శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Feb 07, 2020 , 03:01:30

విత్తనోత్పత్తితో రైతులకు అధిక లాభాలు

విత్తనోత్పత్తితో రైతులకు అధిక లాభాలు
  • అధిక దిగుబడులతోపాటు తీరనున్న ప్రపంచ ఆహార కొరత
  • యూఎస్‌ఏ ఆహార, వ్యవసాయ సంస్థ డీజీ డాక్టర్‌ క్యూడొంగ్యూ

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: విత్తనోత్పత్తి ద్వారా రైతులు అధిక లాభాలు పొందటమే కాకుండా పరోక్షంగా వ్యవసాయంలో  ఎక్కువ దిగుబడులు సాధించడానికి, ప్రపంచంలో ఆహార కొరత తీర్చడానికి దోహదపడుతారని అమెరికాకు చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో) డైరెక్టర్‌ జనరల్‌ క్యూ డొంగ్యూ అన్నారు. దేశాల మధ్య విత్తన ఎగుమతులు పెంచి, విత్తన పరిశ్రమను పటిష్ఠపరచడానికి ఎఫ్‌ఏవో ప్రపంచవ్యాప్తంగా ప్రాంతీయస్థాయిలో అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇటలీలోని రోమ్‌లో జరుగుతున్న అంతర్జాతీయ వ్యవసాయ-విత్తన సంస్థ సమావేశాలకు హాజరైన తెలంగాణ విత్తన సంస్థల డైరెక్టర్‌ డాక్టర్‌ కేశవులు.. గురువారం డాక్టర్‌ క్యూ డొంగ్యూతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ విత్తన పరిశ్రమ సామర్థ్యం, నాణ్యమైన విత్తనోత్పత్తికి ఇక్కడి అవకాశాలపై ప్రత్యేకంగా తయారుచేసిన బ్రోచర్‌ను క్యూ డొంగ్యూకు అందజేశారు. అనంతరం తెలంగాణలో విత్తనోత్పత్తి పరిస్థితులపై వివరించారు. మారుతున్న ప్రపంచంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆహారోత్పత్తి జరుగాలంటే నాణ్యమైన విత్తనం కీలకపాత్ర పోషిస్తుందని డాక్టర్‌ క్యూ డొంగ్యూ తెలిపారు.


logo