మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 13, 2020 , 02:00:30

సిరిసిల్లకు దీటుగా కొడంగల్‌

సిరిసిల్లకు దీటుగా కొడంగల్‌

  • సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు 
  • మూడు నెలల్లో పెండింగ్‌ పనులు పూర్తి
  • సెప్టెంబర్‌లో దత్తత నియోజకవర్గంలో పర్యటిస్తా
  • ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌

వికారాబాద్‌, నమస్తేతెలంగాణ: సిరిసిల్లకు దీటుగా కొడంగల్‌ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని మున్సిపల్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా కొనసాగుతున్న పనులను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో కొడంగల్‌ అభివృద్ధిపై మంత్రులు సబితాఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ, మిషన్‌ భగీరథ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై శాఖల వారీగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. కొడంగల్‌ నియోజకవర్గ ప్రజలు అపార నమ్మకంతో టీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించారని, వారి ఆకాంక్షల మేరకు అభివృద్ధి చేసేందుకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. ఆర్టీసీ డిపోల ఏర్పాటు యోచన లేకపోయినప్పటికీ కోస్గి డిపో, బస్‌ స్టేషన్‌ నిర్మాణం పూర్తిచేయాలని ఆర్టీసీ ఎండీని ఆదేశించారు. కొడంగల్‌, కోస్గి మున్సిపాలిటీల్లో రూ.50 కోట్ల నిధులతో సాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. రూ.4 కోట్లతో డిగ్రీ కళాశాల, రూ.5 కోట్లతో గురుకుల పాఠశాల భవన నిర్మాణాలు చేపడుతున్నామని, పనులు త్వరగా పూర్తయ్యేలా విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి చొరవ తీసుకోవాలని సూచించారు. దౌల్తాబాద్‌లో రూ.8 కోట్లతో కొనసాగుతున్న మినీ ట్యాంక్‌బండ్‌ పనులను వేగవంతం చేయాలన్నారు. కొడంగల్‌, కోస్గి కేంద్రాల్లో 50 పడకల దవాఖానల నిర్మాణపనులకు ప్రాధాన్యమివ్వాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు.

కొడంగల్‌ నియోజక వర్గంలోని అన్ని మండలాల్లో మిషన్‌ భగీరథ పనులు దాదాపుగా పూర్తవుతున్నాయని ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి వివరించగా.. మరిన్ని ట్యాంకులు, మిగిలిన కనెక్షన్లు, కొత్తగా అవసరమైన పైప్‌లైన్ల నిర్మాణం, నల్లాల ఏర్పాటు తదితర పనులను స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, మంత్రులు సబితాఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ల సిఫారసు మేరకు పూర్తిచేయాలని కేటీఆర్‌ సూచించారు. భవిష్యత్‌లో నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి అవసరమైన కార్యక్రమాలపై ప్రణాళికను రూపొందించాలని మంత్రులకు సూచించారు.  మూడునెలల్లోగా అభివృద్ధి పనులను పూర్తిచేయాలని, సెప్టెంబర్‌లో కొడంగల్‌ నియోజకవర్గంలో పర్యటిస్తానని మంత్రి తెలిపారు. తన సొంత నియోజకవర్గం సిరిసిల్లకు దీటుగా కొడంగల్‌ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈ సమావేశంలో వికారాబాద్‌, నారాయణపేట జిల్లాల కలెక్టర్లు పౌసుమీ బసు, హరిచందన తదితరులు పాల్గొన్నారు.logo