శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Aug 26, 2020 , 11:45:52

కేసీఆర్‌ కిట్‌లో నేత చీరెలు ఇవ్వండి.. మంత్రి ఈటలకు వినతి

కేసీఆర్‌ కిట్‌లో నేత చీరెలు ఇవ్వండి.. మంత్రి ఈటలకు వినతి

హైదరాబాద్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కేసీఆర్‌ కిట్‌లో చేనేత చీరెలు ఇవ్వాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను అఖిల భారత పద్మశాలీ సంఘం యువజన విభాగం జాతీయ అధ్యక్షుడు గుండేటి శ్రీధర్‌, తెలంగాణ పద్మశాలీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అవ్వారి భాస్కర్‌ కోరారు. ఈ మేరకు ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో పని లేక కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని, చేనేత పరిశ్రమ దిక్కుతోచని స్థితిలో పడిందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోని దవాఖానలో వాడుతున్న వివిధ వస్త్ర ఉత్పత్తులను (బెడ్ షీట్, పిల్లో కవర్, అఫ్రాన్స్‌, మాస్క్‌లు, కర్టెన్‌) నేరుగా చేనేత సహకార సంఘాల నుంచి, చేనేత కార్మికుల నుంచి కొనుగోలు చేసి జీవన భృతి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ దవాఖానలో ప్రసవించిన మహిళలకు ఇస్తున్న కేసీఆర్‌ కిట్‌లో పాలిస్టర్‌ చీరెకు బదులుగా ఆరోగ్యానికి మేలు చేసే కాటన్‌ చేనేత చీరెలు ఇచ్చేలా చూడాలని కోరారు. దీంతో చేనేత కార్మికులకు ఏడాది పొడవునా పని దొరికే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు స్పందించిన మంత్రి ఈటల సాధ్యమైనంత త్వరలోనే విధి విధానాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని వైద్య కార్యదర్శికి లేఖను పంపారు. చేనేత కార్మికులకు తనవంతు సహకారం అందిస్తానని భరోసా కల్పించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo