శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 02:43:00

నెరవేరుతున్న హరిత లక్ష్యం

నెరవేరుతున్న హరిత లక్ష్యం

  • పరిఢవిల్లుతున్న పచ్చదనం
  • ఐదేండ్లలో 1.85 లక్షల ఎకరాలు..
  • రాష్ట్రంలో పెరిగిన అటవీ విస్తీర్ణం 
  • 8 జిల్లాల్లో సాధారణానికి మించి..
  • అత్యధికంగా ములుగులో 71.9%
  • ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా వెల్లడి 

హైదరాబాద్‌,నమస్తే తెలంగాణ: ప్రభుత్వం చేపట్టిన తెలంగాణకు హరితహారం సత్ఫలితాలనిస్తున్నది. ఐదేండ్ల వ్యవధిలో 8.2 శాతం అటవీ విస్తీర్ణం పెరుగడం విశేషం. విభజన సమయానికి రాష్ట్ర భూభాగం విస్తీర్ణం 112.08 లక్షల హెక్టార్లు ఉన్నది. అందులో ఉన్న అటవీ విస్తీర్ణం 18.4 శాతం మాత్రమే. వాస్తవానికి ఇది 33.33 శాతం ఉండాలి. దీనిని గమనించిన సీఎం కేసీఆర్‌ 2015లో తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చు ట్టారు. ఐదు విడుతల్లో 185 కోట్ల మొక్కలను పెంచారు. ఐదేండ్లలో ప్రభుత్వం చేపట్టిన హరితహారం ద్వారా లక్షా 85 వేల ఎకరాల్లో పచ్చదనం పెరిగిందని ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. ఆరో విడుతలో  మరో 30 కోట్ల మొక్కలను నాటాలని ప్రభుత్వం నిర్ణయిం చగా..మంగళవారం నాటికి సుమారు 12 కోట్ల మొక్కలు నాటారు. ప్రస్తుతం రాష్ట్ర అటవీ విస్తీర్ణం 24.1 శాతంగా ఉంది. 29,242 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం ఉన్నది.  

అటవీ విస్తీర్ణంలో ముందున్న ములుగు

రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది జిల్లాల్లో అటవీ విస్తీర్ణం సాధారణానికి మించి ఉండగా.. 25 జిల్లాల్లో తక్కువగా ఉన్నది. రాష్ట్రంలో 26 లక్షల 96 వేల 949హెక్టార్ల విస్తీర్ణంలో అడవులు ఉండగా.. వీటిలో ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్‌, మహబూబాబాద్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో సాధారణానికి మించి అటవీ విస్తీర్ణం ఉన్నది. ములుగు జిల్లా 3,00,580 హెక్టార్ల విస్తీర్ణంతో 71.9 శాతం అటవీ విస్తీర్ణాన్ని కలిగి ప్రథమ స్థానంలో ఉన్నది. హైదరాబాద్‌, జోగుళాంబ గద్వాల, కరీంనగర్‌ జిల్లాల్లో అత్యల్పంగా అటవీ విస్తీర్ణం ఉన్నట్టు ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నివేదిక స్పష్టం చేసింది.

 గంటలో లక్షా 4వేల మొక్కలు.. భూపాలపల్లి జిల్లాలో ‘హరితజయ’ రికార్డు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/ భూపాలపల్లి కలెక్టరేట్‌: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఆరో విడుత హరితహారంలో భాగంగా బుధవారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో అధికారులు ఒక గంటలో లక్షా నాలుగు వేల మొక్కలు నాటి రికార్డు సృష్టించారు. ‘హరితజయ-2020’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా 142 గ్రామాల పరిధిలో రహదారుల వెంట 252 కిలోమీటర్ల పొడవునా ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య ఏకకాలంలో మొక్కలు నాటారు. జిల్లా అటవీశాఖ అధికారి పురుషోత్తం తో కలిసి కలెక్టర్‌ మహమ్మద్‌ అబ్దుల్‌అజీమ్‌ కలెక్టరేట్‌, గణపురం మండలం చెల్పూర్‌, భూపాలపల్లి మండలం పెద్దాపూర్‌, రేగొండ మండల కేంద్రంలో మొక్కలను నాటారు.


logo