మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Sep 10, 2020 , 03:52:03

‘గగన్‌యాన్‌'కు మిధాని చేయూత

‘గగన్‌యాన్‌'కు మిధాని చేయూత

  • అంతరిక్షనౌక చాంబర్‌ తయారీలో కీలకపాత్ర
  • సీట్ల తయారీ సంబంధ వస్తువులు ఇస్రోకు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గగన్‌యాన్‌! భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు. వచ్చే ఏడాది చంద్రుడి వద్దకు ముగ్గురు వ్యోమగాములను పంపాలన్న లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో హైదరాబాద్‌ సంస్థ మిశ్ర ధాతు నిగం లిమిటెడ్‌ (మిధాని) కీలకపాత్ర పోషిస్తున్నది. గగన్‌యాన్‌ కోసం రూపొందిస్తున్న అంతరిక్షనౌకలోని సిట్టింగ్‌ ఏరియా ఉండే టైటానియం చాంబర్‌ తయారీకి అవసరమైన వస్తువులను మిధా ని రూపొందించింది. ఈ మెటీరియల్‌ను ఇస్రోకు ఒకే విడతలో పంపినట్టు సంస్థ సీఎండీ సంజయ్‌కుమార్‌ ఝా తెలిపారు. పీఎస్‌ఎల్వీ, జీఎస్‌ఎల్వీల్లో రాకెట్‌మోటార్‌ కేసింగ్‌ మెటీరియల్‌ను మిధాని పంపిందని గుర్తుచేశారు. భారత్‌, ఇస్రో, మిధానికి గగన్‌యాన్‌ గొప్ప ఆవిష్కరణ అవుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. 2021 డిసెంబర్‌లో ప్రయోగించాలని భావిస్తున్న ఈ అంతరిక్ష నౌకలో ప్రయాణించేందుకు నలుగురు భారత వాయుసేనకు చెందిన అధికారులకు రష్యాలో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. వీరిలో ముగ్గురిని చంద్రుడి వద్దకు పంపాలని ఇస్రో యోచిస్తున్నది.


logo