ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 06, 2020 , 01:54:59

ఒక్కొక్కరికి 75 లక్షలు

ఒక్కొక్కరికి 75 లక్షలు

  • శ్రీశైలం అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు జెన్‌కో అదనపు సాయం
  • కుటుంబంలో ఒకరికి మంచి ఉద్యోగం
  • బోర్డు సమావేశంలో ఏకగ్రీవ నిర్ణయం
  • ప్లాంటు పునరుద్ధరణకు కమిటీ 
  • జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: శ్రీశైలం జలవిద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన విద్యుత్‌ ఉద్యోగుల కుటుంబాలకు జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు మరింత భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఎక్స్‌గ్రేషియాకు అదనంగా ఒక్కొక్కరికి రూ.75 లక్షల చొప్పున ఆర్థికసాయం ఇస్తామని ప్రకటించారు. మరణించిన ఉద్యోగుల కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించామని, ఇతర శాఖాపరమైన సాయం త్వరితగతిన అందిస్తామని తెలిపారు. శనివారం విద్యుత్‌సౌధలో సీఎండీ ప్రభాకర్‌రావు అధ్యక్షతన తెలంగాణ జెన్‌కో బోర్డు సమావేశం జరిగింది. శ్రీశైలం ప్రమాదంపై విస్తృతంగా చర్చించారు. మరణించినవారికి సంతాపం తెలిపారు. సమావేశంలో డైరెక్టర్లు, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ సుల్తానియా పాల్గొన్నారు.

మానవతా దృక్పథంతో సాయం

శ్రీశైలం ప్రమాదంలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునే విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, కుటుంబ పెద్దను కోల్పోయి దుఃఖంలో ఉన్నవారి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సముచిత నిర్ణయం తీసుకోవాలని అంతకుముందే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. గతంలో ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి సాయం అందిందనే విషయంతో సంబంధం లేకుండా శ్రీశైలం ప్రమాదాన్ని ప్రత్యేక పరిస్థితిగా పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు చేయగలిగినంత సాయంచేయాలని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సీఎండీని కోరారు. వారి ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని చేయాల్సిన సాయంపై బోర్డు విస్తృతంగా చర్చించింది. శ్రీశైలం ప్రమాదాన్ని ప్రత్యేక అంశంగా పరిగణించి సాయమందించాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. మరోవైపు, ప్రమాదానికి గురైన శ్రీశైలం జలవిద్యుత్‌ కేంద్రంలో తిరిగి ఉత్పత్తి ప్రారంభానికి చర్యలు తీసుకోవడానికి ముగ్గురు సభ్యుల కమిటీని సీఎండీ ప్రభాకర్‌రావు నియమించారు. జెన్‌కో హైడల్‌, సివిల్‌ డైరెక్టర్లు, శ్రీశైలం ప్రాజెక్టు సీఈలు ఇందులో సభ్యులుగా ఉంటారు. 

సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలు

ప్రమాదంలో మరణించిన డీఈకి రూ.50 లక్షలు, మిగతా ఉద్యోగులకు రూ.25 లక్షల చొప్పున ప్రభుత్వం ఆర్థికసాయం ప్రకటించింది. దీనికి అదనంగా తెలంగాణ జెన్‌కో ఒక్కో కుటుంబానికి రూ.75 లక్షల చొప్పున సాయం అందిస్తుంది. దీనివల్ల డీఈ కుటుంబానికి మొత్తం రూ.1.25 కోట్లు, ఇతర ఉద్యోగుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున సాయం అందుతుంది.

మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి విద్యుత్‌సంస్థల్లో ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. విద్యార్హతలను బట్టి డీఈ, ఏఈల కుటుంబాలకు ఏఈ/పీవో ఉద్యోగాలు, ఇతరులకు జూనియర్‌ ప్లాంట్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం ఇస్తారు.

గెజిటెడ్‌ ఉద్యోగాలివ్వడం హర్షణీయం: టీఈఈ జేఏసీ 

శ్రీశైలం విద్యుత్‌ కేంద్రం అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబసభ్యులకు గెజిటెడ్‌ ఉద్యోగాల్విడం పట్ల తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (టీఈఈజేఏసీ) హర్షం వ్యక్తంచేసింది. విద్యార్హతలను బట్టి అసిస్టెంట్‌ ఇంజినీర్లు (ఏఈ), పర్సనల్‌ ఆఫీసర్లు (పీవో)గా ఉద్యోగాలివ్వడం పట్ల జేఏసీ నేతలు ఎన్‌ శివాజీ, పాపకంటి అంజయ్య, వినోద్‌, కోడూరి ప్రకాశ్‌, గణేష్‌, కరంట్‌రావు, ఆరోగ్యరాణి, ప్రణీత తదితరులు శనివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు. 


logo