంస్కరణశీలిగా ఖ్యాతిపొందారని అన్నారు. పీవీ శత జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం స్విట్జర్లాండ్‌లో పీవీ శత జయంతి ఉత్సవాలను ప్రారంభించారు. జూమ్‌ యాప్‌ ద్వారా ముఖ్యఅతిథిగా పాల్గొన్న కేకే మాట్లాడుతూ.. విద్యాశాఖ మంత్రిగా గురుకుల విద్యాలయాలు, వైద్యశాఖ మంత్రిగా ఆరోగ్య కార్యకర్తల విధానం, ముఖ్యమంత్రిగా భూ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఘనత పీవీకి దక్కుతుందన్నారు. ఏ సంస్కరణ చేపట్టినా మానవీయ కోణాన్ని ఏనాడూ విస్మరించలేదన్నారు. కర్తవ్య నిర్వహణకే అంకితమయ్యారు తప్ప.. ఏనాడూ సొంత గొప్పదనం చాటుకోలేదని చెప్పారు. పీవీకి రావాల్సినంత గుర్తింపు రాలేదని అన్నారు. ఆర్థికవేత్త, తత్వవేత్త, విద్యావేత్త, సామాజికవేత్త, ప్రగతిశీల వ్యక్తిగా.. మొత్తంగా స్థితప్రజ్ఞుడిగా పీవీ బహుముఖ ప్రతిభ స్ఫూర్తిదాయకమని తెలిపారు. పీవీ బహుముఖ ప్రతిభ నుంచి స్ఫూర్తి పొంది ఒక్క విషయం అలవర్చుకున్నా అదే పీవీకి ఇచ్చే నిజమైన నివాళి అని పీవీ తనయుడు, శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యుడు పీవీ ప్రభాకర్‌రావు అన్నారు. భారతదేశ ఆర్థిక ప్రస్థానంలో స్విట్జర్లాండ్‌కు చాలా ప్రాముఖ్యం ఉన్నదని చెప్పారు. స్విట్జర్లాండ్‌, యూకే, అమెరికా, ఆస్త్రేలియా, న్యూజిలాండ్‌, సింగపూర్‌, మలేషియా వంటి దేశాల్లో పీవీ విగ్రహాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని టీఆర్‌ఎస్‌ ఎన్నారైశాఖ కోఆర్డినేటర్‌, పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ సభ్యుడు మహేశ్‌ బిగాల అన్నారు. పీవీకి భారతరత్న ఇప్పించడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పోరాటం అభినందనీయమని టీఆర్‌ఎస్‌ ఎన్నారై స్విట్జర్లాండ్‌శాఖ ప్రతినిధి పవన్‌ దుద్దిళ్ల పేర్కొన్నారు. సమావేశంలో కిశోర్‌కుమార్‌ తాటికొండ, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.