మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Aug 05, 2020 , 03:36:01

గ్లోబల్‌ ఇండియా సృష్టికర్త పీవీ

గ్లోబల్‌ ఇండియా సృష్టికర్త పీవీ

ఆధునిక భారతానికి మార్గం వేసింది నెహ్రూ అయితే గ్లోబల్‌ ఇండియాగా తీర్చిదిద్దిన ఘనత పీవీ నరసింహారావుకే దక్కుతుందని బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ మాజీ వైస్‌ చాన్సలర్‌, రాష్ట్ర ప్రభుత్వ పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ సభ్యుడు ప్రొఫెసర్‌ కుసుంభ సీతారామారావు అన్నారు. పీవీ రాజనీతిజ్ఞతతో తెచ్చిన సంస్కరణల వల్లే ఇవ్వాళ దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా నిలిచిందని, కానీ ఆయనకు రావలసిన గుర్తింపు రాలేదని అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్‌ పీవీ శతజయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా నిర్వహించాలని పూనుకోవడం గొప్ప విషయమని అన్నారు. ఈ సందర్భంగా దేశానికి పీవీ చేసిన సేవల్ని ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు.పీవీ నరసింహారావుకు మీ కుటుంబానికి ఉన్న సన్నిహిత సంబంధాన్ని వివరిస్తారా? 

నిజానికి నేను చాలా చిన్నవాడిని. మా నాన్న (రామచంద్రరావు) పీవీకి సన్నిహితుడు. పీవీ మహారాష్ట్రలోని చాందా క్యాంప్‌ నిర్వహించిన సందర్భంలో మా నాన్నకు పీవీ ఆయుధాల శిక్షణ ఇచ్చారు. పీవీ హైదరాబాద్‌ స్టేట్‌ విముక్తి పోరాటంలో ఒక కాంగ్రెస్‌ వాదిగా రామానంద తీర్థ శిష్యరికంలో ఎదిగారు. పీవీ నరసింహారావు, టీ హయగ్రీవాచారి, జమలాపురం కేశవరావు, పెండ్యాల రామానుజరావు మా నాన్నకు సన్నిహిత సంబంధాలుండేవి. పీవీ దూరదృష్టి, పట్టుదల, అన్ని రంగాల్లో అపారమైన జ్ఞానం గురించి మా నాన్న నాకు తరచూ చెబుతుండేవారు. అట్లా నా విద్యార్థి జీవితంలో పీవీని మొట్టమొదటగా పరిచయం చేసింది మా నాన్న. 

రాష్ట్ర ప్రభుత్వం పీవీ శతజయంతి ఉత్సవాల నిర్వహణ కమిటీలో మీరు సభ్యుడిగా ఉన్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? 

ఈ దేశ ఆర్థిక, రాజకీయ సుస్థిరతకు, అపారమైన జ్ఞానసంపత్తికి కేరాఫ్‌గా ఉన్న పీవీని ఈ దేశం విస్మరించింది. ఈ దేశానికి విదేశాంగమంత్రిగా, హోంమంత్రిగా, ప్రధానమంత్రిగా విజయవంతంగా పనిచేశారు. ఏ హోదాలో ఉన్నా,  ఏ పదవిలో ఉన్నా ఆయా పదవులకు సముచిత న్యాయం చేశారు. వాటికి సమున్నత గౌరవాన్ని తీసుకొచ్చారు. అటువంటి మహోన్నత వ్యక్తికి ఈ దేశం తీరని అన్యాయం చేసింది. ఈ లోటును భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పూనుకోవడం, పీవీ శతజయంతి వేడుకల్ని సంవత్సరం పాటు ఘనంగా నిర్వహించడం, అందుకు తగిన కార్యాచరణ రూపొందించడం చాలా గొప్ప విషయం. శతజయంతి ఉత్సవాల కమిటీలో నన్నూ ఒక సభ్యుడిగా నియమించడం సంతోషంగా ఉంది. నన్ను సభ్యుడిగా నియమించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు.

వ్యక్తిగతంగా మీరు పీవీని కలిశారా? వారితో మీకేమైనా అనుబంధం ఉన్నదా? 

పీవీని రెండు సార్లు.. అదీ వరంగల్‌లో కలిసే అదృష్టం దక్కింది. పీవీ విదేశాంగమంత్రి హోదాలో కాకతీయ యూనివర్సిటీ స్నాతకోత్తర ఉపన్యాసం చేశారు. ఆ సమయంలో నిర్వహణ కమిటీలో వారిని ఆ హోదాలో చాలా దగ్గరగా చూసే అవకాశం లభించింది. ఆయన ప్రధానమంత్రి హోదాలో 1994లో వరంగల్‌ వచ్చారు. అప్పుడు నేను కాకతీయ యూనివర్సిటీ టీచర్స్‌ అసోసియేషన్‌ (అకుట్‌)కు సెక్రటరీగా ఉన్నా. ఆ సమయంలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ సార్‌ వీసీ. పీవీని కలిసే అవకాశం ఆయన నాకు కల్పించారు. అక్టోబర్‌ 18, 1994నాడు వరంగల్‌ సర్క్యూట్‌ గెస్ట్‌హౌజ్‌లో పీవీని కలిశాను. విద్యావ్యవస్థ,  విద్యార్థులు, రాజకీయాలు మొదలైన అనేక విషయాలపై ఆయన ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. నేను అన్ని విషయాలు చెబుతూ నేను రామచంద్రరావు అబ్బాయిని సర్‌ అన్నారు. ఆత్మీయమైన చూపుతో నన్ను చూస్తూ ‘నువు మా రామచంద్రం’ కొడుకువా అని నవ్వారు. దగ్గరికి రమ్మని ఆటోగ్రాఫ్‌ ఇచ్చారు. ఆయన ఆటోగ్రాఫ్‌ నిజంగా నాకో స్వీట్‌ మెమొరీ. అపురూపమైనది కూడా. ఆయనతో అప్పుడు గడిపిన సమయం తక్కువే. కానీ రాజకీయ, ఆర్థిక సామాజిక, సాంస్కృతిక రంగాలపై ఆయన లోతైన చైతన్యవంతమైన అవగాహన ప్రతీ ఒక్కరిని అలవరచుకునేలా చేసింది.

 కాకతీయ, అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ‘పీవీ ఎండోమెంట్‌ లెక్చర్స్‌' ప్రారంభించడం గురించి వివరించండి? 

ఈ దేశంలో పండిట్‌ జవహర్‌లాల్‌నెహ్రూ తరువాత అంతటి గొప్ప నాయకుడు, కొన్ని విషయాల్లో అంతకన్నా కూడా గొప్పవాడు పీవీ. అయితే ఆయనకు రావాల్సిన గుర్తింపు కానీ, గౌరవం కానీ దక్కలేదనేది అక్షరసత్యం. ఇటువంటి అంశాలు చర్చకొచ్చినప్పుడు కాకతీయ యూనివర్సిటీ సోషల్‌ సైన్సెస్‌ డీన్‌గా నేను ఉన్నప్పుడు వాణీదేవిగారు (పీవీ కూతురు) నాన్నగారికి సంబంధించిన ఈ ప్రాంతంలో ఏదైనా చేయాలి అని సూచించారు. కేయూలో పీవీ ఎండోమెంట్‌ లెక్చర్స్‌ మొదలుపెడతామని నేను ఆమెకు చెప్పాను. ఆమె సరే అన్నారు. అదేవిధంగా బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ అయ్యాక అక్కడ కూడా పీవీ ఎండోమెంట్‌ లెక్చర్స్‌ మొదలుపెట్టాం. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక మహోన్నత వ్యక్తి ఆదర్శాలను సమాజానికి తెలియజెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పూనుకోవడం నిజంగా గొప్ప విషయం. 


పీవీ దార్శనికతను ఈ తరానికి తెలియజేప్పేందుకు మీరు చేసే సూచన ఏమిటి? 

నిజానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నివిధాలుగా ఆలోచించి తరతరాలపాటు పీవీని స్మరించుకోవడం, ఆయన దార్శనికతను, రాజనీతిజ్ఞతను అధ్యయనం చేయడం కోసం అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. వరంగల్‌, కరీంనగర్‌, హైదరాబాద్‌ నగరాల్లో పీవీ కాంస్య విగ్రహాలు నెలకొల్పడం, హైదరాబాద్‌లో పీవీ మ్యూజియాన్ని నెలకొల్పడం. ఢిల్లీలోని తీన్‌మూర్తి భవన్‌లో జవహర్‌ మెమోరియల్‌ మ్యూజియం, లైబ్రరీ ఉంది. ఈ దేశంలో ఇది తప్ప ఆ స్థాయిలో మరో కేంద్రం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆ స్థాయిలో ఒక ఉన్నతమైన పరిశోధనా సంస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉన్నట్టు కనిపిస్తున్నది. సెంటర్‌ ఫర్‌ స్డడీ ఆఫ్‌ కాంటెంపరరీ గ్లోబల్‌ బేస్‌డ్‌ ఎకానమిక్స్‌ పేరుతో హైదరాబాద్‌లో పూర్తిస్థాయి నిరంతర అధ్యయన కేంద్రం ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. హైదరాబాద్‌ ఇప్పటికే అన్ని రంగాల్లో విశ్వనగరంగా విరాజిల్లుతున్నది. ఈ క్రమంలో ప్రభుత్వం నెలకొల్పే పీవీ నరసింహారావు మెమోరియల్‌.. మ్యూజియం అండ్‌ రిసెర్చ్‌ కేంద్రంగా ఉండాలని ప్రభుత్వంలోని పెద్దలకు నేను సూచించాను. 

పీవీ శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంపై కమిటీ సభ్యుడిగా మీ స్పందన? 

పీవీ నరసింహారావు అనేది ఒక పేరు కాదు వ్యవస్థ. ఇవ్వాళ ప్రపంచంలోని అనేక సంపన్నదేశాలు కూడా ఆయా దేశాల్లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం వల్ల కుదేలైపోయాయి. కానీ ఒక్క భారతదేశం మాత్రమే ఎన్ని ఒడిదొడుకులనైనా ఎదుర్కొని నిలబడింది. 

ఇలా నిలబడేందుకు ప్రధాన కారకుడు పీవీ. రాజకీయంగా పీవీ అపర చాణక్యుడు. ఐక్యరాజ్యసమితి వంటి వేదికల మీద భారత లౌకిక, ప్రజాతంత్ర వ్యవస్థ ఔన్నత్యాన్ని దాదాపు 15 ఏండ్లపాటు చాటిన గొప్ప దార్శనికుడు. అటువంటి వ్యక్తి దార్శనికతను, అందునా ఒక తెలంగాణ మహోన్నత శిఖరం వంటి వ్యక్తిని మనమే గౌరవించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక అద్భుతమైన కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఇది చాలా గొప్ప విషయం. 

పీవీ నరసింహారావుకు మా నాన్న (రామచంద్రరావు) సన్నిహితుడు. మహారాష్ట్రలోని చాందా క్యాంప్‌ నిర్వహించిన సందర్భంలో మా నాన్నకు పీవీ ఆయుధాల శిక్షణ ఇచ్చారు. 

దేశంలో పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ తరువాత అంతటి గొప్ప నాయకుడు, కొన్ని విషయాల్లో అంతకన్నా కూడా గొప్పవాడు పీవీ. అయితే ఆయనకు రావాల్సిన గుర్తింపు కానీ, గౌరవం కానీ దక్కలేదనేది అక్షరసత్యం. 


logo