మంగళవారం 07 ఏప్రిల్ 2020
Telangana - Mar 07, 2020 , 21:33:08

50మంది వీధి వ్యాపారులకు పునరావాసం

50మంది వీధి వ్యాపారులకు పునరావాసం

హైదరాబాద్: నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌  స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఖైరతాబాద్‌,శేరిలింగంపల్లి జోన్లలో విస్తృతంగా పర్యటించారు. షేక్‌పేట్‌ దర్గా, జెఆర్‌సి చౌరస్తా వద్ద చేపట్టిన జంక్షన్‌ అభివృద్ధి పనులు, ఫ్లైఓవర్‌ పనులకు అడ్డుగా ఉన్న  ఆస్తులను వెంటనే సేకరించాలని టౌన్‌ప్లానింగ్‌ అధికారులను ఆదేశించారు. అలాగే, విద్యుత్‌ స్తంభాల పనులను పూర్తిచేయాలని డిస్కం అధికారులను కోరారు. జెఆర్‌సి చౌరస్తా వద్ద గచ్చిబౌలీ నుంచి బంజారాహిల్స్‌కు వెళ్లే ప్రత్యామ్నాయ రోడ్డును అభివృద్ధిచేసి ట్రాఫిక్‌ను మళ్లించాలని స్పష్టంచేశారు. స్లిప్‌రోడ్‌ల కోసం ఆస్తుల సేకరణ ప్రక్రియను సత్వరమే పూర్తిచేయాలన్నారు. శేరిలింగంపల్లి జోన్‌లో దర్గా, గచ్చిబౌలీ, బొటానికల్‌ గార్డెన్‌, మజీద్‌బండ తదితర ప్రాంతాల్లో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్‌కు అనుగుణంగా చేపట్టిన రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణ పనులను పరిశీలించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. 


ఫుడ్‌ వెండింగ్‌ జోన్‌ ప్రారంభం.... 

అనంతరం చందానగర్‌ సర్కిల్‌లో శిల్పారామమ్‌ వద్ద రూ. 50లక్షల వ్యయంతో ఏర్పాటుచేసిన ప్లాస్టిక్‌ ఫ్రీ ఫుడ్‌ వెండింగ్‌ జోన్‌ను మేయర్‌ ప్రారంభించారు. ఆధునిక పద్ధతిలో పర్యావరణ హితంగా ప్లాస్టిక్‌ రహిత మెటీరియల్‌తో వీధి వ్యాపారులకోసం జీహెచ్‌ఎంసీ ఈ ఫుడ్‌ వెండింగ్‌ జోన్‌ను ఏర్పాటుచేసింది. ఈ జోన్‌లో 50స్టాల్స్‌ను ఏర్పాటుచేసి వాటికి సోలార్‌ విద్యుత్‌ సౌకర్యాన్ని కల్పించారు. నీరూస్‌ జంక్షన్‌ నుంచి కొత్తగూడ జంక్షన్‌ వరకు రోడ్లపక్కన చిన్నచిన్న ఫుడ్‌స్టాల్స్‌ నిర్వహిస్తున్న వీధి వ్యాపారులు, మెటల్‌ చార్మినార్‌ నుంచి హైటెక్స్‌ గేట్‌ వరకు రోడ్ల పక్కన చిన్నచిన్న ఫుడ్‌స్టాల్స్‌ నిర్వహిస్తున్న వీధి వ్యాపారులకు ఈ ఫుడ్‌ వెండింగ్‌ జోన్‌లో స్టాల్స్‌ను కేటాయించారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఉద్యోగులు, శిల్పారామానికి వచ్చే పర్యాటకులకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించేందుకు ఈ స్టాల్స్‌ పొందిన వీధి వ్యాపారులకు ఆహార పదార్థాల తయారీ, నాణ్యతపై జీహెచ్‌ఎంసీ ప్రత్యేక శిక్షణనిచ్చింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్‌తోపాటు స్థానిక కార్పొరేటర్లు, అధికారులు కూడా మేయర్‌ వెంట ఉన్నారు.logo