సోమవారం 03 ఆగస్టు 2020
Telangana - Jul 30, 2020 , 02:59:14

ఊపిరికి ఊపిరిలా..

ఊపిరికి ఊపిరిలా..

  • కరోనాతో గాంధీ వైద్యుల రాజీలేని పోరాటం  
  • రోగులకు దగ్గరగా, కుటుంబాలకు దూరంగా..
  • ప్రతిరోజు 12 గంటలు రోగుల సేవలోనే  

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కరోనాకు భయపడి ప్రజలంతా ఇంట్లో ఉంటుంటే, వైద్యులు, వైద్య సిబ్బంది మాత్రం ప్రాణాలను పణంగా పెడుతున్నారు. కుటుంబాలకు దూరంగా, రోగులకు దగ్గరగా ఉంటూ మానవత్వానికి పర్యాయపదం చెప్తున్నారు. కష్టకాలంలో కలిసికట్టుగా కరోనాతో కొట్లాడుతున్నారు. ముఖ్యంగా పూర్తిస్థాయి కొవిడ్‌ హాస్పిటల్‌గా మారిన గాంధీ దవాఖానలో వైద్యులు కష్టాలు పడుతున్నా, ఎందరినుంచో నీలాపనిందలు ఎదువుతున్నా వాటన్నింటినీ దిగమింగుకొని అంకితభావంతో సేవలు అందిస్తున్నారు. రాత్రి, పగలు అన్న తేడాలేకుండా ప్రతి క్షణం రోగులకు సపర్యలు చేస్తున్నారు. ఊపిరి పోతున్న వారికి ఊపిరి పోస్తూ, మానసిక ధైర్యం నూరిపోస్తూ.. ప్రాణాలను కాపాడుతున్నారు. చెరువులో ఉండి నీళ్లకు దూరంగా ఉన్నట్టు ఇంట్లోనే ఉంటూ కుటుంబసభ్యులతో భౌతిక దూరం పాటిస్తున్నారు. కొందరు దవాఖానలోని హాస్టళ్లలో ఉంటూ, హోటళ్లలో బసచేస్తూ కష్టాన్ని అనుభవిస్తున్నారు. రెండు వేల పడకల సామర్థ్యం ఉన్న గాంధీ దవాఖానలో సుమారు 3వేల మంది వైద్యులు, నర్సింగ్‌, ల్యాబ్‌, పారామెడికల్‌, పారిశుధ్య సిబ్బంది విడతలవారీగా సేవలు అందిస్తున్నారు. వారం పాటు విధులు నిర్వహించి మరో వారం హోమ్‌ క్వారంటైన్‌లో గడిపి తిరిగి విధుల్లో చేరుతున్నారు.

12గంటల పాటు నిర్విరామంగా సేవలు

సాధారణంగా రెండు, మూడు గంటలు విరామం లేకుండా పనిచేస్తే అలసిపోయి కాసేపు విరామం తీసుకుంటాం. కాని ప్రస్తుతం గాంధీలో వైద్యసిబ్బంది 6 నుంచి 12 గంటల పాటు నిర్విరామంగా రోగులకు సేవలందిస్తున్నారు. సరిగ్గా ఊపిరి ఆడకున్నా 6 నుంచి 8 గంటలపాటు పీపీఈ కిట్లు, మాస్కులతోనే గడుపుతున్నారు. 

రెండువేలకు పైగా వైద్యసిబ్బంది:

పూర్తిస్థాయి కరోనా హాస్పిటల్‌గా సేవలందిస్తున్న గాంధీలో వెయ్యి మంది వైద్యులు, 530 మంది నర్సింగ్‌ సిబ్బంది, 320మంది వార్డు బాయ్‌లు, 200 మంది పేషెంట్‌ కేర్‌ సిబ్బంది, 60మంది సెక్యూరిటీ సిబ్బంది, 100 మంది ల్యాబ్‌ టెక్నీషియన్లు కొవిడ్‌ రోగులకు సేవలు అందిస్తున్నారు.


హోటళ్లు, వసతి గృహాల్లో బస చేస్తూ..

ఇండ్లలో చిన్నపిల్లలు, వృద్ధులు ఉండటం, అపార్ట్‌మెంట్లు, అద్దె ఇండ్లలో స్థానికుల నుంచి అభ్యం తరాల వల్ల కొందరు వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది, ఇతర సిబ్బంది దవాఖాన పరిసరాల్లోని హోటళ్లు, దవా ఖానలోని వసతి గృహాలలోనే బసచేస్తూ విధులకు హాజరవుతున్నారు. కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి లేకున్నా రోగుల బాగోగుల్లోనే సంతృప్తిని వెతుక్కుంటున్నారు.

గుండె మీద చేయి వేసుకొని గాంధీకి రండి 

రోగుల ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డుపెడుతున్నాం. నిరుపేద, మధ్యతరగతి ప్రజలు కార్పొరేటు దవాఖానలకు వెళ్లే పరిస్థితి ఉండదు. అలాంటివారికి గాంధీ దవాఖాననే పెద్ద దిక్కు. ఇక్కడ ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలు కల్పించింది. మీడియాలో వచ్చే కథనాలు మాకు ముఖ్యం కాదు. కుటుంబాలకు దూరంగా ఉంటూ ఒత్తిడిలోనూ రోగులకు సేవలందిస్తున్నాం. నేను నాలుగున్నర నెలలుగా ఒక్క సెలవు కూడా తీసుకోలేదు. రోగులు పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జి అయినప్పుడు ఆ ఒత్తిడిని మర్చిపోతాం. దాదాపు 90 నుంచి 95శాతం మంది పూర్తిగా కోలుకుని ఇండ్లకు వెళ్తున్నారు. రోగులు గుండె మీద చేయి వేసుకుని గాంధీ దవాఖానకు రావచ్చు. వదంతులు నమ్మకుండా ప్రాణాలు కాపాడుకోండి.

- డాక్టర్‌ రాజారావు, సూపరింటెండెంట్‌, గాంధీ దవాఖాన

విపత్తులో సేవ సంతృప్తిగా ఉన్నది

విపత్తులో రోగులకు సేవలందిస్తున్నామన్న సంతృప్తి మాకుంది. పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేస్తున్న 200 మంది వైద్యులం రోజుకు 6నుంచి 12 గంటల సమయం రోగుల వద్దే ఉండి సేవలు అందిస్తున్నాం. ఐదు రోజుల పాటు విధులు నిర్వర్తించి, మరో ఐదురోజులు క్వారంటైన్‌లో ఉంటున్నాం. మాకు సీనియర్‌ డాక్టర్ల సహకారం, ప్రోత్సాహం మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నది. మా పీజీ సంవత్సరం వృథా అవుతుందేమోనన్న ఆందోళన మొదట్లో ఉన్నా ఈ కరోనా యుద్ధంలో ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా ఉండటం అదృష్టంగా భావిస్తున్నాం.

- డాక్టర్‌ కొమ్ము ప్రశాంతి, రేడియాలజిస్టు పీజీ


logo