మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 07, 2020 , 01:10:18

దేశ ఆర్థికం తలకిందులు!

దేశ ఆర్థికం తలకిందులు!
  • 6.8 నుంచి వేగంగా 4.5 శాతానికి తగ్గిన జీడీపీ
  • ఏడాదికిందటే సీఎం కేసీఆర్‌ హెచ్చరిక
  • నిర్దిష్ట సూచనతో ఆర్థిక సంఘానికి నివేదిక
  • ఇప్పటికీ కండ్లు తెరువని కేంద్రప్రభుత్వం

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: దేశ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్నది. గత ఏడేండ్లలో ఎన్నడూ లేనిరీతిలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) పతనావస్థకు చేరింది. సరిగ్గా ఏడాది వ్యవధిలో 2019-20 తాజా లెక్కల ప్రకారం కేంద్ర జీడీపీ వృద్ధిరేటు స్థిరధరల వద్ద 6.8 నుంచి 4.5 శాతానికి క్షీణించడం ఆందోళన కలిగిస్తున్నది. దిశ, దశ లేకుండా కొనసాగుతున్న భారత ఆర్థికరంగం త్వరలో సంక్షుభిత పరిస్థితిని ఎదుర్కోబోతున్నదని ఏడాది కిందటే సీఎం కేసీఆర్‌ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వాన్ని, 15వ ఆర్థికసంఘాన్ని అప్రమత్తం చేశారు. గత ఏడాది ఫిబ్రవరి 19న రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆర్థికసంఘానికి దేశఆర్థిక వ్యవస్థ పటిష్ఠత కోసం నిర్దిష్టమైన సూచనలు, సలహాలతో ‘బ్రాడ్‌ నేషనల్‌ ఇంటరెస్ట్స్‌ అండ్‌ కన్‌సర్న్స్‌' పేరిట సమగ్ర నివేదిక సమర్పించారు. 


రాష్ర్టాలు బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుందని, కొత్త ఆర్థికవిధానం అవసరమని స్పష్టంచేశారు. విస్తృత ప్రయోజనాల కోసం సంకుచిత విధానాలను వీడాలని రాష్ర్టాలకు ఆర్థిక స్వేచ్ఛ, తోడ్పాటు, అధికారాలు ఇవ్వాలని.. కేంద్రీకృత అభివృద్ధే జాతీయ అజెండాగా వికేంద్రీకరణ దిశగా అడుగులేయాలని సూచించినా పట్టించుకోలేదు. ఉలుకూపలుకూ లేని కేంద్రప్రభుత్వం సంప్రదాయ ఆలోచనా విధానాలనే కొనసాగించడంతో ఆర్థికవ్యవస్థ మరింత దిగజారింది. ముఖ్యమంత్రి అంచనా వేసినట్టే ఏడాదిలో దేశ ఆర్థికవ్యవస్థ మరింత దిగజారింది. అదే సమయంలో తెలంగాణ ఆర్థికవ్యవస్థను పరుగులు పెట్టించి, దేశానికే తమ ఆర్థిక వ్యవస్థ దిక్సూచి అని నిరూపించారు.


రాష్ట్రంలో 10.5 శాతంగా ఉన్న వృద్ధిరేటు 8.5 శాతానికి తగ్గే అవకాశముందని అంచనావేశారు. ప్రతీసారి జాతీయ సగటు కంటే తెలంగాణ జీడీపీ ఎంతో మెరుగ్గా ఉంటున్నది. ఈ సారి కూడా అదే పరిస్థితి ఉండటం విశేషం. ప్రగతిశీల విధానాలతో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న తెలంగాణ వంటి రాష్ర్టాలకు అస్తవ్యస్త భారత ఆర్థికవ్యవస్థ శాపంగా మారుతున్నది. అభివృద్ధి చెందుతున్న రాష్ర్టాలను ప్రోత్సహించకపోగాపోగా ఆర్థికగ్రాంట్ల వెయిటేజీని తగ్గించి నిరుత్సాహానికి గురిచేస్తున్నది. కేంద్రానికి మరోసారి ఆర్థికవ్యవస్థపై దిశానిర్దేశం చేస్తూ 15వ ఆర్థిక సంఘానికి సమగ్రనివేదికను ఇచ్చే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తున్నది.  


సీఎం సూచనలపై ఆర్థికసంఘం సంతృప్తి 

మనకంటే తక్కువ వనరులుండి, తక్కువ అవకాశాలున్న దేశాలు ఎలా ముందుకు దూసుకుపోతున్నాయి? ఏవిధంగా సంపద పెంచుకుంటున్నాయో ఆలోచించాలని తన నివేదికలో సీఎం కేసీఆర్‌ సూచించారు. భారత్‌ కంటే వెనుకబడిన, నిరుపేద దేశాలు కూడా వేగంగా అభివృద్ధి చెంది, ఆర్థిక పరిపుష్టి సాధించాయంటూ వివరించారు. 1971 వరకు చైనా జీడీపీ భారత జీడీపీ కన్నా తక్కువే. 1979 నుంచి 1992 వరకు వృద్ధిరేటు నమోదుచేసింది. 1992 నుంచి సుమారు 25 ఏండ్లుగా చైనా ఆర్థికవ్యవస్థ పరుగులు తీస్తున్నది. ఇప్పుడు చైనా జీడీపీ మన దేశ జీడీపీ కన్నా నాలుగురెట్లు ఎక్కువని గుర్తుచేశారు. 


ఇప్పటివరకు దేశ అభివృద్ధి కేవలం 8 నుంచి 10 రాష్ర్టాల అభివృద్ధిగా మారిందని, దేశానికి కొత్త ఆర్థికవిధానం కావాలని సూచించారు. వ్యవసాయం, నీటి వనరుల వినియోగం, ప్రాజెక్టుల వివాదాల పరిష్కారంలో ఇబ్బందులున్నాయని.. రైతులను ఆదుకొనేందుకు మరిన్ని నూతన విధానాలు అవసరమని సూచించారు. కేంద్రానికి ఆదర్శంగా రాష్ట్రంలో అమలుచేస్తున్న పలు పథకాలను పేర్కొన్నారు. ప్రగతి శీల విధానాలతో అభివృద్ధి చెందుతున్న జాబితాలో ఉన్న దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మలువాలని చెప్పారు. ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా జాతి అభివృద్ధిని కాంక్షించి ఇచ్చిన నివేదిక ఆలోచింపజేసిందని, తప్పకుండా పరిగణనలోకి తీసుకుని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని ఆర్థికసంఘం చైర్మన్‌ ఎన్‌కే సింగ్‌ చెప్పారు. కానీ నివేదిక సమర్పించి ఏడాదైనా కేంద్రం పట్టించుకోలేదు. 


logo
>>>>>>