సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 23, 2020 , 10:42:38

విదేశాల నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక నిఘా

విదేశాల నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక నిఘా

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ విజృంభిస్తున్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకు లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం విదితమే. ఈ క్రమంలో విదేశాల్లో ప్రయాణించి వచ్చిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో విదేశాల నుంచి వచ్చిన వారు ఎక్కువ సంఖ్యలో ఉన్న నేపథ్యంలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక బృందాలతో విదేశాల్లో ప్రయాణించి వచ్చిన వారిని గుర్తించాలని ఆదేశాలిచ్చింది. 14 రోజుల పాటు పూర్తిగా హోమ్‌ క్వారంటైన్‌లో ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది. 14 రోజుల పాటు వారిని సర్వైలైన్స్‌ బృందాలు పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసింది. హోమ్‌ క్వారంటైన్‌కు సంబంధించి సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. ఇరుగుపొరుగు వారు, కాలనీ సంక్షేమ సంఘాలకు సమాచారం ఇవ్వాలని ఆదేశం. స్వయం సహాయక సంఘాలకు సమాచారం ఇవ్వాలని ఉత్తర్వుల్లో వెల్లడించింది. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. పాజిటివ్‌ కేసుల సంబంధీకులను గుర్తించి పర్యవేక్షించాలని పురపాలక శాఖ ఆదేశించింది.

కోవిద్‌-19 లక్షణాలు ఉన్న వ్యక్తులు నేరుగా హెల్ప్‌లైన్‌ నంబరు 104 సంప్రదించాలని జీహెచ్‌ఎంసీ సూచించింది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. కోవిద్‌- 19 వ్యాప్తిని అరికట్టేందుకు నగర పరిధిలో నియమించిన 150 బృందాలు పరిస్థితులను మానిటరింగ్‌ చేస్తున్నాయని తెలిపారు.  వీరివద్ద నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించేందుకు జీహెచ్‌ఎంసీ హెడ్‌ ఆఫీసులో కంట్రోల్‌ రూం నెలకొల్పారు. కంట్రోల్‌ రూం ఇన్‌చార్జ్ జీహెచ్‌ఎంసీ విశ్రాంత అదనపు కమిషనర్‌ అనురాధను నియమించారు. జీహెచ్‌ఎంసీ, 108 వాహన సర్వీసు, వైద్యఆరోగ్యశాఖకు సంబంధించిన అధికారులు మూడు షిఫ్టులలో అందుబాటులో ఉంటున్నారు. 24 గంటలు పనిచేస్తున్న కంట్రోల్‌రూం విధులలో ఆయాశాఖలను ఐటీ విభాగం డీఈ బెనర్జీ, ఏఎంహెచ్‌వో డాక్టర్‌ ఉమారాణి సమన్వయం చేస్తున్నారు.


logo