ఆదివారం 31 మే 2020
Telangana - May 13, 2020 , 01:37:30

రైతులకు ఉదారంగా రుణాలు

రైతులకు ఉదారంగా రుణాలు

  • ప్రస్తుత పద్ధతిలోనే మంజూరు చేయాలి
  • బ్యాంకులకు ప్రభుత్వం సూచన

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ :  రైతులకు వానకాలం పంట రుణాలను ఉదారంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు సూచించింది.  కేంద్రం, రిజర్వు బ్యాంకు కూడా పంట రుణాల మంజూరులో జాప్యం చేయరాదని ఇదివరకే బ్యాంకులకు స్పష్టంచేశాయి. 2020-21 రాష్ట్ర రుణ ప్రణాళికలో మొత్తం రూ.73,686 కోట్ల వరకు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఈ వానకాలం రూ.30,649 కోట్లు పంపిణీ చేయాలని నిర్దేశించుకుంది. ఈ వానకాలంలో కోటి 30 లక్షల ఎకరాలకుపైన వివిధరకాల పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనావేస్తున్నది. అందుకు అనుగుణంగా రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించాలని భావిస్తున్నది. ఇప్పటికే రైతుబంధు కింద రూ.7వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమచేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇంకా ధరణి వెబ్‌సైట్‌ అందుబాటులో రానందున ప్రస్తుత పద్ధతిలోనే పంట రుణాలు మంజూరుచేయాలని ప్రభుత్వం బ్యాంకులకు సూచించింది. వడ్డీలేని రుణాలు, పావలా వడ్డీకి సంబంధించిన బకాయి నిధులను త్వరలోనే విడుదల చేస్తామని, రైతుల నుంచి వసూలు చేయవద్దని ఇప్పటికే రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి ద్వారా బ్యాంకులకు తెలిపినట్లు అధికారులు వెల్లడించారు.

గత ఏడాది రుణాలు తక్కువే

గత వానకాలంలో రూ.29,244 కోట్ల్ల పంట రుణాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇందులో రూ.18,711 కోట్లు (63.98శాతం) మాత్రమే పంపిణీ చేశారు. అలాగే యాసంగిలో రూ.19,496 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా 75 శాతం మేర పంపిణీ చేసినట్లు ఎస్‌ఎల్‌బీసీ వర్గాలు తెలిపాయి. గత ఏడాది రుణమాఫీ వస్తుందో రాదోనన్న భయంతో చాలామంది రైతులు పంట రుణాలు రెన్యువల్‌ చేసుకోలేదు. అయితే ప్రభుత్వం ఈ నెలలోనే రూ.25వేలలోపు పంట రుణం ఉన్నవారికి మాఫీ నిధులు రూ.1200 కోట్లను బ్యాంకుల ఖాతాల్లో జమ చేయనుంది. దీంతో ఈసారి పంట రుణాలు తీసుకునేందుకు రైతులు ముందుకొస్తారని భావిస్తున్నారు. అదే సమయంలో లాక్‌డౌన్‌ కారణంగా వడ్డీవ్యాపారుల వద్ద అప్పులు పుట్టే పరిస్థితి కూడా లేనందున బ్యాంకు రుణాలపై తప్పక ఆధారపడాల్సి వస్తుంది. అందులో భాగంగానే పంట వేసే సమయంలో పెట్టుబడికి ఎటువంటి ఇబ్బంది రాకుండా బ్యాంకులు రుణాలు మంజూరు చేయాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది.

రైతులకు రుణాలు వెంటనే మంజూరు చేయాలి

వానకాలం సీజన్‌ మరో 15 రోజుల్లో ప్రారంభం కానున్నందున బ్యాంకులు పంట రుణాలను వెంటనే మంజూరు చేయాలి. రైతులను బ్యాంకులు ఇబ్బందికి గురిచేయొద్దు. లాక్‌డౌన్‌ ఉన్నందున రైతుల నుంచి పావలా వడ్డీ వసూలు చేయొద్దు. కాస్త ఆలస్యమైనా బ్యాంకులకు ఆ సొమ్ము చెల్లిస్తాం. రుణమాఫీ, రైతుబంధు సొమ్ము ను పాత బకాయిలకు జమ చేసుకోవద్దు. 

- సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి 


logo