శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 21, 2020 , 01:35:45

కేసీఆర్‌ మాటే మా బాట

కేసీఆర్‌ మాటే మా బాట

  • వానకాలంలో ప్రణాళిక ప్రకారమే సాగు 
  • గాదెపల్లి రైతుల ఏకగ్రీవ తీర్మానం
  • సన్నాలు, పత్తిపంట సాగుకు మొగ్గు
  • సీఎం నిర్ణయం మేలు చేస్తుందని ధీమా
  • అభినందిస్తున్న శాస్త్రవేత్తలు, నిపుణులు 

సీఎం కేసీఆర్‌ ప్రతిపాదించిన నియంత్రిత సేద్యానికి అన్నదాతల మద్దతు వెల్లువెత్తుతున్నది. రాష్ట్రంలో తొలిసారిగా జగిత్యాల జిల్లాలోని గాదెపల్లి రైతాంగం సీఎం మాట ప్రకారమే సాగుచేస్తామని బుధవారం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఎవుసానికి అన్ని సౌలత్‌లు కల్పించిన సారు బాటల్నే నడుస్తమని స్పష్టంచేసింది. ‘కరెంట్‌ ఇచ్చిండు, పెట్టుబడి ఇచ్చిండు, పానం పోతే ఐదులచ్చలు అచ్చేటట్టు చేసిండు. కాళేశ్వరం గట్టిండు. ఊరూరికి బీట్లు పెట్టి అడ్లు కొంటుండు. రైతుకు గింతగనం మంచిగ చేసినోడు, ఇప్పుడు చెడిపోవాలని చెప్తడా? మాకు ఆయన మీద నమ్మకముంది’ అని ఘంటాపథంగా చెప్తున్నది.

జగిత్యాల, నమస్తే తెలంగాణ/ ధర్మపురి:  ‘రైతులకు సీఎం కేసీఆర్‌ సారు లెక్క దేశంల ఎవలూ చేయలే. కరెంట్‌ ఇచ్చిండు, పెట్టుబడి ఇచ్చిండు, పానం పోతే ఐదులచ్చలు అచ్చేటట్టు చేసిండు. చెర్లు నింపిండు, కాల్వలు తవ్విచ్చిండు. కాళేశ్వరం గట్టిండు. ఊరూరికి బీట్లు పెట్టి అడ్లు కొంటుండు. అసొంటి సారు ఇప్పు డు, రైతులు సన్నపడ్లు పండించాలె అంటుం డు. పత్తి ఏసుకోండ్రి అని చెప్తుండు. రైతుకు గింతగనం మంచిగ చేసినోడు, ఇప్పుడు చెడిపోవాలని చెప్తడా? ఆయన మీద నమ్మకముం ది. ఆయన ఏం చేయమంటే అదే చేస్తం. ఏది పండియిమంటే అదే పండిస్తం’ అంటూ సీఎం కే చంద్రశేఖర్‌రావు ప్రకటించిన నియంత్రిత సాగు పద్ధతికి జగిత్యాల జిల్లా ధర్మపురి మం డలం గాదెపల్లి రైతులు మద్దతు పలికారు. సీఎం కేసీఆర్‌ చెప్పిన పంటలే వేస్తామని ఏకగ్రీవ తీర్మానంచేశారు. వానకాలం నుంచి గ్రామంలో ఏ రైతులు ఏ పంట సాగుచేయాలని ఆదేశాలు వచ్చినా పాటించాలని నిర్ణయించుకున్నారు. నియంత్రిత సేద్యం నమూనా ప్రకటనపై గాదెపల్లి రైతులు బుధవారం సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్‌ చెప్పిన ప్రకారం పంటలు సాగుచేస్తే ప్రయోజనకరంగా ఉం టుందని అభిప్రాయపడ్డారు. రైతుల సంక్షేమం కోసం ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి చేయనన్ని మంచి పనులు కేసీఆర్‌ చేశారని పేర్కొన్నారు. రైతు మేలు కోసమే సీఎం కేసీఆర్‌ సాగురంగంలో కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టి ఉంటారని, నియంత్రిత పద్ధతి మేలు చేస్తుందని విశ్వాసం వ్యక్తంచేస్తున్నారు. నియంత్రిత సేద్యానికి మద్దతుగా ఏకగ్రీవ తీర్మానంచేసి.. విషయాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు తెలియజేశారు. నియంత్రిత సేద్యానికి రాష్ట్రంలోనే తొలిసారిగా సై అన్న గాదెపల్లి రైతుల నిర్ణయాన్ని వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు, మార్కెటింగ్‌ నిపుణులు అభినందిస్తున్నారు.

గాదెపల్లిలో ఇక వరి, పత్తి, కంది 

గాదెపల్లిలో 649 మంది రైతులుండగా, 1,199 ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు. గత వానకాలంలో 757 ఎకరాల్లో వరి, 97 ఎకరాల్లో పత్తి, 34 ఎకరాల్లో మక్క, నాలుగెకరాల్లో పెసర, 120 ఎకరాల్లో కంది, 32 ఎకరాల్లో పసుపు సాగుచేశారు. యాసంగిలో 548 ఎకరాల్లో వరి, 11 ఎకరాల్లో మక్క, మూడెకరాల్లో పెసర, 17 ఎకరాల్లో నువ్వులు పండించారు. గ్రామంలో ప్రధానంగా ఇప్పటివరకు వరి, కంది సాగుచేస్తూ వచ్చారు. వరిలో దొడ్డురకాలనే అధికంగా వేశారు. ఈ సారి సీఎం కేసీఆర్‌ సూచనలతో నియంత్రిత సేద్యం చేయాలని నిర్ణయించారు. వానకాలంలో సన్నరకాలైన వరిని, పత్తి, కంది పంటలను సాగుచేస్తామని ఏకగ్రీవంగా తీర్మానించారు.

గాదెపల్లి ఆదర్శం

ధర్మపురి మండలంలోని గాదెపల్లిని మిగ తా గ్రామాలు ఆదర్శం గా తీసుకోవాలి. రాష్ట్రం ఏర్పడినప్పటినుంచి రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ అహర్నిషలు కృషిచేస్తున్నారు. రాష్ట్రంలో 1.33 కోట్ల ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్నారు. చెప్పిన మాటను కేసీఆర్‌ తప్పకుండా చేస్తారన్న నమ్మకం రైతుల్లో ఉన్నది. నియంత్రిత పద్ధతిలో వ్యవసాయంచేయాలని కేసీఆర్‌ చెప్పారు. ఇది ఒక ప్రయోగం. ఇది అమలైతే రైతులు రాజులవుతారు. పంటకు గిట్టుబాటు ధర నిర్ణయించే అధికారం రైతులకే వస్తది. 

- కొప్పుల ఈశ్వర్‌, ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి

సీఎం సారు చెప్పినట్టే పంటలేస్తం

సీఎం కేసీఆర్‌ సారు చెప్పినట్టే పంటలేస్తం. నాకు గాదెపల్లి శివారులో రెండెకరాల పొలం ఉన్నది. సమయానికి పెట్టుబడి సాయం, ఎరువులు, పంట రుణాలు అందుతున్నయి. నీటి సౌలత్‌ ఉన్నది. భూమిలో సారం ఉండి పంటలు బాగా పండుతున్నయి. 24 గంటలఉచిత కరెంటు వల్ల ఎవుసం బాగా చేసుకుంటున్నం. ఇప్పుడు కేసీఆర్‌ చెప్పినట్టు పంటలేసి లాభాలు తెచ్చుకుంటం.                                           

- అల్పట్ల మల్కన్న, రైతు, గాదెపల్లి

ఏది పండియిమంటే అదే ఏస్తం

రైతుల మేలు కోరేది సీఎం కేసీఆర్‌ ఒక్కరే. ఆయన లెక్క దేశంలో ఎవలూ చేయలే. అసొంటి సారు ఇప్పు డు, రైతులు సన్నపడ్లు పండించాలె అంటుండు. పత్తి ఏసుకోండ్రి అని చెప్తుండు. అందరూ దొడ్డు అడ్లు ఏస్తే వాటిని ఎవలు తినాలె? కొనేందుకు తిప్పలు కావట్టే, అందరూ అడ్లే ఏస్తం అంటే, పత్తి, పసుపు, కందులు ఎవరు పండియ్యాలె? ఆటికోసం మళ్ల యేరే కాడ కొనాల్నా. అందుకే సీఎం సార్‌ పంటలు మార్చాలని చెప్పి ఉంటడు. రైతుకు గింతగనం మంచిగ చేసినోడు, ఇప్పుడు చెడిపోవాలని చెప్తడా? ఆయన ఏం చేయమంటే అదే చేస్తం.  

- అల్పట్ల గంగ సాయన్న, రైతు


logo