ఆదివారం 06 డిసెంబర్ 2020
Telangana - Nov 04, 2020 , 02:26:27

జీహెచ్‌ఎంసీ నోటిఫికేషన్‌ 13 తర్వాత

జీహెచ్‌ఎంసీ నోటిఫికేషన్‌ 13 తర్వాత

  • తుది ఓటర్ల జాబితా ప్రచురించాక నిర్ణయం
  • పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ క్యాస్టింగ్‌కు ఏర్పాట్లు
  • ఒక్కో డివిజన్‌కు సగటున 50 పోలింగ్‌ స్టేషన్లు అధికారులకు ఎస్‌ఈసీ పార్థసారథి ఆదేశాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఈ నెల 13వ తేదీన ఓటర్ల తుదిజాబితా ప్రచురించిన తరువాత, ఎప్పుడైనా గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయొచ్చని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) పార్థసారథి చెప్పారు. జీహెచ్‌ఎంసీలోని 150 డివిజన్లలో సగటున ఒక్కో డివిజన్‌కు 50 పోలింగ్‌ కేంద్రాలు ఉంటాయని తెలిపారు. ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు పోలింగ్‌ కేంద్రాల్లో వీడియో వెబ్‌క్యాస్టింగ్‌కు ఏర్పాట్లుచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి వార్డులో విశాలంగా, మంచి లైటింగ్‌, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉన్న ఒక పోలింగ్‌ స్టేషన్‌ను ఎంపికచేసి ఫేస్‌ రికగ్నైజేషన్‌ సాంకేతికతను వినియోగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలోని సమావేశమందిరంలో టీవోటీ (ఆర్వోలు, ఏఆర్వోలకు శిక్షణ ఇచ్చే అధికారులు)లకు రెండు రోజుల శిక్షణ శిబిరాన్ని మంగళవారం పార్థసారథి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీలో 30 సర్కిళ్లు ఉన్నాయని ఒక్కో సర్కిల్‌కు ఒక డిప్యూటీ కమిషనర్‌ ఉన్నారని చెప్పారు. వారికి కూడా ఎన్నికల విధులు కేటాయించామన్నారు. 150 వార్డులకు ఆర్వోలు ఉంటారని తెలిపారు. ప్రతి వార్డుకు విడిగా కౌంటింగ్‌ కేంద్రాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ నెల 7న ముసాయిదా ఓటర్ల జాబితా జారీ చేస్తామని, 11వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించి 13వ తేదీన తుది జాబితాను ప్రచురిస్తామని వివరించారు. ఎన్నికల ప్రక్రియలో రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) పాత్ర అత్యంత ప్రాధాన్యమైందని చెప్పారు. ఆర్వోగా నియమితులైన అధికారులు పారదర్శకంగా, తటస్థంగా, నిష్పక్షపాతంగా ఉండాలని, ఎన్నికలకు సంబంధించిన నియమనిబంధనలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలకు ప్రచారం చేసుకునేందుకు సమాన అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి జీహెచ్‌ఎంసీ కమిషన్‌ లోకేశ్‌కుమార్‌ను ఆదేశించారు.