వామ్మో ఇగం

- చలి పులి పంజాకు తెలంగాణ గజగజ
- మరింత పడిపోతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు
- సంగారెడ్డి జిల్లాలోని కోహీర్‌లో 3.4 డిగ్రీలు
- ఉత్తర, పశ్చిమతెలంగాణలో నేడు చలిగాలులు
బారెడు పొద్దెక్కేదాకా వదలని పొగమంచు.. చీకట్లకంటే ముందే కమ్మేసే చలి! అర్ధరాత్రి సంగతి సరేసరి! రాత్రేకాదు.. పగలూ ఇగమే అన్నట్టుంది రాష్ట్రంలో పరిస్థితి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు నానాటికీ పడిపోతుండటంతో రాష్ట్రమంతా గజగజ వణికిపోతున్నది.
హైదరాబాద్, ఆదిలాబాద్, నమస్తే తెలంగాణ/:కోహీర్ : చలిపులి పంజాకు జనం చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరిగింది. మంగళవారం సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో అత్యల్పంగా 3.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాత్రి వేళ, తెల్లవారు జామున చలి తీవ్రత ఎక్కువగా ఉంటున్నది. బుధవారం నుంచి మూడురోజులపాటు చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కనిష్ఠ ఉష్ణోగ్రత 3 నుంచి 4 డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. బుధవారం ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో చలిగాలులు వీచే అవకాశాలున్నట్టు తెలిపారు.
కోహీర్‌లో 3.4 డిగ్రీలు
రాష్ట్రవ్యాప్తంగా రికార్డుస్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో అత్యల్పంగా 3.4 డిగ్రీల సెల్సియస్, ఆదిలాబాద్ భీంపూర్ మండలం అర్లి(టీ)లో 3.6, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గిన్నెధరిలో 3.9 డిగ్రీల సెల్సియస్ చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవటం గమనార్హం. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం డోంగ్లిలో 4.7, ఆదిలాబాద్ జిల్లా బేలలో 5, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి, వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం నాగారంలో 5.1 డిగ్రీల చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లా కుభీర్, పెంబిలో 5.7, మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో 6 డిగ్రీల చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏజెన్సీతోపాటు అటవీసరిహద్దు గ్రామాల్లో చలి ఎక్కువగా ఉంటున్నది. యాసంగి పంటలు వేసిన రైతులు వ్యవసాయ పనులకు ఉదయం పూట ఆలస్యంగా వెళ్లి.. సాయంత్రం తొందరగా తిరిగి వస్తున్నారు. చలి నుంచి తాత్కాలిక ఉపశమనం పొందేందుకు గ్రామాల్లో చలిమంటలు వేసుకుంటున్నారు. రక్షణగా స్వెటర్లు, మంకీ క్యాప్‌లు ధరించే ఇండ్ల నుంచి బయటికి వస్తున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలోనూ చలి ఎక్కువే
జీహెచ్ఎంసీ పరిధిలోనూ చలి తీవ్రత అధికంగా ఉంటున్నది. రాజేంద్రనగర్‌లో అత్యల్పంగా 7.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. హయత్‌నగర్‌లో అత్యధికంగా 12.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న మూడు రోజులపాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉన్నట్టు తెలిపింది.
చలి తీవ్రతకు ఒకరి మృతి
మరిపెడ: చలి తీవ్రతకు మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ఒకరు మృతిచెందారు. మరిపెడ మండలం చిల్లంచర్ల గ్రామానికి చెందిన రేఖ వెంకటయ్య(55) కొంతకాలంగా మరిపెడ మున్సిపల్ కాంప్లెక్స్‌లో భిక్షాటన చేస్తూ కాలం గడుపుతున్నాడు. మంగళవారం చలి తీవ్రతను తట్టుకోలేక మృత్యువాత పడ్డాడు.
తాజావార్తలు
- ముగియనున్న ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ దరఖాస్తు గడువు
- వనస్థలిపురం ఎస్ఎస్ఆర్ అపార్టుమెంటులో అగ్నిప్రమాదం
- 27-01-2021 బుధవారం.. మీ రాశి ఫలాలు
- లాజిస్టిక్ పార్క్ రెడీ..
- తెలుగు భాషకు ప్రాణం పోసిన మహనీయుడు ‘గిడుగు’
- ఘనంగా పద్మమోహన-టీవీ అవార్డ్స్...
- బాధితులకు సత్వర న్యాయం అందించడానికి కృషి
- త్యాగధనుల కృషి ఫలితమే గణతంత్రం
- సీసీఎంబీ పరిశోధనలు అభినందనీయం
- కామునిచెరువు సుందరీకరణపై స్టేటస్కో పొడిగింపు