శుక్రవారం 15 జనవరి 2021
Telangana - Dec 04, 2020 , 03:42:24

మూడు రౌండ్లలోనే ఫలితం!

మూడు రౌండ్లలోనే ఫలితం!

  • నేడు జీహెచ్‌ఎంసీ ఫలితాలు
  • మధ్యాహ్నం మూడు గంటల్లోగా మెజార్టీపై స్పష్టత
  • 30 కౌంటింగ్‌ కేంద్రాల్లో 8,152 మంది సిబ్బంది

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దిల్లీ నుంచి గల్లీ నేతల దాకా ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి. జీహెచ్‌ఎంసీలోని 150 డివిజన్లకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు మొదలుకానుంది. ఈసారి బ్యాలెట్‌ విధానంలో ఎన్నికలు జరుగడంతో ఫలితాల వెల్లడి కొంత ఆలస్యమయ్యే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. మొత్తం 150 డివిజన్లకు సంబంధించి వార్డుకు ఒక కౌంటింగ్‌ హాల్‌ చొప్పున ప్రతి హాల్‌లో 14 టేబుల్స్‌పై ఓట్లను మదించనున్నారు. ఒక్కో టేబుల్‌పై గంటకు వెయ్యి చొప్పున 14వేల ఓట్లు లెక్కిస్తామని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఈ లెక్కన 28వేల లోపు ఓట్లు పోలైన డివిజన్‌ల్లో కౌంటింగ్‌ మొదలుపెట్టిన రెండు గంటల్లోనే జయాపజయాలు ఖరారు కానున్నాయి. తక్కువ ఓట్లు పడిన మెహిదీపట్నం (11,818) నుంచి తొలిఫలితం రావచ్చని భావిస్తున్నారు. ఎక్కువ ఓట్లు పడిన మైలార్‌దేవ్‌పల్లి (37,445) డివిజన్‌ ఫలితం అన్నింటికంటే చివరన వచ్చే అవకాశముంది. బ్యాలెట్‌పేపర్లు బయటికి తీసి, కట్టలు కట్టే ప్రక్రియను పూర్తి చేసుకున్నాక మధ్యాహ్నంలోపు తొలి ఫలితం వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి సాయంత్రానికే అన్ని డివిజన్ల ఫలితాలు వెల్లడవుతాయని భావిస్తున్నారు.

నాలుగు డివిజన్లలోనే ఎక్కువ ఓట్లు..

మొత్తం 150 డివిజన్లకుగాను నాలుగుచోట్ల మినహా ఎక్కడా పోలైన ఓట్లు 30వేలు దాటలేదు. దీంతో లెక్కింపు మొదలైన మూడు రౌండ్లలోనే గెలిచేదెవరో.. ఓడేదెవరో తేలిపోనుంది. మధ్యాహ్నం 3 గంటలలోపు పార్టీల మెజార్టీలపై స్పష్టత రానుంది. 30 లెక్కింపు కేంద్రాల్లో డివిజన్‌కు ఒకటి చొప్పున, 16 వార్డులకు (హాల్‌ చిన్నగా ఉన్న చోట) రెండు హాళ్ల చొప్పున మొత్తం 166 హాళ్లను ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్‌కు ఒక సూపర్‌వైజర్‌, ఇద్దరు సహాయకులు సహా ఆర్వోలు, అసిస్టెంట్‌ ఆర్వోలు మొత్తం 8,152 మంది కౌంటింగ్‌ ప్రక్రియలో పాల్గొంటున్నారు. ప్రతి టేబుల్‌ దగ్గర ఓ సీసీ కెమెరాతో కౌంటింగ్‌ ప్రక్రియను అంతా రికార్డు చేయనున్నారు.

కౌంటింగ్‌ కేంద్రాల్లో ఇలా..

  • నిబంధనల ప్రకారం ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌లను లెక్కిస్తారు. ఆ తరువాత బ్యాలెట్‌లు లెక్కిస్తారు.
  • ప్రతి కౌంటింగ్‌ టేబుల్‌కు ముగ్గురు అధికారులు, అభ్యర్థులకు సంబంధించిన కౌంటింగ్‌ ఏజెంట్లు ఉంటారు. 
  • ఆర్వోల నుంచి పాసులు, బ్యాడ్జీలు తీసుకున్న ఏజెంట్లను మాత్రమే లోపలికి అనుమతిస్తారు. 
  • ఒకవేళ అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే డ్రా పద్ధతిలో ఫలితాలు ప్రకటిస్తారు. 
  • రీ కౌంటింగ్‌ చేయించాలనుకునే అభ్యర్థులు ఫలితాలు ప్రకటించకముందే ఆర్వోకు లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసుకోవాలి.