రవి బీటెక్.. సాగు హైటెక్

- ఉన్నత విద్య నుంచి వ్యవసాయ క్షేత్రంలోకి
- ప్రతి రైతూ లాభసాటి సేద్యం చేసేలా పరిశోధన
- 15 రాష్ర్టాలకు మేలైన దిగుబడి విత్తనాల పంపిణీ
- పది మంది పీహెచ్డీ స్కాలర్లకు ఉద్యోగాలు,
- వ్యవసాయ క్షేత్రంలో 500 మందికి ఉపాధి
- తెలంగాణకు దిక్సూచిగా విత్తన క్షేత్రం ఏర్పాటు
ఉన్నత చదువులు చదివినా.. మట్టి వాసన మరిచిపోలేదు. తండ్రులు అప్పగించిన వ్యాపారాలను పిల్లలు వృద్ధి చేసినట్టు.. ఆయన తన తండ్రి నుంచి వారసత్వంగా పొందిన వ్యవసాయాన్ని ఉన్నతస్థాయికి తీసుకువెళ్లాలని తలచారు. అదికూడా తక్కువ పెట్టుబడితో! ఫలితంగా తన సాగు క్షేత్రాన్ని పరిశోధన కేంద్రంగా మార్చారు. వందల రకాల పంటలకు రూపకర్తగా నిలిచారు. తాను చదివింది బీటెక్ అయినా.. పీహెచ్డీ చేసినవారికి కొలువులు ఇచ్చి.. వందలమందికి ఉపాధి కల్పించి.. వేలమంది రైతుల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు కృషిచేస్తున్నారు! భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌కు చెందిన మన్నేపల్లి రవి అంటే చాలామందికి తెలియదు! కానీ.. హైబ్రీడ్ రవి అంటే ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఆ రవి హైటెక్ సాగు కథే ఇది!
కొత్తగూడెం: ఎంతోమంది ఎన్నో పై చదువులు చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకొంటారు. కానీ ఎంత ఎత్తుకెళ్లినా తినాల్సింది మాత్రం అన్నదాత పండించిన పంటలనే కదా.. రైతు లేకుండా ప్రపంచం మనుగడ సాగించలేదు. ఏ దేశానికైనా రైతే వెన్నెముక. ఎంత డబ్బు సంపాదించాం అనేది ముఖ్యం కాదు.. ఏం చేసి సంపాదించాం అనేది చాలా ముఖ్యం. భవిష్యత్ తరాలకు మనం ఉపయోగపడాలంటే ముఖ్యంగా రైతు బాగుండాలి. ఆ రైతులు తమ పంటోత్పత్తులపై లాభాలను ఆర్జించిననాడే ప్రజలు బతికి బట్టకడతారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన రవి ఉన్నత చదువులు చదివినా.. తనను అంత చదువు చదివించిన మట్టి వాసన మరచిపోలేదు. ఆ మట్టినుంచి బంగారాన్ని సృష్టించి.. వందలాది రైతు కుటుంబాలను కష్టాల నుంచి బయటకు తీసుకొనిరావాలి. ప్రతి రైతు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం చూడాలి. మంచి విత్తనాలు ఉంటేనే దిగుబడులు సాధించుకోవచ్చు. ఏ రకమైన తెగులుకైనా ప్రభావితం కాని స్థాయిలో విత్తనాలు తయారుచేసేందుకు రవి పూనుకొన్నాడు. ఇతనిపేరు మన్నేపల్లి రవి. అతణ్ణి అంతా హైబ్రీడ్ రవి అంటారు. తన తండ్రి నేర్పిన వ్యవసాయాన్ని నమ్ముకుని పదిమందికి అదర్శంగా నిలుస్తున్నాడు.
ఉన్నత విద్య నుంచి సాగులోకి..
ఇంజినీరింగ్ చదివినా వ్యవసాయాన్నే ఉద్యోగంగా భావించి సాగుక్షేత్రంలో పరిశోధనలు చేస్తున్నాడు. ఇప్పటికే కొన్ని వందల రకాల పంటలకు రూపకర్తగా మారాడు. తనకు ఎందరో స్నేహితులు హైదరాబాద్ తరహా నగరాల్లో ఉన్నప్పటికీ తన లైఫ్ైస్టెల్ను పల్లె వాతావరణానికే పరిమితం చేసుకొన్నాడు. వ్యవసాయంలో ఉన్న సంతోషం ఎందులోనూ ఉండదని చెప్తుంటాడు. కొత్తరకాల వంగడాలను తయారుచేస్తున్నాడు. యావత్ తెలంగాణ రాష్ట్రం రవిహైబ్రీడ్ సీడ్వైపు చూసేలా మంచి విత్తనాలను తయారుచేసి అన్ని రాష్ర్టాల రైతులకు సరఫరాచేస్తున్నాడు.
రైతులంతా లాభం పొందాలి
రైతు వ్యవసాయంచేయడం ముఖ్యంకాదు. పండించిన పంటకు ఎంత దిగుబడి వస్తుందనేదే ముఖ్యం. అందుకే ప్రతి రైతు లాభాలను ఆర్జించడం కోసం వ్యవసాయం చెయ్యాలన్నదే రవి తపన. అందుకే విత్తన క్షేత్రాన్ని సాగుకు ఎంచుకుని పరిశోధనకు నాంది పలికాడు. తక్కువగా మందులు వాడి నాణ్యమైన పంటరావడం కోసం రవి చేస్తున్న తపన ఫలిస్తున్నది. తొలుత కూరగాయలు సాగుచేసి మంచి దిగుబడులు సాధించాడు. ఇప్పుడు విత్తనాలను తయారుచేసేందుకు అతని పరిశోధన ఫలితాలు రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది.
తండ్రిబాటలో కొడుకు కూడా..
తన తండ్రిచేస్తున్న వ్యవసాయాన్ని తన వృత్తిగా స్వీకరించి 20 ఏండ్లుగా సాగుక్షేత్రంలో బిజీ అయ్యారు. సుజాతనగర్ మండల కేంద్రంలో 40 ఎకరాల పొలాన్ని పరిశోధనా క్షేత్రంగా మలచుకొన్నాడు. పంట ఏదైనా అందులో దిగుబడి ఎంతమేరకు వస్తున్నదనేదే ప్రధానం. అం దుకు అనుగుణంగా కొత్త వ్యవసాయ విధానాన్ని ఎంచుకుని కొత్త వంగడాలను రైతులకు పరిచయం చేయగలిగాడు. ఇప్పుడు 15 రాష్ర్టా ల్లో మంచి విత్తనాలను సరఫరా చేసి హైబ్రీడ్ రవిగా పేరు తెచ్చుకొన్నాడు. తనతోపాటు తన కొడుకు హర్షను కూడా వ్యవసాయ యూనివర్శిటీలో ఉన్నత చదువులు చదివించి విత్తన పరిశోధనరంగంలోకి తీసుకొచ్చాడు.. కాలిపోర్నియాలో జెనెటిక్స్ అండ్ప్లాంట్ బ్రీడింగ్ కోర్సును పూర్తి చేసి విత్తన పరిశోధనలో తండ్రికి తోడుగా ఉంటున్నాడు. మిర్చిలో 150 రకాల విత్తనాలను తయారుచేస్తున్నారు. ఉదాహరణకు ఏ రాష్ర్టానికి ఏ రకం మిర్చి వాడతారు, కారం ఎక్కువ ఉండేవి ఏమిటి. తక్కువ కారం ఉండేవి ఏమిటి? మందులు లేకుండా పండే పంటలు ఏవి? అన్నవాటిపై అధ్యయనంచేసి లాభసాటి వ్యవసాయానికి ఊతం ఇస్తున్నారు.
తెలంగాణకు దిక్సూచి విత్తన క్షేత్రం..
తెలంగాణ రాష్ర్టానికే అతిపెద్ద విత్తన క్షేత్రంగా సుజాతనగర్ హైబ్రీడ్ రవి విత్తన తయారీ మంచి గుర్తింపు తెచ్చుకొన్నది. డీఎస్ఐఆర్ అప్రూవ్డ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫెసిలిటీస్ ద్వారా గుర్తింపు పొందింది. రాష్ట్ర విత్తన పరిశోధనా క్షేత్రం కూడా వీరితో టైఅప్ అయ్యేందుకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా రాష్ర్టాల నుంచి రైతులు వచ్చి వ్యవసాయ క్షేత్రాన్ని చూసి వెళ్తున్నారు. అధికారులు కూడా ఇక్కడ వంగడాలను చూసి రైతులకు మేలైన వంగడాల గురించి వివరిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న నర్సరీల యజమానులు కూడా ఇక్కడ నుంచి విత్తనాలను తీసుకుని నర్సరీల్లో నారు పెంచుకుంటున్నారు.
దిగుబడి వచ్చే విత్తనాలను తయారుచేస్తున్నాం
మా నాన్న ఎంచుకొన్న విధానం చాలా మేలైనది. అందుకే వ్యవసాయ యూనివర్శిటీ.. కాలిపోర్నియాలో జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ సబ్జెక్టును ఎంచుకున్నాను. విత్తనాలను తయారుచేసేందుకు చాలా కష్టపడాలి. ఎలాంటి రకం.. ఏ ప్రాంతానికి అవసరమో తెలుసుకోవాలి. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి రావాలన్న నాన్న తపనే నాకు ప్రేరణ. అందుకే నాన్నతో కలిసి విత్తన పరిశోధనను చేస్తున్నాం. అన్ని రాష్ర్టాలకు మన విత్తనాలను అందిస్తున్నాం. ఇదే మాకు పెద్ద సంతృప్తి.
- మన్నేపల్లి హర్ష, సుజాతనగర్, కొత్తగూడెం
పది మంది పీహెచ్‌డీలకు ఉద్యోగాలు, 500 మందికి ఉపాధి
రవి కేవలం సాగుకే పరిమితం కాకుండా విత్తన రీసెర్చ్‌ను ప్రారంభించి పలువురికి ఉపాధిని కల్పించారు. విత్తన రీసెర్చ్‌లో పది మంది ఎంఎస్సీ పీహెచ్డీ పరిశోధకులు.. ఇక్కడ రీసెర్చ్ చేస్తున్నారు. వీరితో పాటు పలుచోట్ల ఉన్న విత్తన పరిశోధనాక్షేత్రాల్లో సుమారు 500 మంది ఉపాధి పొందుతున్నారు. కొత్తరకం వంగడాలను తయారుచేయడం వారి లక్ష్యం. బోడకాకర, పుచ్చ, బీన్స్, బుడమదోస, టమాట, ఇతర కూరగాయల పంటలను కూడా పండిస్తూ విత్తనాలను తయారుచేయడంలో ప్రత్యేకతను చాటుకొంటున్నారు.
‘ఎంత చదివామని కాదు..
పది మందికి ఉపయో గపడాలి. వ్యవసాయం చేస్తేనే చాలామంది రైతులకు ఉపయోగపడవచ్చు. వ్యవసాయం చేస్తూ ఆదా యం సంపాదిస్తే తృప్తిగా ఉంటుంది. అందుకే ఇంజినీరింగ్ వదిలేసి.. సేద్యం వైపు వచ్చా.’
-మన్నేపల్లి రవి, హైబ్రీడ్ సీడ్, సుజాతనగర్, కొత్తగూడెం
తాజావార్తలు
- ఎక్కడా ఇబ్బందులు రావద్దు
- లాక్డౌన్ పొదుపు 14.60 లక్షల కోట్లు
- కాలగర్భంలోకి స్కూటర్స్ ఇండియా
- వరంగల్‌కు విదేశీయుల వరుస..
- బెంగాల్ బీజేపీ ఆఫీసులో ఘర్షణ: వాహనాలకు నిప్పు
- 10 కోట్ల హీరో
- ఆర్టీసీ బస్సును ఢీకొన్న టిప్పర్ : ఇద్దరికి గాయాలు
- సంక్షోభంలోనూ సంక్షేమం
- రేషన్ అక్రమ నిల్వ చట్టవిరుద్ధం : జేసీ
- బదిలీపై జిల్లాకు ఇద్దరు డీఆర్వోలు