గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 07, 2020 , 02:29:38

భవిష్యత్తులో 3డీలో భూవివరాలు

భవిష్యత్తులో 3డీలో భూవివరాలు

  • రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ 

సైదాపూర్‌: రానున్న రోజుల్లో శాటిలైట్‌ ద్వారా 3డీలో భూముల వివరాలను నమోదు చేస్తారనీ, దీంతో ఇంచు భూమి విషయంలో కూడా వివాదాలు ఉండవని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. వ్యవసాయంలో శాస్త్రీయ పద్ధతులను ఆహ్వానించాలని రైతులకు సూచించారు. కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలంలోని గొడిశాలలో నేషనల్‌ ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌, ఆగ్రోస్‌ ఆధ్వర్యంలో పత్తి తీసే యంత్రం(కపాస్‌ ప్లక్కర్‌)పై రైతులకు అవగాహన కల్పించి పది మందికి అందజేశారు. యంత్రం ద్వారా పత్తి తీసే పద్ధతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. కొత్త పద్ధతులు, కొత్త యంత్రాలు వచ్చినపుడు వాటి ఉపయోగాలను దృష్టిలో ఉంచుకుని పనితీరు తెలుసుకోవాలని సూచించారు. పత్తి తీసే యంత్రం రాష్ట్రంలో మెట్టమెదటిసారిగా గొడిశాల  రైతులకు అందించడం హర్షణీయమన్నారు. సీఎం కేసీఆర్‌ రైతుల సంక్షేమమే ధ్యేయంగా ఉచిత కరెంటు, సాగునీటికి ప్రాజెక్టులతో పాటు రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. గ్రామాల్లో ఏర్పాటుచేస్తున్న రైతు వేదికల ద్వారా ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌తదితరులు పాల్గొన్నారు.