శనివారం 23 జనవరి 2021
Telangana - Jan 13, 2021 , 18:10:59

బియ్యం ఎగుమ‌తిపై ఎఫ్‌టీసీసీఐ నివేదిక అంద‌జేత‌

బియ్యం ఎగుమ‌తిపై ఎఫ్‌టీసీసీఐ నివేదిక అంద‌జేత‌

హైద‌రాబాద్ : "తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతి - ముందుకు సాగే అవకాశాలు" అనే విషయంపై క్షుణ్ణంగా విశ్లేషించి సమగ్ర నివేదికను రూపొందించిన ద ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ( ఎఫ్.టీ.సి.సి.ఐ. ) ఆ నివేదికను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్‌కు బుధ‌వారం అందజేసింది. బుధవారం మంత్రుల నివాసంలో వినోద్ కుమార్‌తో సమావేశమైన ఎఫ్.టీ.సి.సి.ఐ. అధ్యక్షుడు రమాకాంత్ ఇనాని, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కే. భాస్కర్ రెడ్డి, సీఈవో ఖ్యాతి నరవనే, డిప్యూటీ సీఈఓ టీ.సుజాత నివేదిక అంశాలపై చర్చించారు.

రాష్ట్రంలో పంట భూములకు సాగు నీరు అందించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రణాళికాబద్దంగా పలు ప్రాజెక్టులను నిర్మించారు. పుష్కలంగా నీటి లభ్యతతో రాష్ట్రంలో వరి దిగుబడి పెద్ద ఎత్తున రైతుల చేతికి వచ్చింది. దీంతో భారీ స్థాయిలో బియ్యం నిల్వలు పెరిగాయి. ఈ బియ్యాన్ని విదేశీ మార్కెట్‌లో విక్రయించేందుకు ఉన్న అవకాశాలపై క్షేత్ర స్థాయిలో పర్యటించి నివేదికను సిద్ధం చేయాలని వినోద్ కుమార్ ఎఫ్.టీ.సి.సి.ఐ. కి సూచించారు. అందులో భాగంగానే ఎఫ్.టీ.సి.సి.ఐ. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటించి క్షేత్ర స్థాయి పరిస్థితులను విశ్లేషించి సమగ్ర నివేదికను రూపొందించింది.

విదేశీ మార్కెట్ బియ్యం విక్రయాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేస్తూ నివేదికను సిద్ధం చేసి అందజేశారు. రాష్ట్రంలో వరి ఎక్కువగా పండించే కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్లగొండ, మెదక్ వంటి జిల్లాల్లో డ్రై పోర్ట్ లను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ వరి కొనుగోళ్లు చేయాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ సూచించింది. తద్వారా రవాణా ఖర్చులను తగ్గించే అవకాశం ఉంటుందని పేర్కొంది. మహారాష్ట్రకు సరిహద్దులో ఉన్న నిజామాబాద్ జిల్లాలోని డిచిపల్లి లేదా జానకంపేటలలో ఇన్లాండ్ కంటేనర్ డిపో ( ఐ.సి.డీ ) ఏర్పాటు చేయాలని సూచించింది.

ప్రస్తుతం హైదరాబాద్‌లోని సనత్ నగర్‌లో మాత్రమే ఐ.సి.డీ. ఉందని, ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి బియ్యం రవాణా చేయాలంటే ర‌వాణా ఖర్చులు తడిసి మోపెడు అవుతాయని, అందువల్ల కేంద్ర ప్రభుత్వం కొంకోర్ సబ్సిడీని సనత్ నగర్ ఐ.సి.డీ. కి వర్తింపజేయాలని సూచించింది. క్రిమిసంహారక మందుల వినియోగం పట్ల రైతులకు జాగ్రత్తలు చెప్పి వారిని చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అభిప్రాయపడింది. తెలంగాణ రాష్ట్రం వాతావరణ సమశీతోష్ణస్థితి కలిగి ఉండటం కలిసి వచ్చే అంశమని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో రైతులు పండించిన " తెలంగాణ సోనా " రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ గా మారిందని కొనియాడింది.



logo