బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Nov 19, 2020 , 01:13:14

కేంద్రం తలదన్నే ఆర్థిక వృద్ధి

కేంద్రం తలదన్నే ఆర్థిక వృద్ధి

  • తెలంగాణలో ఆరేండ్లలోనే అనూహ్య ప్రగతి
  • జీఎస్డీపీ రూ.4 లక్షల కోట్ల నుంచి రూ.9.6 లక్షల కోట్లకు పెరుగుదల
  • తలసరి ఆదాయం 95వేల నుంచి రూ.2.28 లక్షలకు వృద్ధి
  • సుస్థిర ప్రభుత్వం.. సమర్థ పాలనతోనే సాధ్యమన్న నిపుణులు
  • కేంద్రంలో సగానికి తగ్గిన జీడీపీ.. అధఃపాతాళానికి ఆర్థిక వృద్ధి

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన ఆరేండ్లలోనే ఆర్థికంగానే కాకుండా ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలలో విప్లవాత్మక అభివృద్ధిని సాధించింది. సొంత రాబడులు రెట్టింపయ్యాయి. లోటు నుంచి మిగులు బడ్జెట్‌ రాష్ట్రంగా ఆవిర్భవించింది. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న ప్రధాన నినాదాలతో తెచ్చుకున్న తెలంగాణ ఆ మూడు రంగాలలో విశేష ప్రగతిని సాధించింది. రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణ స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) రూ.4 లక్షల కోట్లు కాగా ఆరేండ్ల అనంతరం నేడు రూ.9.6 లక్షల కోట్లకు పెరిగింది. ఇంత వేగవంతమైన అభివృద్ధిని సాధించిన రాష్ట్రం మరొకటి ఉండకపోవచ్చన్నది ఆర్థిక నిపుణుల అభిప్రాయం.

 ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: దేశంలో అతి తక్కువ వయస్సున్న కొత్త రాష్ట్రం తెలంగాణ.. ఏర్పడిన అనతికాలంలోనే ఆర్థిక నిపుణులను సైతం ఆశ్చర్యపరిచే ప్రగతిని సాధించింది. జీడీపీలో జాతీయ సగటును తెలంగాణ అధిగమించింది. మరోవైపు తలసరి ఆదాయంలో కూడా తెలంగాణ గణనీయ వృద్ధిని సాధించింది. రాష్ట్రం ఏర్పడకముందు అనగా 2014 నాటికి తెలంగాణలో తలసరి ఆదాయం రూ.95,361 కాగా, ఆ తరువాత నాలుగేండ్లలోనే ఎకాఎకిన రూ.2.28 లక్షలకు పెరిగింది. ఇది కూడా జాతీయ సగటుకన్నా రెండింతలు అధికం కావడం గమనార్హం. మరోవైపు గత ఆరేండ్లలో కేంద్రంలో బీజేపీ సర్కార్‌ అధికారం చేపట్టిన నాటి నుంచి జీడీపీ వృద్ధిరేటు దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు మాదిరిగా అధఃపాతాళానికి దిగజారింది. దేశ తలసరి ఆదాయం సగటు రూ.1.34 లక్షలుగా ఉండటం ఆర్థిక వ్యవస్థ అధోగతికి నిదర్శనమని నిపుణులు పేర్కొంటున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ దీనావస్థకు చేరిందని, బంగ్లాదేశ్‌, శ్రీలంక కన్నా అధ్వానంగా మారిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) పేర్కొంది. బంగ్లాదేశ్‌లో మహిళా సాధికారత, తలసరి ఆదాయం, జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయని ఐఎంఎఫ్‌ తన తాజా నివేదికలో వెల్లడించింది. మరోవైపు ఆరేండ్ల క్రితమే ఏర్పడిన తెలంగాణ మాత్రం ఆర్థికరంగంలో దూసుకుపోతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. 

సొంత రాబడిలో అగ్రగామి

తెలంగాణ ప్రభుత్వం ఓవైపు భారీ స్థాయిలో సంక్షేమ పథకాలు అమలుచేస్తూనే మరోవైపు ప్రజలపై భారం పడకుండా ఆదాయాన్ని గణనీయంగా పెంచుకున్నది. రాష్ట్రం ఏర్పడే నాటికి సొంత ఆదాయం రూ.35వేల కోట్లు కాగా ప్రస్తుతం రూ.80వేల కోట్లకు పెరిగింది. సొంత రాబడుల వృద్ధిరేటులో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలువడం మరో విశేషం. ఇతర రాష్ర్టాల ఆదాయ వృద్ధి రేటు సగటున 9.7 శాతం ఉండగా, తెలంగాణ ఆదాయ వృద్ధిరేటు 16 శాతంగా ఉన్నది. తెలంగాణ ఏర్పడినప్పుడు బడ్జెట్‌ లోటు రూ.5,547 కోట్లు కాగా ఆ మరుసటి సంవత్సరమే పరిస్థితి తారుమారై మిగులు రాష్ట్రంగా ఆవిర్భవించింది. గత ఆరేండ్లుగా వరుసగా మిగులు రాష్ట్రంగా నిలిచింది.  రాష్ర్టాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు పూర్తిస్థాయి ఫలితాలిచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు సుస్థిర పాలనను అందిస్తూ టీఎస్‌ఐపాస్‌ వంటి సులభతర వాణిజ్య విధానాలను అవలంబిస్తూ ఉత్పత్తులకు, సేవారంగాలకు అత్యంత అనువైన ప్రాంతంగా తీర్చిదిద్దడంతో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. సేవారంగంలో అనూహ్యమైన ప్రగతి చోటుచేసుకుంది. ఐటీ ఉత్పత్తుల ఎగుమతిలో తెలంగాణ దేశంలోనే అగ్రభాగాన  నిలిచింది. 

కేంద్రంలో తారుమారు - తగ్గిన జీవన ప్రమాణం

 రాష్ట్రంలో సుస్థిరపాలన ఉంటే ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి. ప్రభుత్వ పాలనలో పారదర్శకత, శాంతిభద్రతలు బాగుంటే పెట్టుబడులు వెల్లువెత్తుతాయి, కొత్త పరిశ్రమలు వస్తాయి, ఐటీ ఉత్పత్తులు, ఎగుమతులు పెరుగుతాయి. అంతా బాగుంటే ప్రజల ఆదాయం పెరిగి రాష్ట్ర మొత్తం సంపద వృద్ధి చెందుతుంది. తద్వారా పన్నుల రాబడి కూడా పెరుగుతుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆర్థిక పరిస్థితి అత్యంత పటిష్ఠంగా మారిందని ‘డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌' నివేదిక పేర్కొంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి జీఎస్డీపీని ప్రధాన సూచికగా పరిగణిస్తారు. తలసరి ఆదాయాన్ని ప్రజల జీవన ప్రమాణాలకు ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ రెండింటిలోనూ తెలంగాణ దేశ సగటును దాటి అనూహ్యమైన వృద్ధిని సాధించిందని ఆ నివేదిక తెలిపింది.అయితే ఈ ఏడాది కరోనా ప్రభావం రాష్ట్ర ఆర్థిక ప్రగతిపై కొంతమేరకు ఉండవచ్చని అభిప్రాయపడింది.