గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Aug 15, 2020 , 03:34:23

ఆలస్యమే..ప్రాణాంతకం

ఆలస్యమే..ప్రాణాంతకం

  • మెజార్టీ కేసుల్లో మరణాలకు ఇదే కారణం
  • లక్షణాలుంటే వెంటనే దవాఖానకు వెళ్లాలి
  • కరోనాకు సొంత వైద్యం మంచిది కాదు
  • రోగికి సమయానికి తగిన వైద్యం అందాలి
  • అప్పుడే ప్రాణాలు నిలుస్తాయంటున్న డాక్టర్లు
  • అవగాహనలేమిలోనే పలువురు ప్రజలు
  • లేనిపోని భయాలతో పరీక్షలకు దూరం
  • ప్రభుత్వ దవాఖానల్లో పూర్తి స్థాయి వైద్యం

మెజార్టీ కేసులలో కరోనా ప్రాణాంతకం కాదు! వైరస్‌ ప్రభావం చూపే వివిధ దశల్లో అప్రమత్తంగా ఉండకపోతేనే అది తీవ్రరూపం దాల్చి ఆయువు తీసేస్తుంది! విషాదం ఏమిటంటే.. కరోనా మన దేశంలోకి ప్రవేశించి ఆరు నెలలు దాటుతున్నా.. ఇప్పటికీ అనేకమందిలో ఈ అవగాహన కొరవడుతున్నది! లక్షణాలు ఉన్నా అశ్రద్ధ చేస్తూ.. తీవ్రమవుతున్నా నిర్లక్ష్యం వహిస్తూ.. ప్రాణాలమీదకు వచ్చిన తర్వాతే దవాఖానలకు పరుగుతీస్తుండటంతో విలువైన సమయం వృథా అవుతున్నది. ప్రాణాలు కాపాడటం సంక్లిష్టంగా మారుతున్నది. రాష్ట్రంలో మెజార్టీ మరణాల్లో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయని వైద్యనిపుణులు చెప్తున్నారు.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఇప్పటివరకు 7 లక్షల పైచిలుకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 88,396 మందికి పాజిటివ్‌ అని తేలింది. కరోనాకు తోడు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా మొత్తం 674 మంది మరణించారు. అయితే మెజార్టీ మరణాలు కరోనా లక్షణాలను త్వరగా గుర్తించకపోవడం, సకాలంలో చికిత్స అందించకపోవడం వల్లే సంభవించినట్టు వైద్యనిపుణులు చెప్తున్నారు. లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత వైరస్‌ పెద్దఎత్తున వ్యాప్తి చెందుతున్నప్పటికీ ప్రజలు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండటంలేదని పేర్కొంటున్నారు. మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజేషన్‌ వంటి అంశాల్లో కొంత అవగాహన వచ్చినప్పటికీ లక్షణాలను గుర్తించడం, వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం, సకాలంలో దవాఖానలకు వెళ్లడం వంటి విషయాల్లో వెనుకబడి ఉన్నట్టు చెప్తున్నారు. దీనివల్ల ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురవుతున్నదని హెచ్చరిస్తున్నారు. సమయానుగుణంగా చికిత్స అందించడం ద్వారా మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. బాధితుల్లో లక్షణాలను బట్టి ఏ దశలో, ఏ పరీక్షలు నిర్వహించాలనేది కూడా చికిత్సలో కీలకపాత్ర పోషిస్తుందని పేర్కొంటున్నారు. వైరస్‌ తీవ్రతను నిరంతరం పరిశీలించడం ద్వారా తేలికపాటి ఔషధాలతోనే బాధితులు ప్రాణాపాయ స్థితికి చేరుకోకుండా అడ్డుకోవచ్చని సూచిస్తున్నారు.

సొంత వైద్యం చేసుకుంటున్నారు..

దగ్గు, జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు తదితర కరోనా లక్షణాలు కనిపించినప్పటికీ చాలామంది సీరియస్‌గా తీసుకోవడం లేదు. తెలిసిన వైద్యుల సూచన లేదా మెడికల్‌ షాపుల్లో ఇచ్చే మందులు వాడుతున్నారు. విటమిన్‌ ట్యాబ్లెట్లు వేసుకుంటూ సేఫ్‌ అనే భావనకు వస్తున్నారు. మరికొందరు ఇంటర్నెట్‌ సమాచారం అధారంగా సొంతవైద్యం చేసుకుంటున్నారు. దీనివల్ల జ్వరం, తలనొప్పి, దగ్గు పాక్షికంగా తగ్గినా ప్రయోజనం ఉండటం లేదు. వైరస్‌ లక్షణాలను ఈ మందులు కప్పి వేయడంతో కరోనా రాలేదనే భావనతో ఉంటున్నారు.

నిర్ధారణ పరీక్షలకు దూరం

కరోనా పరీక్షలను పీహెచ్‌సీలుసహా అన్ని ప్రభుత్వదవాఖానల్లో చేస్తున్నప్పటికీ లక్షణాలు ఉన్నవారు ముందుకు రావడంలేదు. పాజిటివ్‌ అని తేలుతుందేమో అనే భయంతో కొందరు, పరీక్షలకు వెళ్తే ఇతరుల ద్వారా వ్యాపిస్తుందన్న అపోహతో మరికొందరు ఆగిపోతున్నారు. పాజిటివ్‌ వస్తే కుటుంబసభ్యులు భయపడుతారని మరికొందరు వెనుకడుగు వేస్తున్నారు. ఇలాంటివారు సొంత వైద్యంతో తగ్గించుకుందామనే ధీమాతో ఉంటున్నారు. లక్షణాలున్నవారు పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ లెక్కచేయడంలేదు. మరికొందరు యాంటీజెన్‌ పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చినా ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయించుకోవడంలేదు.

ఆలస్యంతో ప్రాణం మీదకు

దవాఖానలకు వస్తున్నవారిలో సొంత వైద్యంచేసుకున్నవారు లేదా పరీక్షల జోలికి వెళ్లనివారే ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారని వైద్యు లు పేర్కొంటున్నారు. ఆలస్యంతో  విలువైన సమయం వృథా అవుతున్నది. వైరస్‌ తీవ్రత పెరిగి పరిస్థతి విషమిస్తున్నది. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగామారి, ఆక్సిజన్‌ స్థాయిలు ఒక్కసారిగా పడిపోతుండటంతో అప్పుడు దవాఖానలకు చేరుతున్నారు. అప్పటికే వ్యాధి ముదిరిపోవడంతో పరిస్థితి వైద్యుల చేయి దాటుతున్నది. అనేక సందర్భాల్లో ఆక్సిజన్‌ లేదా ఐసీయూలో ఉంచి చికిత్స అందించాల్సిన పరిస్థితి వస్తున్నది.

ముందే స్పందిస్తే ముప్పు ఉండదు

రాష్ట్రమంతటా ఇప్పుడు ఒకే రకమైన చికి త్స ఉన్నది. ప్రైవేటు దవాఖానల్లో అందుబాటులో లేని విలువైన ఔషధాలు ప్రభుత్వ దవాఖానల్లో ఉన్నాయి. రెమిడెస్‌విర్‌, టోస్లిజొమాబ్‌ వంటి ఔషధాలు కరోనా నుంచి కాపాడటంలో కీలకంగా పనిచేస్తున్నాయి. ఆ మం దులు ప్రస్తుతం అన్ని జిల్లా దవాఖానల్లో అం దుబాటులో ఉన్నాయి. జిల్లా కేంద్రాల్లో ఆక్సిజన్‌ సౌకర్యంతో కూడిన పడకలను ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్నది. లక్షణాలను గుర్తిస్తే ప్రాణాపాయస్థితి నుంచి బయటపడటం సులువవుతుంది. లక్షణాలు కనిపించగానే సమీప దవాఖానలకు వెళ్లి పరీక్షచేయించుకోవాలి. అవసరం ఉన్నవారికి హోం ఐసొలేషన్‌ లేదా దవాఖానకు పంపి వైద్యులు చికిత్స అందిస్తారు.

వైద్యుల సలహా తప్పనిసరి

కరోనా లక్షణాలు ఉన్నవారు సొంతగా వైద్యంచేసుకోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. డెక్సామెథాసోన్‌ వంటి మందులను మెడికల్‌ షాపులకు వెళ్లి కొనుగోలుచేస్తున్నారు. నొప్పి నివారణ, జ్వరం, ఇతర మందులను యథేచ్ఛగా వాడుతున్నారు. వైరస్‌ తీవ్రత ఆధారంగా వైద్యులు మందులను సూచిస్తారు. వైద్యుల సలహా తీసుకోకుండా వాడటం కొత్త సమస్యలను కొని తెచ్చుకోవడమే అవుతుంది. ఇలాంటి వాటి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఎజిత్రోమైసిన్‌, డైక్లోఫెనాక్‌ వంటి మందుల వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్టు అధ్యయనాలు చెప్తున్నాయి. విచ్చలవిడిగా వాడటం విటమిన్‌ ట్యాబ్లెట్ల వాడకంతో సమస్యలు ఎదురవుతాయి. జింక్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎనీమియాకు దారీతీసే అవకాశం ఉన్నది. దీనికితోడు కరోనాను ఎదుర్కొనే సరైన ఔషధం శరీరానికి అందకపోవడంతో వైరల్‌ లోడ్‌ పెరిగిపోతుంది. తద్వారా ప్రాణాపాయ స్థితికి చేరుకుంటారు.

ఆలస్యంతోనే ప్రాణాలు పోతున్నాయి..

కరోనా విషయంలో నిర్లక్ష్యం వద్దు. జ్వరం, ఆయాసం ఉన్నవారు ఆక్సిజన్‌ లెవల్స్‌ చూస్తూ ఉండాలి. ఆక్సిజన్‌ లెవల్‌ 95% కంటే తగ్గితే దవాఖానకు వెళ్లాలి. అప్పుడు ప్రాణాలను కాపాడటం సాధ్యమవుతుంది. కానీ చాలామంది ప్రైవేటు దవాఖానల చుట్టూ తిరిగి, ఉన్న డబ్బు ఖర్చుచేసుకొని వస్తున్నారు. అప్పటికే బాధితుడు క్లిష్టపరిస్థితికి చేరుతున్నారు. మేం ఏమీచేయలేని పరిస్థితి కల్పిస్తున్నారు. ముందే దవాఖానలకు వస్తే ప్రాణాలు కాపాడగలుగుతాం.

- డాక్టర్‌ రాజారావు, గాంధీ దవాఖాన సూపరింటెండెంట్‌

త్వరగా చికిత్స ప్రారంభిస్తే కాపాడటం సులువు

వ్యాధి ఉన్నవారిని త్వరగా గుర్తించడం, త్వరగా చికిత్స అందించడం వల్ల ప్రాణనష్టం తగ్గించవచ్చు. రెండు, మూడురోజులు వరుసగా జ్వరం, గొంతు నొప్పి ఉంటే ఆక్సిజన్‌ లెవల్స్‌ తరచూ చెక్‌చేసుకోవాలి. తక్కువగా ఉంటే దవాఖానకు వెళ్లాలి. ఇంటి వైద్యం ప్రాథమికంగా ఒకటి రెండు రోజులు మాత్రమే చూడాలి. 

- డాక్టర్‌ పరంజ్యోతి, శ్వాసకోశ విభాగం హెడ్‌, నిమ్స్‌


logo