శుక్రవారం 03 జూలై 2020
Telangana - Jun 19, 2020 , 02:51:57

ఇంటర్‌ ఫలితాల్లో బాలికలు భళా

ఇంటర్‌ ఫలితాల్లో బాలికలు భళా

  • ఉమ్మడి రాష్ర్టానికి మించి భారీస్థాయి ఉత్తీర్ణత!
  • కుమ్రంభీం ఆసిఫాబాద్‌ టాప్‌.. చివర్లో మెదక్‌
  • ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబితారెడ్డి
  • ఈ నెల 22 నాటికి కాలేజీలకు మెమోలు
  • త్వరలోనే అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

హైదరాబాద్‌/వరంగల్‌, నమస్తే తెలంగాణ: ఇంటర్‌ ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. బాలురకు మించి ఉత్తీర్ణత సాధించారు. మార్చిలో నిర్వహించిన ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేశారు. రెండు సంవత్సరాల్లో కలిపి బాలికల సగటు ఉత్తీర్ణతశాతం 71.31గా ఉండగా, బాలుర సగటు ఉత్తీర్ణతశాతం 57.23 శాతం ఉన్నది. ద్వితీయసంవత్సరంలో 68.86 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా బాలికలు 75.15 శాతం మంది, బాలురు 62.10 శాతం మంది పాసయ్యారు. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 60.01 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 

ఇందులో బాలికలు 67.47 శాతం, బాలురు 52.30 శాతం మంది ఉన్నారు. సెకండియర్‌ ఫలితాల్లో కుమ్రంభీంఆసిఫాబాద్‌ జిల్లా 76 శాతం ఉత్తీర్ణతతో ప్రథమ స్థానంలో నిలువగా, మెదక్‌ జిల్లా చివరిస్థానంతో సరిపెట్టుకున్నది. ఫలితాల విడుదల సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల మార్కుల జాబితాను ఈ నెల 22 లోగా కాలేజీలకు పంపిస్తామని తెలిపారు. త్వరలో ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఫలితాలపై సందేహాలుంటే ఆన్‌లైన్‌లో ఫిర్యాదుచేయవచ్చని, ప్రతి ఫిర్యాదుకు నిర్ణీత సమయంలోనే సమాధానాలు ఇస్తామని చెప్పారు. లాక్‌డౌన్‌ ఉన్నా మూల్యాంకనానికి నిర్భయంగా వచ్చిన అధ్యాపకులందరినీ అభినందిస్తున్నట్టు ప్రకటించారు. 

కార్యక్రమంలో విద్యాశాఖ ప్రత్యేకప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్‌, ఇంటర్‌బోర్డు సెక్రటరీ సయ్యద్‌ ఒమర్‌జలీల్‌, సీజీజీ డైరెక్టర్‌ రాజేంద్రనిమ్జే తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాల్లో పురోగతి కనిపిస్తున్నది. 2015-16లో 62.70 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా 2020 నాటికి 68.86కి చేరింది. జనరల్‌ విభాగంలోని రెగ్యులర్‌లో 69.61 శాతం, జనరల్‌ ప్రైవేటు విద్యార్థులు 30.62 శాతం, ఒకేషనల్‌ రెగ్యులర్‌ విద్యార్థులు 61.28 శాతం, ప్రైవేటు విద్యార్థులు 47 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.

విద్యార్థుల ఒత్తిడి తగ్గించేందుకు కౌన్సెలింగ్‌ 

ఇంటర్‌ ఫలితాల నేపథ్యంలో ఒత్తిడికి గురయ్యే విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇవ్వడానికి ఇంటర్‌ బోర్డు ఏడుగురు మానసిక నిపుణులను అందుబాటులో ఉంచింది. ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు వీళ్లు అందుబాటులో ఉంటారని ఇంటర్‌ బోర్డు సెక్రటరీ సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ తెలిపారు. మానసిక నిపుణుల పేర్లు, మొబైల్‌ నంబర్లను ఆయన విడుదల చేశారు.   డాక్టర్‌ అనిత: 7337225803, డాక్టర్‌ మజార్‌ అలీ: 7337225425, డాక్టర్‌ రజని: 7337225364,  పీ జవహర్‌లాల్‌నెహ్రు: 7337225360, ఎస్‌ శ్రీలత: 7337225083,  శైలజ పైసపాటి:7337225098, అనుపమ గుట్టిందేవి:  7337225763


తొలిసారి భారీస్థాయిలో ఉత్తీర్ణత

సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ఇంటర్‌ మూల్యాంకన ప్రక్రియను జాగ్రత్తగా నిర్వహించాం. లాక్‌డౌన్‌లో కూడా 15 వేల మంది అధ్యాపకులతో 60 లక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం చేయించాం. ఈ పరీక్షలలో బాలికలు 75.15 శాతం, బాలురు 62.10 శాతం ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం ఇదే తొలిసారి. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంతపెద్ద ఉత్తీర్ణత సాధించ లేదని అధికారులు చెబుతున్నారు. 

- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు 24 వరకు గడువు

ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలకు సంబంధించి రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తుల కోసం ఈ నెల 24 వరకు ఇంటర్‌బోర్డు గడువు విధించింది. రీకౌంటింగ్‌ కోసం రూ.100, రీవెరిఫికేషన్‌-స్కాన్‌చేసిన కాపీల కోసం రూ.600 ఫీజు చెల్లించాలని తెలిపింది. బోర్డు వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఫలితాలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం కోసం www.bigrs. telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని పేర్కొన్నది.

సెకండియర్‌ మొత్తం ఉత్తీర్ణత 
 68.86%
బాలికలు
 75.15%
బాలురు 
62.10%
బాలికలు
 67.47%
ఫస్టియర్‌ మొత్తం ఉత్తీర్ణత
 60.01%
బాలురు 
52.30%
రెండు సంవత్సరాల్లో కలిపి 

బాలికలు 71.31% 

బాలురు 57.23%

ఏటా ఇంటర్‌ ఫలితాలిలా..

సంవత్సరం
విద్యార్థులు
ఉత్తీర్ణత శాతం
2015-16
4,18,231
62.70
2016-17
4,14,213
66.45
2017-18
4,29,378
67.25
2018-19
4,18,271
65.01
2019-20
4,11,631
68.86


logo