e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home తెలంగాణ యువతదే రేపటి తెలంగాణ

యువతదే రేపటి తెలంగాణ

యువతదే రేపటి తెలంగాణ
  • ప్రతిఒక్కరూ చిరునవ్వుతో బతకాలి
  • అభివృద్ధికి కులం, మతం, జాతిలేదు
  • పంటను పదిమందికి పంచుతున్నం
  • తెలంగాణ రైతు కాలరెగరేస్తున్నడు
  • కౌశిక్‌రెడ్డికి ఉజ్వలమైన భవిష్యత్తు
  • ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

హైదరాబాద్‌, జూలై 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో అన్నివర్గాలవారి జీవితాల్లో వెలుగులు నిండాలని, రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ చిరునవ్వుతో బతకాలి అన్నదే తమ అభిమతమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. అభివృద్ధికి కులం, మతం, జాతిలేదని, తెలంగాణ దేశంలో సగర్వంగా నిలబడాలని పిలుపునిచ్చారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ కాంగ్రెస్‌నేత పాడి కౌశిక్‌రెడ్డి బుధవారం తెలంగాణభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే…
ప్రజాభిప్రాయాన్ని కాలరాశారు,

1969లో ఎలాంటి కమ్యూనికేషన్‌ వ్యవస్థ లేకపోయినా తెలంగాణ ఉద్యమాన్ని పతాకస్థాయికి తీసుకపోయారు. ఆ రోజు తెలంగాణలో ఉన్న 14 ఎంపీల్లో 11 మందిని గెలిపించుకున్నారు. నాటి కర్కశ కేంద్రపాలకులు ప్రజాభిప్రాయాన్ని కాలరాయడంవల్ల ఆ రోజు మనకు తెలంగాణ రాలేదు. భయంకరమైన అనుభవాలను, బాధలను మాలో మేం పంచుకునేవాళ్లం. తెలంగాణ వలసకాలనీ అయితదా, చివరికి మన బతుకులు ఏమైతయనే ఆవేదనతో ఉండేవాళ్లం. కౌశిక్‌రెడ్డి తండ్రి సాయినాథ్‌రెడ్డి మేమందరం ఆప్పుడు మాట్లాడుకొనేవాళ్లం. 1969 ఉద్యమం ఫెయిలయ్యాక ప్రొఫెసర్‌ జయశంకర్‌ను అసలేం జరిగిందని అడిగిన. చిన్నచిన్న సమావేశాలకు పోయేవాళ్లం, తాలుకా సమావేశాలకు వెళ్లేవాళ్లం, ఆ మీటింగ్‌లకు పది, పదిహేనుమంది వచ్చేవాళ్లు అని చెప్పగా.. ‘ఈ కొద్దిమందితో ఏం సాధిస్తారని నేనడిగిన.. అప్పుడు ‘ఏదో రోజు ఒకరోజు నీలాంటివాడు ఒకడొస్తాడు. ఆ వచ్చేనాటికి తాలుకాకు కొందరైనా బతికుండాలి’ అని సార్‌ అన్నారు. తర్వాత పిడికెడుమందితో ఉద్యమానికి శ్రీకారం చుట్టా. ఎగతాళి చేసినవాళ్లు, అవమానపర్చినవాళ్లు ఉన్నారు.

కౌశిక్‌రెడ్డికి ఉజ్వల భవిష్యత్తు

- Advertisement -

కౌశిక్‌రెడ్డి పొలిటికల్‌ లీడర్‌ కాదు. క్రికెట్‌ ప్లేయర్‌. ప్రజాజీవితంలోకి వచ్చిండు. ఆయనకు ఒక్కటేమాట చెప్పిన. ఇది చాలా కష్టపడి సాధించిన రాష్ట్రం. దానిని బాగు చేయడానికి మీలాంటి యువత ఎంతో అవసరం ఉన్నది. కౌశిక్‌ వయస్సు 36 ఏండ్లు. నాకు 67 దాటుతున్నయి. దాదాపుగా నా వయస్సులో సగం. చాలా భవిష్యత్తు ఉన్నది. రాజకీయాల్లో ఏ రోజుకారోజు, ఏ పూటకు ఆ పూట, ఏ సంవత్సరానికి అ సంవత్సరం అనుకోవద్దు. హుజూరాబాద్‌ నియోజకవర్గం, కరీంనగర్‌ జిల్లాలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలోనే కౌశిక్‌రెడ్డి వందశాతం ఉజ్వలమైన పాత్ర పోషిస్తారు. రాజకీయమన్న తర్వాత గెలుస్తాం, ఓడుతాం, అవన్ని జరుగుతుంటాయి. ఎవరూ శాశ్వతంగా అధికారంలో ఉండరు. ప్రజాజీవితంలో, రాజకీయాల్లో, అధికారంలో, ప్రతిపక్షంలో పనిచేయడం అనేక అనుభవాలను కలిగిస్తుంది. మన కంట్రిబ్యూషన్‌ అనేది కొనసాగుతుంటది. కౌశిశ్‌రెడ్డి యువకుడు కాబట్టి ఉజ్వలమైన భవిష్యత్‌ ఉంటుంది. విద్యావంతుడు, యువకుడు. పనిచేసే పట్టుదల ఉన్నవ్యక్తి. ఆయన పైకిరాక తప్పదు. నేను కూడా ఆయన భవిష్యత్‌కు మార్గం ఏర్పాటుచేస్తా. కౌశిక్‌రెడ్డి నాకు కొత్తకాదు. వాళ్ల తాత సుధాకర్‌రెడ్డి, వాళ్ల పెద్దకొడుకు కృష్ణారెడ్డితో మాకు పాత పరిచయాలు ఉన్నయి.

అనేక సహజ వనరులు

సహజవనరులు, సంపద ఉన్న తెలంగాణ సమైక్యపాలకుల రాజ్యంలో తీవ్రంగా నష్టపోయింది. చేనేత కార్మికుల ఆకలి చావులు, రైతుల వలసలు, ఆత్మహత్యలు ఉండేవి. రైతు ఆత్మహత్యల్లో ఇండియాలోనే తెలంగాణ రెండోస్థానంలో ఉండే. కులవృత్తులన్నీ కూలిపోయినవి. కరెంట్‌ కోసం ధర్నాలు, ఆందోళనలు జరిగేవి. మాకు కరెంట్‌ ఇత్తలేరు.. మేము ఉండం అంటూ పారిశ్రామికవేత్తలు ఇందిరాపార్కు దగ్గర ధర్నాలు చేశారు. ఇవన్నీ ప్రత్యక్షంగా చూసినం. బంగారు తునకలాంటి నిజాంసాగర్‌ కూడా ఎండిపోయిన పరిస్థితి. మంజీర ఎండిపోయింది. మానేరు ఎండిపోయింది. ఆ స్థితి నుంచి ఒక్కొక్కటి అధిగమిస్తూ ఇవ్వాళ ఈ స్థాయికి వచ్చినం. ఒక్కొక్క చర్యను ఒక్కోడు ఒక్కోరకంగా అర్థం చేసుకోవచ్చు. కానీ.. చూడాల్సింది పీక్‌ అవుట్‌పుట్‌. కొంతమంది రైతుబంధు అంటే తప్పుపట్రిన్రు. ఎవలేమన్నా రైతుబంధు లక్ష్యం నెరవేరింది. నేను చిన్నప్పుడు కల్లాల కాడికో.. ఇంటి ముందటికో గంగిరెద్దులవాళ్లు వస్తే చాటనిండ తీస్కపోయి వడ్లు పోసేది. సమైక్య పాలనలో దోసిడితో పెట్టే పరిస్థితి వచ్చింది. మల్లా ఇయ్యాల తెలంగాణ రైతులు చాటల వడ్లు తీస్కపోయి పోస్తున్నరు. చెక్‌డ్యామ్‌లు అలుగులు పారుతున్న ఫొటోలు పేపర్లల్ల.. టీవీలల్ల చూస్తుంటే కడుపు నిండిపోతున్నది. ఈ రకమైన తెలంగాణ కావాలనే పనులు చేసుకుంటున్నం. నెత్తికొట్టుకున్నా.. తెలంగాణను ఇప్పుడు ఎవ్వడు ఏం పీకలేడు. ఇక్కడున్న ఆంధ్రావాళ్లతోని అన్న.. పోద్దాక ఆంధ్రా యేనా? ఏం ఆంధ్రా పెట్టినవయా? ఎన్నడో 40 ఏండ్ల కింద హైదరాబాద్‌కు వచ్చినవు. ఐయామ్‌ ఏ హైదరాబాదీ అని చెప్పు అంటే వాళ్లు కూడా మారిపోయిండ్లు. అప్పుడు వాళ్లకు కొద్దిగ అనుమానం ఉండే. ఇప్పుడు చెప్తున్నరు. ఏమైంది ఆడ గల్లంతయింది.. ఈడగొట్టుగ అయింది.

వరుసపెట్టి గెలిపిస్తున్నరు

ప్రజలు ఎప్పటికప్పుడు మద్దతు ఇస్తున్నరు. ఇంకింత మంచిగ రేపు జరగొచ్చు. అన్ని ఎన్నికల్లో వరుసపెట్టి గెలిపిస్తున్నరు. ఇయ్యాల 141 మున్సిపాలిటీల్లో 133 టీఆర్‌ఎస్‌వే. 32 జిల్లా పరిషత్‌లుంటే 32 టీఆర్‌ఎస్‌వే. ఇవన్నీ మేమే గుద్దుకుంటిమా ఓట్లు? జనం ఏస్తేనే కదా గెలిచేది? ప్రతి ఎలక్షన్‌లోనూ అద్భుతమైన సపోర్ట్‌ చేస్తూ ‘మీరు ముందుకుపోండి’ అని ప్రజలు దీవిస్తున్నరు.

ప్రతిపక్ష ఎమ్మెల్యేగా 82 నిమిషాలు మాట్లాడిన

ఎన్టీఆర్‌ అవకాశమిస్తే ఎమ్మెల్యే అయిన. పార్టీ ఓడిపోయినప్పుడు ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నాం. నన్ను అసెంబ్లీలో వ్యవసాయం మీద మాట్లాడమని 20 నిమిషాల టైం ఇచ్చారు. నా ప్రసంగం వింటూ నాటి స్పీకర్‌ ఆలపాటి ధర్మారావు బెల్‌కొట్టుడు మరిచిపోయిండు. నా తర్వాత ముగ్గురు సభ్యుల చేయాల్సిన ప్రసంగం సమయాన్ని కూడా నాకే ఇచ్చారు. 82 నిమిషాలు మాట్లాడిన. తర్వాత నన్ను ఆయన చాంబర్‌లోకి పిలిపించుకొని ఆలింగనం చేసుకొని అభినందించారు. నేనూ రైతుబిడ్డనే, చాలా చక్కగా మాట్లాడావు అని అభినందించారు.

ఆ చెట్ల కింద కేసీఆరే కూర్చుంటడా?

భాయ్‌సాబ్‌.. తెలంగాణకు ఎట్ల పోవాలె అని ఎవరైనా అడిగితే.. పెద్దపెద్ద పచ్చని చెట్లు యాడిదాకా కనిపిస్తయో అక్కడిదాకా తెలంగాణ అని వేరే రాష్ర్టాల డ్రైవర్లు చెప్పుకుంటున్నరు. ఇయ్యాల మన బార్డర్‌ దాటగానే చెట్లు బంద్‌ అయితవి. ఇవన్నీ జోకులా.. ఇవన్నీ ఎలక్షన్ల కోసం పెట్టినచెట్లా…ఆ చెట్ల కింద ఒక్క కేసీఆరే కూర్చుంటడా? బోకడాగాళ్లు.. బోకర్లుగాళ్లు.. ఆడొగడు..ఈడొగడు మోపై మాట్లాడతరు. వానికో నెత్తా..కత్తా.. వానికేమైనా జిమ్మేదారా? వాడికేమైనా బాధ్యతనా? నోరు దేవుడిచ్చిండని చెప్పి కుక్కలు మొరిగినట్టు మొరుగతం అంటే ఎట్ల. ప్రజలు గమనిస్తలేరా? ఇగ గాడ్పు గడ్డపారలైపోతయా ఏంది?

గొర్రెల సంఖ్యలో మనమే నంబర్‌వన్‌

అభివృద్ధికి కులం లేదు.. మతం లేదు.. జాతి లేదు.. అవేవీ పట్టించుకోకుండా అవసరమైన పనులు అవసరమైన విధంగా చేసుకుంటూపోతున్నం. రాష్ట్రంలో ప్రతి స్కీం ప్రవేశపెట్టడం వెనుక ఒక ఆలోచన, మదింపు, మధనం, స్పష్టమైన అవగాహన ఉన్నయి. రాష్ర్టానికి ప్రతిరోజూ 17,500 గొర్రెలు దిగుమతి అవుతున్నాయని, ఒక్క హైదరాబాద్‌కే 11 వేలకుపైగా వస్తున్నాయని అధికారులు చెప్పారు. మన దగ్గర గొల్లలు, కురుమల జనాభా 30 లక్షలకుపైగా ఉన్నది. అయినాకూడా గొర్రెలను దిగుమతి చేసుకోవడమేమిటని ఆలోచన చేసినం. గొర్రెల పంపిణీకి రూపకల్పన చేశాం. గొర్రెల సంఖ్యలో గతంలో రాజస్థాన్‌ ముందుండేదని, ఇప్పుడు తెలంగాణ ముందుందని కేంద్రమంత్రి స్వయంగా ప్రకటించారు. నేను గొర్రెల పంపిణీ చేసిననాడు ఎన్నికల్లేవు. మన్నూ..మశానం లేదు. నాది తెలంగాణ అని ప్రజలు గర్వంగా బతికేలా చేస్తున్నం. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి ముందుకుపోతున్నం. నేను చెప్పటం కాదు. ఫలితాలు ప్రజల అనుభవంలో ఉన్నవి. మనం అనుకుంటే పని చేసుకుంటం. కష్టపడతం. సిన్సియర్‌గా పనిచేస్తం. పరిపాలన సౌలభ్యంకోసం 33 జిల్లాలు చేసుకున్నం. చెకచెకా 33 కలెక్టరేట్లు కట్టుకుంటున్నం. 15 రెడీ అయిపోయినవి. నాలుగీటికి నేనే ఇనారేగషన్‌ చేసిన. మిగిలినయ్‌ చేయబోతున్నం.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
యువతదే రేపటి తెలంగాణ
యువతదే రేపటి తెలంగాణ
యువతదే రేపటి తెలంగాణ

ట్రెండింగ్‌

Advertisement