శనివారం 04 జూలై 2020
Telangana - Jun 18, 2020 , 01:15:17

పెరిగిన విమాన ప్రయాణాలు

పెరిగిన విమాన ప్రయాణాలు

  • 23 రోజుల్లో 1,80,884 మంది రాకపోకలు
  • రైలు ప్రయాణంపై ప్రజల్లో తగ్గిన ఆసక్తి 

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కరోనా నేపథ్యంలో తగ్గిన విమాన ప్రయాణాలు క్రమంగా పెరుగుతున్నాయి. విమాన ప్రయాణాలు తిరిగి ప్రారంభమైన మే 25 నుంచి ఈ నెల 16 వరకు 1,80,884 మంది రాకపోకలు సాగించారు. ప్రారంభంలో ప్రయాణికుల సంఖ్య నామమాత్రంగానే ఉన్నా క్రమంగా పెరిగింది. ప్రారంభించిన తర్వాత చాలా రోజుల వరకు ప్రతిరోజూ 39 నుంచి 40 విమాన సర్వీసుల వరకు శంషాబాద్‌ విమానాశ్రయానికి రాకపోకలు సాగించాయి. ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య పెరిగినందున 110 విమానాలు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. ఢిల్లీ, చెన్నై, బెంగుళూరు, కోల్‌కతా, పాట్నా, లక్నో, భువనేశ్వర్‌, రాయ్‌పూర్‌, నాగ్‌పూర్‌, షిర్డీ, తిరుపతి, విశాఖపట్నం, భోపాల్‌, వడోదరా, అహ్మదాబాద్‌ తదితర ప్రాంతాలనుంచి హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్నారు. రైలు ప్రయాణం అందుబాటులో ఉన్నా కరోనా నేపథ్యంలో చాలామంది ఆసక్తి చూపడం లేదు.  

ప్రతిరోజూ 10వేల మంది రాకపోకలు

ప్రతిరోజూ హైదరాబాద్‌కు 110 నుంచి 114 విమానాలు శంషాబాద్‌ విమానాశ్రయానికి రాకపోకలు సాగిస్తున్నాయి. బుధవారం ఒక్కరోజే 4,509 మంది ప్రయాణికులు హైదరాబాద్‌కు రాగా, ఇక్కడి నుంచి 4,778 మంది ఇతర ప్రాంతాలకు విమానయానం చేశారు. గత నెల 25 నుంచి ఈ నెల 16వ తేదీ వరకు శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి 1,80,884 మంది రాకపోకలు సాగించారు. ఇందులో 88,177 మంది వివిధ ప్రాంతాల నుంచి రాగా 92,707 మంది ఇతర నగరాలకు వెళ్లారు. శంషాబాద్‌కు 1029 విమానాలు రాగా, 1031 విమానాలు ఇక్కడి నుంచి వెళ్లాయి.


logo