మన పదాలకు దడి

- తెలంగాణ యాసను కాపాడుతున్న ‘గడిగోలు’
- యాది మరుస్తున్న పదాలకు పునర్జీవం
- 13 వేల మంది ‘సోషల్' సైన్యం సమిష్టి కృషి
- ఇప్పటికే 50 వేలకుపైగా పదాల సేకరణ
పత్తి పెన్ను, ములికి, గోందు/బంక, పన్గడి, సక్లం ముక్లం, ఎగిర్తం, సడ్డమల్లెతనం, తాపతాపకు, ఏంచు, దేవులాడు.. కొందరికి ఈ పదాలు ఇనంగనే యాది గతంలకు మళ్లుతది.. మరికొందరికి ఇదేదో కొత్త భాష లెక్క అనిపిస్తది.. ఇవి అచ్చ తెలంగాణ పదాలు.. మనకే ప్రత్యేకమైన యాస పరిమళాలు... 30 ఏండ్ల వయసుదాటిన్నోళ్లకు ఈ పదాలన్నీ ఎరుకే. ఇప్పటితరానికి కొత్తగా నేర్పియ్యాల్సిన పరిస్థితి. ఆ బాధ్యతను ‘గడిగోలు’ తీసుకున్నది.
ఇప్పుడు మనం మాట్లాడుతున్నది మిక్స్డ్ భాష. ఆంధ్ర, ఇంగ్లిష్ పదాలు కలగలిపిన పాలిష్డ్ భాష. మనం చిన్నప్పుడు పలికిన పదాలు ఇప్పుడు ‘మోటు’గా అనిపిన్నయి. కానీ, అవన్నీ మన గతానికి, తెలంగాణ జీవనానికి మచ్చుతునకలు.
ఈ పక్క చిత్రంలో కనిపిస్తున్న ప్రక్రియ.. పచ్చగోల్! ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తాతలకాలంనాటి వ్యవసాయ సంప్రదాయం. యాసంగి సీజన్లో నెలలోపు పొలం పచ్చగుండాలని పచ్చపురుగు రాకుండా రాత్రి పూట దీపం వెలిగించి, అట్టిచేపల కూర నైవేద్యం పెట్టి పొలమంతా గుడాలు చల్లి, మైసమ్మకు మొక్కు సమర్పించే ఆనాటి గొప్ప సంస్కృతి. ఇలాంటి ఎన్నో పదాలను ‘గడిగోలు’ వెలుగులోకి తెస్తున్నది.
హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): గడిగోలు.. ఓ ఫేస్బుక్ పేజీ. మరుగున పడుతున్న తెలంగాణ పదాలు, సామెతలు, ఇరిసెలను (వస్తువులు) పంచుకొనే ఆన్లైన్ వేదిక. జగిత్యాలకు చెందిన తాండ్ర సుధీర్‌కుమార్ ఆలోచనల్లో నుంచి పుట్టిన ‘తెలంగాణ డిజిటల్ భాషోద్యమం’ ఇది. సెలవుల్లో సొంతూరికి పోయినప్పుడో.. పల్లెల్లో చుట్టాలింటికి పోయినప్పుడో అక్కడ అమ్మమ్మ, బాపమ్మ, తాతలు మాట్లాడే భాష, ఉపయోగించే పదాలు కొత్తగా అనిపించినా, అచ్చ తెలంగాణ పదాలతో నిం డిన వారి యాస అర్థం కాకపోయినా మనం మన మూలం నుంచి దూరంగా వెళ్లామన్నమా ట. సుధీర్కూ ఇలాంటి అనుభవమే ఎదురైంది. చిన్నప్పుడు మాట్లాడిన మాటలే ఇప్పుడు కొత్తగా అనిపించడం నామోషీగా అయింది. తెచ్చిపెట్టుకున్న ఆంధ్ర పదాలు, ఆంగ్ల పదాలతో నిండిన పాలిష్డ్ భాషను మాట్లాడుతున్నందుకు సిగ్గేసింది. ఆ వెంటనే అచ్చ తెలంగాణ పదాలను సేకరించాలన్న ఆలోచన తట్టి 2017 నవంబర్ 12న ‘గడిగోలు’ పేరుతో ఫేస్బుక్ పేజీని ప్రారంభించారు. దొడ్డిలోని పశువులు బయటికి వెళ్లకుండా గడికొయ్యలు లేదా దడి అడ్డుగా కడుతుంటారు. ఆదిలాబాద్ ప్రాంతం లో దీనిని ‘గడిగోలు’ అని అంటారు. ‘తెలంగాణ పదాలను కాపాడి కంచె కడుతున్నం.. అదే మా గడిగోలు’ అని సుధీర్ పేర్కొంటున్నారు.
13 వేల మంది సాయం
సుధీర్ ఆలోచనకు ఫేస్బుక్ మిత్రులు అం డగా నిలిచారు. ఇప్పుడు గడిగోలు పేజీకి 13,200 మంది అభిమానులున్నారు. ఇం దు లో అన్ని వయసులవారు, అన్ని హోదాల ఉద్యోగులున్నారు. ఇప్పుడు పెద్దగా వాడుకలోలేని, కనుమరుగయ్యే దశలోఉన్న తెలంగాణ పదాలు, వస్తువుల పేర్లు, సామెతలను పోస్ట్ చేస్తున్నారు. ఒక వస్తువును లేదా పదాన్ని తెలంగాణలోని ఒక్కో ప్రాతంలో ఒక్కో రకంగా పలుకుతారు. పోస్ట్ కింద వచ్చే కామెంట్లలో.. ఆ యా ప్రాంతాల్లో దానిని ఏమంటారో వివరిస్తూ అర్థవంతమైన చర్చను కొనసాగిస్తున్నారు. వాటిని నిర్దారించుకొనేందుకు ఒక్కో ప్రాంతం నుంచి అడ్మిన్‌ను ఎంచుకున్నారు. ప్రస్తుతం ఈ పేజీకి 20 మంది అడ్మిన్లు ఉన్నా రు. ఫలితంగా నానార్థాలు లేదా పర్యాయపదాల రూపకల్పన కూడా జరుగుతున్నది. ఈ పేజీలోకి ఒక్కసారి తొంగిచూస్తే ఎవరైనా బా ల్యంలోకి వెళ్లిపోవాల్సిందే. పెద్దపెద్ద ఆఫీసర్లు కూడా మా పేజీకి వచ్చి చిన్న పిల్లలుగా మారిపోతున్నారంటూ పేజీ అడ్మిన్లు గర్వంగా చెప్తున్నారు.
3 లక్షల పోస్టులు..50 వేల పదాలు
గడిగోలు పేజీకి నాలుగేండ్లలోనే 3 లక్షలకుపైగా పోస్టులు వచ్చాయి. ఇప్పటివరకు 50 వేలకు పైగా పదాలను సేకరించారు. తెలంగాణకే ప్రత్యేకమైన వస్తువులు (ఇసిరెలు), పువ్వులు, ఆహారపదార్థాలకు సంబంధించి 1,500 ఫొటోలు ఉన్నాయి. భాగవతులు, చిందు ఆటలు, బుడిగె జంగాలు, సాధనాసూరుల ఆటలు వంటి అంతరించిపోతున్న తెలంగాణ జానపద కళల ఫొటోలు, వీడియోలు కూడా సేకరించారు. వరినాట్లు వేసుకుంటూ మహిళలు పాడే పాటలే 30 నుంచి 40 వరకు ఉన్నాయని నిర్వాహకులు పేర్కొన్నారు. తమవద్ద మొత్తం 20వేల పేజీల డాటా ఉన్నదని, వాటిని కుదించే పనిలో పడ్డామని చెప్తున్నారు. వీటిని కుదిస్తే వెయ్యి పేజీల వరకు వచ్చే అవకాశం ఉన్నదని, వాటిని పుస్తక రూపంలో తీసుకురావడమే తమ తక్షణ కర్తవ్యమని చెప్పారు. వీరి కృషికి తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ సహకారం అందిస్తున్నారు.
‘నా ఆవుసు పోసుకొని బతుకు బిడ్డా’ అన్నడు
దశాబ్దాలుగా భాష గురించి అవహేలన పడ్డం. సొంత రాష్ట్రంలోనైనా తెలంగాణ భాషకు ఏదైనా చేయాలన్న తపనతో దీన్ని మొదలుపెట్టిన. అచ్చ తెలంగాణ పదాలకు
గడిగోలు వేస్తున్నం. ఇక ఆ పదాలు ఎటూపోవు. మా పేజీని చూడంగనే పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నవాళ్లు కూడా మా నానమ్మ ఇట్లా అంటుండే.. మా తాత ఈ ముచ్చట చెప్తుండే అని చిన్ననాటి గురుతుల్లోకి వెళ్తున్నరు. ఒక గొప్ప వ్యక్తి నాకు ఫోన్‌చేసి ‘నేను 15 ఏండ్లు కష్టపడి చేసిన పదకోశాన్ని నువ్వు రెండుమూడేండ్లలోనే తయారుచేసినవు. తెలంగాణ ఆత్మగల్ల మనిషివి.. నా ఆవుసు పోసుకొని బతుకు బిడ్డా’ అని ఆశీర్వదించిండు. అవి నా జీవితంలో మరిచిపోలేని క్షణాలు. రవీంద్రభారతిలో అడుగుపెట్టాలన్న నా కల గడిగోలు కారణంగానే నెరవేరింది. విజయ్‌కుమార్ చిట్నేని, బుర్ర మనోహర్‌గౌడ్, గర్రెపల్లి నరేశ్, మాల్యాల శేఖర్, స్వర్ణ కిలారి, స్నేహలత మూల, నవీన్ సామల, ఓం ప్రసాద్ తదితరులు నా ప్రయాణంలో.. ఈ విజయంలో భాగస్వాములు. మా పేజీలో రాజకీయ, సినీ, క్రీడా పోస్టులు, బర్త్‌డే విషెస్ ఉండవు. స్వాతంత్య్ర దినోత్సవం, తెలంగాణ భాషా దినోత్సవం, తెలంగాణ అవతరణ దినోత్సవం వరకు మాత్రమే అనుమతి. తెలంగాణ సాంస్కృతిక పదకోశం తయారు చేయాలన్నదే నా లక్ష్యం.
- సుధీర్‌కుమార్
తాజావార్తలు
- నీట్ పీజీ-2021.. పెరిగిన ఫీజు, తగ్గిన ప్రశ్నలు
- టీ20ల్లో రోహిత్ శర్మ రికార్డును బద్ధలుకొట్టిన మార్టిన్ గప్టిల్
- సమంత అభిమానులకు గుడ్ న్యూస్..!
- గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులపై నిషేధం ఎత్తేసిన బైడెన్
- అనుమానాస్పదస్థితిలో ఆటో డ్రైవర్ మృతి
- ఒకే స్కూళ్లో 229 మంది విద్యార్థులకు కరోనా
- ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్య.. కేరళలో బంద్
- నగ్నంగా ఉన్న ఫొటో అడిగిన నెటిజన్.. షేర్ చేసిన శ్రీముఖి
- మణిపూర్‌లో స్వల్ప భూకంపం
- ఆందోళన కలిగిస్తున్న కరోనా.. దేశంలో పెరుగుతున్న కేసులు