బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Aug 09, 2020 , 01:50:52

ముజ్తాబా సేవలకు సలాం

ముజ్తాబా సేవలకు సలాం

  • 23 కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు
  • స్వచ్ఛంద సంస్థలో వలంటీర్‌గా విధులు

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌తో కన్నుమూస్తే సొంతవాళ్లే దగ్గరికి వచ్చేందుకు ధైర్యం చేయట్లేదు. అలాంటివారి అంత్యక్రియలను నిర్వహించడమంటే ఓ సాహసమే. ఏ బంధమూ లేకపోయినా, సమాజంలో ఓ వ్యక్తిగా ఆ మాత్రం సేవచేస్తేనే మనిషిగా పుట్టినందుకు విలువ ఉంటందని ముజ్తాబా చెప్తున్నారు. కరోనాతో మరణించినవారి మృతదేహాలను కుటుంబసభ్యులకు ఇవ్వకుండా స్వచ్ఛందసంస్థలు, ప్రభుత్వమే అంత్యక్రియలు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ముజ్తాబా సేవాభావంతో ముందుకొచ్చి ఇప్పటివరకు 23 మృతదేహాలను తరలించి దహనసంస్కారాలు నిర్వహించారు. దేవుడికి మాత్రమే భయపడుతా, ఇంకెవరికీ భయపడననేది ఇంటర్మీడియట్‌ వరకు చదువుకున్న ముజ్తాబా లక్షణం. ‘ఫీడ్‌ ద నీడ్‌' సంస్థ అందిస్తున్న లాస్ట్‌రైడ్‌లో డ్రైవర్‌ జీషన్‌తో కలిసి కరోనాతో చనిపోయినవారి మృతదేహాలకు గౌరవప్రదంగా అంత్యక్రియలు పూర్తిచేస్తున్నట్టు ఆయన తెలిపారు. పీపీఈ కిట్‌ వేసుకున్నప్పుడు కలిగే వేడివల్ల చెమటతో తడిసిపోతున్నామని, సేవచేయాలనే సంకల్పం ముందు ఇబ్బందిగా అనిపించడంలేదని పేర్కొన్నారు. తన సేవకు గుర్తింపుగా ఓ ప్రశంసాపత్రం ఇస్తే చాలంటున్నాడీ సేవాతత్పరుడు. logo