ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 20, 2020 , 14:53:55

పూర్తి సమాచారం ఇవ్వాలి.. లేదంటే చర్యలు : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

పూర్తి సమాచారం ఇవ్వాలి.. లేదంటే చర్యలు : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌ : నేటి నుంచి జరిగే సర్వేలో విదేశాల నుంచి వచ్చిన వారి పూర్తి సమాచారం ఇవ్వాలని లేదంటే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్‌ వెంకట్‌రావ్‌, ఎస్పీ రెమా రాజేశ్వరి, వైద్యాధికారులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ముందుగానే ఎన్నో జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్నారు. కనుకనే రాష్ట్రంలో వైరస్‌ తీవ్రత చాలా అదుపులో ఉందన్నారు. అయినా ప్రతి పౌరుడు బాధ్యతో ఉండి వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలన్నారు. కరోనాపై అపోహలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సింగపూర్‌లో చిక్కుకున్న వారిని మన దేశానికి రప్పించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వారు వచ్చిన వెంటనే పరీక్షలు చేయిస్తామన్నారు. 

జిల్లాలో ఇప్పటి వరకు 33 మందిని క్వారంటైన్‌ చేసినట్లు వెల్లడించారు. ప్రతి గ్రామంలో కరోనాపై అవగాహన బోర్డులు ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. గ్రామాల్లోకి ఇతరులు వస్తే వారి పూర్తి ప్రయాణ సమాచారం గ్రామ పంచాయతీ కార్యదర్శి సేకరించాలన్నారు. పెళ్లిళ్లు ముందుగానే కుదిరితే 200 మంది లోపు జనంతో పూర్తిచేయాల్సిందిగా సూచించారు. ఫంక్షన్‌హాల్స్‌ కొత్తగా బుక్‌ చేసుకోవద్దన్నారు. కరోనా కంట్రోల్‌ అయ్యేదాకా గుడి, మసీదు, చర్చి లు వద్దని.. ఇంట్లోనే ప్రార్థనలు చేసుకొవాల్సిందిగా పేర్కొన్నారు.logo