శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 20, 2020 , 09:23:03

230 వాణిజ్య సంస్థలకు నోటీసులు

230 వాణిజ్య సంస్థలకు నోటీసులు

హైదరాబాద్:  కరోనా వ్యాధి నివారణ చర్యలు సూచిస్తూ వినియోగదారులు నిత్యావసర వస్తువుల కొనుగోలుకు వెళ్లే షాపింగ్‌ మాల్స్‌, వాణిజ్య సంస్థలు అన్ని కలిపి 230 సంస్థలకు  జీహెచ్‌ఎంసీ నోటీసులు  జారీచేసింది. వ్యాధి వ్యాప్తిని నిరోధించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వర్తక వ్యాపార సంస్థలు తమ సిబ్బందికి మాస్కులు, హ్యాండ్‌ శానిటైజర్లు, హ్యాండ్‌ గ్లౌజ్‌లు అందజేయాలని కోరారు. వ్యాధి అనుమానితులు ఉంటే వెంటనే ప్రభుత్వ నిర్ధారిత హెల్ప్‌లైన్‌ నంబరుకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పరిశుభ్రతకు సంబంధించిన అన్ని చర్యలు పాటించాలని కోరుతున్నారు. 

విస్తృతంగా కెమికల్‌ స్ప్రేయింగ్‌

ఇదిలావుంటే, కరోనా అనుమానితులు సంచరించినట్లు పేర్కొంటున్న ప్రాంతాలు, విమానాశ్రయం పరిసర ప్రాంతాలు, క్వారంటైన్‌లు ఉన్నచోట్ల  కెమికల్‌ స్ప్రేయింగ్‌ చేపట్టారు. రోడ్లు, పరిసర ప్రాంతాల్లో ఈ మేరకు పిచికారి చేయడంవల్ల బ్యాక్టీరియా నశించిపోతుందని అధికారులు తెలిపారు. ప్రతి లీటరు నీటికి 5.0-7.5మిల్లీలీటర్ల సోడియం హైపోక్లోరైట్‌ను కలిపి ఆ పరిసర ప్రాంతాల్లో పిచికారి చేస్తున్నారు. ఈ కెమికల్‌ వల్ల మనుషులకు ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవని, ఇండ్లలో ఉపయోగించే లైజాల్‌ వంటి కెమికలేనని వారు భరోసా ఇచ్చారు. దీనిపై సోషల్‌ మీడియాలో వస్తున్న ప్రతికూల ప్రచారాన్ని నమ్మరాదని వారు స్పష్టంచేస్తున్నారు. 


logo