మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Sep 12, 2020 , 03:44:20

వైద్యశాఖకు నిధులు పెంచాలి

వైద్యశాఖకు నిధులు పెంచాలి

  • మండలిలో మంత్రి ఈటల  

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ కట్టడి, ఇతర వ్యాధుల నియంత్రణ కోసం వైద్యారోగ్యశాఖ బడ్జెట్‌ను రూ.3 వేల కోట్లకు పెంచాల్సిన అవసరం ఉన్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు.మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.రాష్ట్రవ్యాప్తంగా సీటీ స్కాన్‌లు పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కరోనా వ్యాప్తి ప్రారంభం నుంచి సెలవుల్లేకుండా పనిచేస్తున్న గాంధీ వైద్యులు రాజారావు, సుధాకర్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.   

స్వస్థలాలకు 3.72 లక్షల కార్మికులు లాక్‌డౌన్‌లో వసతుల కల్పనపై మంత్రి మల్లారెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌లో వలస కార్మికులను ఆదుకున్నామని మంత్రి మ ల్లారెడ్డి శుక్రవారం శాసనసభకు తెలిపారు. ఒక్కో వ్యక్తికి 12 కిలోల బియ్యం, రూ.500 నగదు అం దించామని చెప్పారు. బస్సులు, ప్రైవేటు వాహనాలు, 151 శ్రామిక్‌ రైళ్ల ద్వా రా 3.72 లక్షలమందిని స్వస్థలాలకు పంపామన్నారు.  

వర్సిటీల్లో త్వరలోనే ఖాళీల భర్తీ  : విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

రాష్ట్రంలోని వర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1,061 పోస్టులను వీలైనంత త్వరగా భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. మండలిలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలోని పలు వర్సిటీల్లో వైస్‌ చాన్స్‌లర్ల పోస్టుల భర్తీకి ఏర్పాట్లు కొనసాగుతున్నాయన్నారు.

దసరా వరకు రైతు వేదికలు :వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

రాష్ట్రంలో దసరా వరకు అన్ని రైతు వేదికలూ సిద్ధం చేస్తామని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఇందులో వీడియో కాన్ఫరెన్స్‌, టెలికాన్ఫరెన్స్‌, పంటల సాగు పట్ల రైతులకు డిజిటల్‌ విధానంలో సమాచారం అందిస్తామని చెప్పారు.  తెలంగాణలో పండిన ధాన్యం విదేశాలకూ ఎగుమతి అవుతున్నదని, ఆసియా, ఐరోపా దేశాలకూ విస్తరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు.   

కొత్తగా 10 పోలీస్‌ స్టేషన్ల ఏర్పాటు :హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ

సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో కొత్తగా శాంతిభద్రతలకు సంబంధించి 7 పోలీసు స్టేష న్లు, రెండు ట్రాఫిక్‌, ఒక మహిళా ఠాణాను ఏ ర్పాటు చేశామని హోంమంత్రి మహమూద్‌ అలీ తెలిపారు. మండలిలో ఆయన మాట్లాడుతూ ఒక స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ (ఎస్‌వోటీ)ని కూడా మంజూరు చేశామన్నారు. 

తెల్లాపూర్‌లో నీటిఫరాకు చర్యలు:మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు 

తెల్లాపూర్‌ మున్సిపాలిటీలో 10 జనావాసాల్లో మూ డింటికి తాగు నీరందిస్తున్నామని పంచాయతీరాజ్‌ మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. మండలిలో ఆయన మాట్లాడుతూ.. మిగతా 7 ఆవాసాలకు నీరందించేందు కు రూ.391.55 లక్షలు సమకూర్చామన్నారు.  


logo