శనివారం 30 మే 2020
Telangana - Apr 08, 2020 , 01:14:03

కరోనా యుద్ధవీరులకు నజరానాలు

కరోనా యుద్ధవీరులకు నజరానాలు

  • నగదు ప్రోత్సాహకాల జీవో జారీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి అహర్నిశలు కృషిచేస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక నగదు ప్రోత్సాహకాలను ప్రకటించింది. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి, వ్యాధిగ్రస్ధులకు చికిత్స చేయడానికి నిరంతరం పోరాడుతున్న వైద్యసిబ్బంది, ప్రభుత్వ, ప్రైవేట్‌ పారిశుద్ధ్య కార్మికులు, ఇతరసిబ్బంది పాత్ర అమోఘమైనదని వారి సేవలను గు ర్తించి ప్రభుత్వం ప్రోత్సాహకాలిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులను జారీచేసింది. చీఫ్‌ మినిస్టర్‌ స్పెషల్‌ ఇన్సెంటివ్‌ కింద నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్లు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

వైద్యారోగ్యశాఖకు చెందిన రెగ్యులర్‌, కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందికి వారి మొత్తం వేతనంలో 10 శాతం ఇవ్వనున్నట్టు తెలిపారు. జీహెచ్‌ఎంసీలో పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న రెగ్యులర్‌, కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందికి, హైదరాబాద్‌ వాటర్‌బోర్డులో పనిచేసే లైన్‌మెన్లు, సీవరేజి వర్కర్‌లకు రూ.7,500 చొప్పున అందిస్తామన్నారు. ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో పనిచేసే రెగ్యులర్‌, పారిశుద్ధ్య సిబ్బందికి, పంచాయతీలలో వివిధరకాల విధులు నిర్వర్తిస్తున్న వారికి రూ.5 వేల చొప్పున అందించనున్నట్టు పేర్కొన్నారు.  మార్చి నెలలో విధులు నిర్వర్తించిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని, లీవులో ఉన్నవారికి, సస్పెన్షన్‌లో ఉన్న వారికి ఇది వర్తించదని ఆయన స్పష్టంచేశారు. ఈ చెల్లింపులలో నిబంధనలను అతిక్రమించినా, అనవసర చెల్లింపులు చేసినా ట్రెజరీ డీడీఓలు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. 

 కరోనా యుద్ధంలో మేము సైతం: అసదుద్దీన్‌ 

 కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి పోరాడుతున్న ప్రభుత్వానికి తాము పూర్తి మద్దతునిస్తున్నట్టు ఎంఐఎం అధ్యక్షుడు హైదరాబాద్‌ ఎంపీ, అసదుద్దీన్‌ ఒవైసీ ప్రకటించారు.  రాష్ట్రమంత్రి కేటీ రామారావును ఆయన మంగళవారం కలిసి కరోనా నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. ఈ యుద్ధంలో తాము కూడా ప్రభుత్వంతో కలిసి పోరాడుతామని తెలిపారు. డక్కన్‌ మెడికల్‌ కాలేజీ, అస్త్రా, ఒవైసీ హాస్పిటల్స్‌ తరఫున పూర్తిసాయం అందిస్తామన్నారు.


logo