బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 06, 2020 , 02:12:45

సిరులబాటలో గిరిపుత్రులు

సిరులబాటలో గిరిపుత్రులు

  • అడవి బిడ్డలకు అండగా ప్రభుత్వం
  • జీసీసీ ఉత్పత్తులకు పెరిగిన డిమాండ్‌
  • ఆరేండ్లలో 1052.57 కోట్ల టర్నోవర్‌
  • కార్పొరేట్‌ మార్కెట్లలోనూ గిరిబ్రాండ్‌

అడవిలో స్వచ్ఛమైన తేనె దొరికేది కానీ. అమ్ముకునేందుకు సదుపాయాల్లేవు.. అటవీ ఉత్పత్తులు పుష్కలంగా లభించేవి.. కానీ అవి ఎక్కువ మందికి చేర్చే ప్రయత్నం జరుగలేదు.. ఫలితంగా అడవిబిడ్డల చేతుల్లోకి పైసలు రాలేదు. ఇదంతా గతం.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విధానాలతో గిరిజనుల బతుకులు మారిపోయాయి. అటవీ ఉత్పత్తులు బహిరంగ మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. గిరిబిడ్డల చేతుల్లోకి పైసలొచ్చాయి. ఆరేండ్లలోనే జీసీసీ ద్వారా రూ.వెయ్యికోట్ల విలువైన అటవీ ఉత్పత్తులు విక్రయాలు జరిగి గిరిజనులు సిరుల బాటలో పరుగులు పెడుతున్నారు.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గిరిపుత్రుల ఆదాయ వనరులను పెంచేందుకు ప్రభుత్వం చేపట్టిన విధానాలు సత్ఫలితాలనిస్తున్నాయి. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) అటవీ ఉత్పత్తుల విక్రయాల ద్వారా ఆరేండ్లలో రూ.1052.57 కోట్ల టర్నోవర్‌ సాధించింది. ఈ ఏడాది వినూత్నంగా రత్నదీప్‌, అమెజాన్‌, లేపాక్షి, ఉషోదయ, బాలాజీ గ్రాండ్‌ బజార్‌ తదితర స్టోర్స్‌లకూ సరఫరా చేసే మార్కెటింగ్‌ డిస్ట్రిబ్యూషన్‌ వ్యవస్థను ఏర్పాటుచేశారు. దీంతో జీసీసీ గిరి బ్రాండ్‌ ఉత్పత్తుల అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. గిరిజన సంక్షేమశాఖ, గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో అడవుల్లో అరుదుగా దొరికే ఉత్పత్తులను గిరిజనుల ద్వారా సేకరించి వాటిని ప్రాసెస్‌ చేసి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లింది.

ఇలా ప్రాసెస్‌చేసిన సౌందర్య, ఆహారఉత్పత్తులను బహిరంగ మార్కెట్లలో విక్రయిస్తూ ఆదాయమార్గాలను పెంచుతున్నారు. భద్రాచలం, ఏటూరునాగారం, ఉట్నూరు ట్రైబల్‌ డివిజన్లతోపాటు 170 సబ్‌డివిజన్ల పరిధిలో.. మైనర్‌ ఫారెస్ట్‌ ప్రొక్యూర్‌ (ఎంఎఫ్‌పీ) విధానంతో సేకరించిన పదార్థాలతో పలు ఉత్పత్తులను సిద్ధంచేసి జీసీసీ గిరిబ్రాండ్‌ పేరుతో ప్రత్యేక విక్రయకేంద్రాలు, రైతు బజార్లలో అతి తక్కువ ధరకు అమ్ముతున్నారు. స్వచ్ఛత ఎక్కువగా ఉండటంతో వీటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు మక్కువ చూపుతున్నారు. గిరిజన హాస్టళ్లు, గురుకులాలు, ఇతర గిరిజన విద్యాలయాల్లోని విద్యార్థులకు వీటిని పంపిణీ చేస్తున్నారు.  


మార్కెట్‌లోని జీసీసీ ఉత్పత్తులు

గిరిజన సంక్షేమశాఖ, జీసీసీ ద్వారా బహిరంగ మార్కెట్‌లో అనేక ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. గిరి నేచర్‌ హనీ బాత్‌ సోప్స్‌, అలోవెరా, నీమ్‌, ఆరెంజ్‌, బొప్పాయ బాత్‌ సోప్‌లతోపాటు అలోవెరా షాంపూ వంటి కాస్మోటిక్స్‌ తయారవుతున్నాయి. ఇప్పపువ్వు లడ్డూలు, గిరి గారెలు, జొన్న రొట్టెలు, రాగులు, సజ్జలు, కొర్రలు, సామలు వంటి ప్రొటీన్లతో కూడిన ఆహార ఉత్పత్తులతోపాటు స్వచ్ఛమైన పసుపు, కారం విక్రయిస్తున్నారు.

ఎంఎస్‌ఎంఈ గ్రూపులకు.. 

అటవీ ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చేందుకు గిరిజన ప్రాంతాల్లోని మహిళా స్వయం సహాయక గ్రూపులకు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ గ్రూపులతో 11 ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పారు. గిరిజనులు సేకరించే ముడి పదార్థాలను నాణ్యతతో ప్రాసెసింగ్‌ చేస్తూ బహిరంగ మార్కెట్‌లో అందుబాటులోకి తెస్తున్నారు. 


logo