సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 05, 2020 , 02:12:24

లాడ్జిలో ఇంటర్వ్యూ.. అడవిలో కూంబింగ్‌

లాడ్జిలో ఇంటర్వ్యూ.. అడవిలో కూంబింగ్‌
  • రైల్వే, అటవీ, పోస్టల్‌ ఉద్యోగాల పేరిట టోకరా
  • 30 మంది నుంచి రూ.48 లక్షలకుపైగా వసూలు
  • మహిళ నేతృత్వంలోని ముఠా అరెస్టు

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఉద్యోగానికి దరఖాస్తులు తీసుకుంటారు.. ఇంటర్వ్యూకోసం లెటర్‌ వస్తుంది.. ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.. ఉద్యోగం వచ్చినట్టు సర్వీస్‌బుక్‌లో సంతకం కూడా తీసుకుంటారు.. ట్రైనింగ్‌ ఇస్తారు.. ఉద్యోగం వచ్చినవారితో అడవిలో కూంబింగ్‌ చేయిస్తారు.. ప్రభు త్వ ఉద్యోగం కోసం ఎలాంటి దశలు ఉం టాయో ఇక్కడ అన్నీ ఉంటాయి కానీ.. అది ప్రభుత్వ ఉద్యోగం మాత్రం కాదు.. ప్రైవేట్‌ ఉద్యోగం కూడా కాదు.. రైల్వే, అటవీ, పోస్టల్‌ శాఖల్లో ఉద్యోగాల పేరిట ఓ ముఠా చేస్తున్న మోసం ఇదీ. బాధితుల ఫిర్యాదుతో ఎస్వోటీ పోలీసులు ముఠా గుట్టును రట్టుచేశారు. మహిళ సహా ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో అదనపు పోలీసుకమిషనర్‌ సుధీర్‌బాబు వెల్లడించిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌ జిల్లా టేకుర్తి గ్రామానికి చెందిన స్వాతిరెడ్డి అలియాస్‌ శివరంజిని.. రాధాకృష్ణ (దిల్‌సుఖ్‌నగర్‌), మహ్మద్‌ అజీముద్దీన్‌ (రామంతాపూర్‌), జగదీశ్‌కుమార్‌ నాయుడు (శ్రీకాకుళం), ఓబుల్‌రెడ్డి, రమేశ్‌బాబు, మహ్మద్‌ ఖాలీద్‌ఖాన్‌ (కడప), బీవీ మధుసూదన్‌ (సీతాఫల్‌మండి-రైల్వే ఉద్యోగి)తో ముఠాను తయారుచేసింది. 


రైల్వే, అటవీశాఖ, పోస్టల్‌ డిపార్ట్‌మెంట్లలో బ్యాక్‌డోర్‌ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల వద్ద లక్ష నుంచి రూ.6.5 లక్షల వరకు వసూలుచేశారు. 25 నుంచి 30 మంది వద్ద దాదాపు 48 లక్షలు వసూలుచేశారు. డబ్బులు ఇచ్చిన నిరుద్యోగులను చాదర్‌ఘాట్‌లోని ఓ లాడ్జిలో స్వాతిరెడ్డి, రాధాకృష్ణ ఇంటర్వ్యూలు నిర్వహించేవారు. తర్వాత అక్కడే సర్వీస్‌బుక్‌ అంటూ ఓ పుస్తకం చూపి అందులో సంతకంతోపాటు, వేలిముద్ర వేయించుకునేవారు. అనంతరం వారిని స్వాతిరెడ్డి రైలు నిలయం వద్దకు తీసుకెళ్లి.. రైల్వే ఉద్యోగి ముధుసూదన్‌తో మాట్లాడించేది. ఇదంతా చూసి నిరుద్యోగులు నిజంగానే ప్రభుత్వఉద్యోగం ఖాయమనుకుని మురిసిపోయారు.


ఘట్‌కేసర్‌లో శిక్షణ

ఉద్యోగంలో చేరడానికి ముందు ఘట్‌కేసర్‌లో శిక్షణ ఉన్నదని నిరుద్యోగులను అక్కడకు పంపేవారు. అక్కడ అజీముద్దీన్‌..డౌన్‌లోడ్‌ చేసుకున్న కొన్ని విషయాలను గంటపాటు చెప్పి పంపించేవాడు. తర్వాత అపాయింట్‌మెంట్‌ లేఖలు తీసుకుని బాధితులు రైల్వే నిలయానికి వెళ్లగా అవి నకిలీవని తేలింది. స్వాతిరెడ్డికి ఫోన్‌చేయగా స్విచ్ఛాఫ్‌ అని రావడంతో మోసపోయాని గ్రహించినవారు ఎల్బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు.


కూంబింగ్‌ అంటూ అడవిలోనే..

అటవీశాఖలో ఉద్యోగాలపేరిట ఎంపిక చేసిన 15మందిని రమేశ్‌బాబు ఏకంగా కడప సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. 15 రోజుల పాటు కూంబింగ్‌ చేయాల్సి ఉంటుందంటూ అక్కడే వదిలేశాడు. సాయంత్రం వరకు అక్కడే భయంగా గడిపిన బాధితులు రోడ్డుమీదకు వచ్చి ఇండ్లకు చేరుకున్నారు. దీనిపై కూడా బాధితులు ఎల్బీనగర్‌ పీఎస్‌లో ఫిర్యాదుచేశారు. రాచకొండ సీపీ మహేష్‌భగవత్‌ ఆదేశాలతో రంగంలోకి దిగిన మల్కాజిగిరి ఎస్వోటీ ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌కుమార్‌ బృందం ఫిబ్రవరి 28న ఇద్దరిని, మార్చి 4న ఐదుగురిని అరెస్టుచేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి రూ.48 లక్షలు, నకిలీ అపాయింట్‌మెంట్‌ లేఖలు, మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాతిరెడ్డి రెండేండ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల పేరిట మోసానికి పాల్పడుతూ రెండుసార్లు అరెస్టు అయిందని పోలీసులు వివరించారు. ముఠాను పట్టుకున్న సిబ్బందిని అదనపు సీపీ సుధీర్‌బాబు అభినందించారు.


logo