మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 23, 2020 , 02:59:30

బోయిన్‌పల్లిలో బాలిక కిడ్నాప్‌

బోయిన్‌పల్లిలో బాలిక కిడ్నాప్‌

  • రామాయంపేటలో పట్టుకున్న పోలీసులు  
  • కిడ్నాప్‌ కథ సుఖాంతం

రామాయంపేట: సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలో సోమవారం ఓ మూడేండ్ల బాలిక కిడ్నాప్‌ కాగా పోలీసులు కొన్ని గంటల్లోనే ఛేదించారు. మెదక్‌ జిల్లా రామాయంపేట పోలీసుల కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌కు చెందిన ఆంజనేయులు-స్వరూప దంపతులు మూడు రోజుల క్రితం గొడవపడ్డారు. స్వరూప ఆదివారం తన మూడేండ్ల కూతురిని తీసుకుని సికింద్రాబాద్‌ జూబ్లీ బస్‌స్టేషన్‌కు చేరుకున్నది. అక్కడే మియాపూర్‌కు చెందిన నాగమ్మ పరిచయమైంది. స్వరూప పరిస్థితి తెలుసుకున్న ఆమె తల్లీబిడ్డలను మియాపూర్‌లోని తన ఇంటికి తీసుకెళ్లింది. రాత్రి అక్కడే ఉన్న వారు సోమవారం నాగమ్మతోపాటు బోయిన్‌పల్లి బస్టాండ్‌కు చేరుకున్నారు. పాప ఆకలితో ఏడ్వడంతో నాగమ్మ తినడానికి ఏమైనా తీసుకొస్తానని చెప్పి చిన్నారిని తీసుకుని వెళ్లింది. ఎంతకూ తిరిగి రాకపోవడంతో స్వరూప బోయిన్‌పల్లి పోలీసు లకు ఫిర్యాదు చేసింది. 

పోలీసులు అన్ని పోలీస్‌స్టేషన్లను అప్రమత్తం చేశారు. రామాయంపేట ఎస్సై మహేందర్‌ రామాయంపేట బైపాస్‌ రోడ్డుకు చేరుకుని వాహనాలను తనిఖీ చేశారు. రాజధాని బస్సులో మూడేండ్ల బాలికతో అనుమానాస్పదంగా కనిపించిన నాగమ్మను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా పాపను బోయిన్‌పల్లి నుంచి తీసుకొస్తున్నట్లు తెలిపింది. పోలీసులు నిందితురాలు నాగమ్మతోపాటు బాలికను బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో చిన్నారి కిడ్నాప్‌ కథ గంటల వ్యవధిలోనే సుఖాంతమైంది.


logo