శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Nov 25, 2020 , 16:51:36

ఇచ్చేది స్వ‌దేశీ నినాదం.. ఎత్తుకునేది విదేశీ విధానం : ఎంపీ బండ ప్ర‌కాష్

ఇచ్చేది స్వ‌దేశీ నినాదం.. ఎత్తుకునేది విదేశీ విధానం : ఎంపీ బండ ప్ర‌కాష్

హైద‌రాబాద్ : దివంగ‌త ప్ర‌ధాని వాజ‌పేయి హ‌యాంలో ఏడు ప్ర‌భుత్వరంగ సంస్థ‌ల‌ను అమ్మితే ప్ర‌స్తుత మోదీ హయాంలో 70 ప్ర‌భుత్వరంగ సంస్థ‌ల‌ను అమ్ముతున్న‌ట్లు టీఆర్ఎస్ ఎంపీ బండ ప్ర‌కాష్ తెలిపారు. తెలంగాణ‌భ‌వ‌న్‌లో మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జాతీయ పార్టీలు అనవసర విషయాలను ప్రస్తావిస్తున్నాయ‌న్నారు. ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేయాలనీ బీజేపీ నేతృత్వం లోని ఎన్డీయే ప్రభుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింద‌న్నారు. కొవిడ్ వల్ల ఈ ప్రయత్నంలో కొంత ఆలస్యం చోటుచేసుకుంద‌న్నారు.

మోడీ నిర్దేశించుకున్న ప్రభుత్వరంగ సంస్థల పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యంలో ఇప్ప‌టికే 91 శాతాన్ని చేరుకున్నారన్నారు. పెట్టుబడుల ఉపసంహరణతో వచ్చిన దాదాపు రూ. 3 లక్షల కోట్లను మోడీ ప్రజల కోసం వెచ్చించడం లేదన్నారు. పెట్టుబడుల ఉపసంహరణకు మానవీయ కోణం ఉండాలన్న మౌలిక సిద్ధాంతాన్ని మోడీ విస్మరిస్తున్నారన్నారు. రక్షణరంగంలోనూ ప్రైవేటీకరణ మొదలైందన్నారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తున్నారు. రక్షణ పరికరాలు తయారు చేసే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలకు ఆర్డర్లు ఇవ్వకుండా ప్రైవేటు వారికి ఇస్తున్నారు. బొగ్గు, చమురు రంగాల ప్రైవేటీకరణ మొదలైంది. అత్యధిక ఉద్యోగులున్న రైల్వేశాఖకు చెందిన 190 రూట్లను ప్రైవేటీకరించారు. రైల్వే స్టేషన్‌ల‌ను ప్రైవేటీకరిస్తున్నారు. ఇన్సూరెన్స్‌ను ప్రభుత్వరంగ సంస్థల నుంచి తప్పిస్తున్నారు.

మోడీ తీరు ఇలాగే సాగితే రైల్వేల్లో పట్టాలు తప్ప ఏమీ మిగిలేట్టు లేవన్నారు. కీలక రంగాల్లో విదేశీ పెట్టుబడులను మోడీ అనుమతిస్తున్నారు. కొత్త మైనింగ్ చట్టంతో ప్రైవేటు సంస్థలకు దారులు తెరిచారు. మోదీది మేకిన్ ఇండియా కాదు ..సేల్ ఇండియా నినాదం అన్నారు. పెట్టుబడుల ఉపసంహరణతో ఇప్పటికే రెండున్నర లక్షల ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్యను 51 శాతం పెంచారు. చాలా ప్రభుత్వరంగ సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్లు వస్తున్నా పట్టించుకోకండా వాటి అమ్మకానికి మొగ్గు చూపుతున్నారు.

బీజేపీ నేతలు ఇచ్చేది స్వదేశీ నినాదం.. ఎత్తుకునేది విదేశీ విధానమ‌న్నారు.  కొత్త కార్మిక చట్టాలు, వ్యవసాయ చట్టాలతో ప్రజలు నష్టపోయేలా చేస్తున్నారు. కూరగాయలు, ఉల్లిగడ్డలను కూడా దిగుమతి చేసుకునే పరిస్థితిని మోడీ తయారు చేశారు. దేశభక్తుల పార్టీ అని చెప్పుకునే బీజేపీ విదేశీ సంస్థల తొత్తుగా మారిందన్నారు. ఇన్ని కార్మిక వ్యతిరేక విధానాలు కేంద్రం తీసుకుంటున్నందువల్లే రేపటి సార్వత్రిక సమ్మెకు టీఆర్ఎస్ మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్న‌ట్లు తెలిపారు.


logo