గురువారం 28 మే 2020
Telangana - May 11, 2020 , 01:00:59

15 చోట్ల గేజ్‌ మీటర్లు!

15 చోట్ల గేజ్‌ మీటర్లు!

  • కాళేశ్వరంపై అడుగడుగునా ప్రవాహం వివరాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఒక్క కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో ఏడాదికి కనీసం 530 టీఎంసీల గోదావరి జలాలను వినియోగించుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రధానంగా వరద అంచనా, మోటర్ల ఆపరేషన్‌, సమగ్ర సద్వినియోగంపై త్రిముఖ వ్యూహంతో ముందుకెళ్లాలని యోచిస్తున్నది. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో సెన్సార్ల ద్వారానే ప్రవాహ సామర్థ్యాన్ని అంచనావేసే పరికరాలను విరివిగా ఏర్పాటుచేయాలనే ఆలోచనలో ఉన్నది. ఇందుకోసం గోదావరిజలాలను అంచనా వేసేందుకుగాను కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో గేజ్‌ మీటర్లు ఏర్పాటుచేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈఎన్సీలు ఎన్‌ వెంకటేశ్వర్లు, హరిరాం, అనిల్‌కుమార్‌తో కమిటీని ఏర్పాటుచేసింది. గేజ్‌మీటర్ల ఏర్పాటుపై సమగ్రంగా అధ్యయనం చేసిన కమిటీ మొత్తం 15 ప్రాంతాలను సూచిస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది.

సెన్సర్ల ద్వారా రీడింగ్‌

ప్రధాన గోదావరిలోకి వచ్చి కలిసే మానేరు, కడెం ప్రాజెక్టు వరద, మధ్యలో చెరువుల నుంచి వచ్చికలిసే కీలకమైన పాయింట్లు, ఎగువన తమ్మిడిహట్టి, ఆపై దిగువన మరో గేజ్‌ (టెక్రాకు ఎగువన) ఏర్పాటుకు అధికారులు సర్వేచేశారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నిరిజర్వాయర్లు, వాటినుంచి సాగునీటినందించేందుకు నిర్మించిన కాల్వలతోపాటు తదుపరి జలాశయానికి నీటిని తరలించేందుకు నిర్మించిన కాల్వలపైనా వీటిని అమర్చనున్నారు. 


logo