మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 12, 2020 , 02:25:09

లక్ష కల్లాలు.. 460 కోట్లతో 32 జిల్లాల్లో

లక్ష కల్లాలు.. 460 కోట్లతో 32 జిల్లాల్లో

  •  ధాన్యం ఆరబోతకు సర్కారీ సౌకర్యం
  • ఉపాధి హామీ పథకం కింద నిధులు
  • సీఎం కేసీఆర్‌ ఆమోదానికి ఫైల్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రైతులు పండించిన పంటను ఆరబోసుకొనేందుకు గ్రామాల్లో ప్రత్యేకంగా కల్లాలు నిర్మించాలని మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదించింది. చేతికొచ్చిన ధాన్యం అకాల వర్షాలతో నీటిపాలుకాకుండా ఇవి రైతులకు ఉపయోగపడుతాయి. రూ.460 కోట్ల అంచనా వ్యయంతో 32 జిల్లాల్లో లక్ష కల్లాలు ఏర్పాటుచేయాలనే ప్రతిపాదనల ఫైలును సీఎం కేసీఆర్‌ ఆమోదానికి పంపించారు. ధాన్యాన్ని నిల్వ చేసేందుకు వీలుగా రైతులు ముందుగా వాటిని ఆరబెడుతుంటారు. గ్రామాల్లో ఇందుకు సరైన చోటులేక ఇబ్బందులు పడుతున్నారు. కొందరు రోడ్లపై లేదా బండలపై ఆరబోస్తున్నారు. కానీ, వర్షాలు వచ్చే సమయంలో ఆరుగాలం కష్టించి పండించిన పంట నీటిపాలవుతున్నది. ఈ నేపథ్యంలో రైతులు పంట ఆరబోసుకొనేందుకు వీలుగా అన్ని గ్రామాల్లో కల్లాలు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందులోభాగంగానే 32 జిల్లాల్లో లక్ష కల్లాల నిర్మాణానికి మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు గురువారం వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి నివాసంలో కమిటీ భేటీ అయింది. సమావేశంలో ఆర్థికమంత్రి టీ హరీశ్‌రావు, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 32 జిల్లాల్లో లక్ష కల్లాల నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. ఒక్కోదాని నిర్మాణానికి రూ.46,045 చొప్పున.. మొత్తం లక్ష కల్లాలకు రూ. 460.45 కోట్లు అవుతుందని సబ్‌ కమిటీ అంచనావేసింది. ఈ నిధులను ఉపాధి హామీ పథకం నుంచి సేకరించాలని ప్రతిపాదించింది. 

ఒక్కో గ్రామానికి ఐదు నుంచి ఏడు..

గ్రామాల్లో నిర్మించే కల్లాలు ఒక్కొక్కటి 45 సెంటీమీటర్ల ఎత్తు, 45 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండాలని ప్రతిపాదించారు. ఇందుకు సంబంధించిన నమూనాలను మంత్రులు పరిశీలించారు. ఈ కల్లాల నిర్మాణం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ధాన్యాన్ని రోడ్లపై ఆరబోసే పరిస్థితి ఉండదని, వర్షాల కారణంగా తడవకుండా, కొట్టుకుపోకుండా కాపాడుకోవచ్చని మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయపడింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదల ఫైలును ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపించనున్నారు. ప్రతి గ్రామానికి ఐదు నుంచి ఏడు కల్లాలు నిర్మించే అవకాశం ఉన్నది. ఈ వానకాలంలో రాష్ట్రంలో 45 లక్షల ఎకరాల్లో వరి సాగుచేసే అవకాశం ఉండటంతో.. నేషనల్‌ రూరల్‌ లైవ్లీ హుడ్‌ మిషన్‌ (ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) కింద వ్యవసాయ ఉత్పత్తులను పెంచేందుకు, సేంద్రియ ఎరువుల తయారీకి ప్రోత్సాహం కల్పించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, కమిషనర్‌ రఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు.


logo