బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Sep 30, 2020 , 02:35:21

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఈ-ఓటింగ్‌!

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఈ-ఓటింగ్‌!

  • వృద్ధులు, దివ్యాంగుల, పోలింగ్‌ సిబ్బందికి
  • వార్డుకో పోలింగ్‌ కేంద్రంలో ఫేస్‌ రికగ్నైజేషన్‌ సాఫ్ట్‌వేర్‌
  • రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ సీ పార్థసారధి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌తోపాటు ఇతర ఎన్నికల్లో ఈ-ఓటింగ్‌ విధానం అమలుకు కసరత్తు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ సీ పార్థసారధి పేర్కొన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, పోలింగు సిబ్బంది వంటివారికి పైలట్‌ ప్రాతిపదికన ఈ-ఓటింగ్‌ను అమలుచేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్టు చెప్పారు. ఐటీశాఖతో సమన్వయం చేసుకొని దీన్ని అమలుచేస్తామని, ఈ విధానం దేశంలోనే ఒక కొత్త ఆవిష్కరణగా కీలకపాత్రను పోషిస్తుందని ఆశాభా వం వ్యక్తంచేశారు. మంగళవారం తెలంగాణ పోల్‌ (టీఈ-పోల్‌)పై జీహెచ్‌ఎంసీ అధికారులు ఇస్తున్న శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. కొవిడ్‌-19 నేపథ్యంలో ఆధునిక సాంకేతికతను వినియోగించడం వల్ల ఎన్నికలను సజావుగా, సాఫీగా నిర్వహించేందుకు వీలవుతుందని చెప్పారు. ఓటరు స్లిప్‌ డౌన్‌లోడ్‌తోపాటు నియోజకవర్గం, పోలింగు కేంద్రంవారీగా ఓటరు జాబితా వంటి వివరాలన్నింటినీ ఎప్పుడైనా ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చని తెలిపారు. టీఈ-పోల్‌ ద్వారా అభ్యర్థులు, రాజకీయపార్టీలకు అన్ని వివరాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఫేస్‌ రికగ్నైజేషన్‌ (ముఖాన్ని గుర్తించడం) సాఫ్ట్‌వేర్‌ను గ్రేటర్‌ ఎన్నికల్లోనూ పైలట్‌ విధానంలో అమలు చేయనున్నట్టు పార్థసారధి వెల్లడించారు. ఒక్కో వార్డుకు ఒక్కో పోలింగ్‌ కేంద్రం చొప్పున 150 పోలింగు కేంద్రాల్లో ఈ విధానాన్ని అమలుచేస్తామని ప్రకటించారు. ఓటరును గుర్తించడంలో ఇది అత్యద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానమని అభివర్ణించారు. గత ఎన్నికల్లో పది పోలింగు కేంద్రాల్లో ఈ విధానాన్ని అమలుచేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల సంఘం సంయుక్త సంచాలకుడు విష్ణుప్రసాద్‌ పాల్గొన్నారు. 

ఎన్నికలను ఈవీఎంల ద్వారానే జరుపాలి: బీజేపీ

కరోనా నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, పట్టభద్రుల ఎమ్మెల్సీఎన్నికలను ఈవీఎం ద్వా రానే నిర్వహించాలని బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు కోరారు. ఈమేరకు మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పీ పార్థసారథికి బీజేపీ ప్రతినిధుల బృందం విననతిపత్రం అందజేసింది. కరోనా సమయంలో బ్యాలెట్‌ కంటే ఈవీఎంల ద్వారా జరుపడమే సురక్షితమని పేర్కొన్నారు.


logo