మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Sep 02, 2020 , 01:34:41

గంగమ్మ ఒడికి గణనాథుడు

గంగమ్మ ఒడికి గణనాథుడు

  • హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనోత్సవం
  • కొవిడ్‌ నేపథ్యంలో నిరాడంబరంగా వేడుక

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నవరాత్రులు పూజలందుకున్న బొజ్జగణపయ్య గంగమ్మ ఒడికి చేరాడు. మంగళవారం హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనోత్సవం ప్రశాంతంగా, నిరాడంబరంగా సాగింది. మాస్కులు ధరించి, భౌతికదూరం పాటిస్తూ భక్తులు యాత్రలో పాల్గొన్నారు. ఉదయం నుంచే ట్యాంక్‌బండ్‌కు విగ్రహాల రాక మొదలైంది. మధ్యాహ్నం ఎక్కువ విగ్రహాలు వచ్చాయి. బాలాపూర్‌, ఖైరతాబాద్‌ వినాయక విగ్రహాలను ఎన్టీఆర్‌మార్గ్‌లోని నాల్గో క్రేన్‌ వద్ద నిమజ్జనం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 15 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ నిమజ్జన కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షించారు. ప్రశాంత వాతావారణంలో నిమజ్జన కార్యక్రమం పూర్తయింది. ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడలేదు. 

సీఎం కేసీఆర్‌కు బాలాపూర్‌ లడ్డూ

బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూను ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌కు అందించాలని నిర్ణయించినట్టు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కళ్లెం నిరంజన్‌రెడ్డి తెలిపారు. 1994లో బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూ వేలం మొదలైందని.. రాష్ట్రవ్యాప్తంగా ఈవేలం పేరొందిందని చెప్పారు. అయి తే ఈసారి వేలం నిర్వహిస్తే జనం గుమిగూడుతారని, కరోనా వ్యాప్తి చెందుతుందని భావించి నిలిపివేశామని  పేర్కొన్నారు. ఈ ఏడాది లడ్డూను సీఎం కేసీఆర్‌కు ఇవ్వాలని ఉత్సవ కమిటీ, గ్రామకమిటీ, అన్ని పార్టీల నాయకులు ఏకగ్రీవంగా నిర్ణయించారని వెల్లడించారు. సీఎం అపాయింట్‌మెంట్‌ రాగానే ప్రగతిభవన్‌కు వెళ్లి లడ్డూను అందజేస్తామని నిరంజన్‌రెడ్డి చెప్పారు. ఉత్స వకమిటీ నిర్ణయంపై బడంగ్‌పేట కార్పొరేషన్‌ మేయర్‌ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి హర్షం వ్యక్తంచేశారు.


logo