బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 27, 2020 , 01:56:51

సరుకు రవాణా రైళ్లూ ప్రైవేటుపరం

సరుకు రవాణా రైళ్లూ ప్రైవేటుపరం

  • త్వరలో టెండర్లు పిలువనున్న రైల్వేశాఖ
  • స్టేషన్లు, ప్రయాణికుల రైళ్లకు ఇప్పటికే టెండర్లు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రైల్వేల పూర్తిస్థాయి ప్రైవేటీకరణే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. ఇప్పటికే రైల్వేస్టేషన్లు, ప్రయాణికుల రైళ్ల ప్రైవేటీకరణకు రైల్వేశాఖ టెండర్లు పిలిచింది. 109 రూట్లు, 150 రైళ్లను ప్రైవేటుకు అప్పగించేందుకు ఈ ప్రక్రియ చురుకుగా కొనసాగుతున్నది. తాజాగా సరుకు రవాణా రైళ్లతోపాటు, సరుకు రవాణా కారిడార్లను కూడా ప్రైవేటుపరం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం త్వరలో మార్గదర్శకాలు ఖరారుచేసి టెండర్లు పిలువాలని యోచిస్తున్నది. రైల్వేశాఖకు సాధారణ రైళ్లద్వారా నష్టాలు వస్తున్నప్పటికీ.. సరుకు రవాణా ద్వారా లాభాలను గడిస్తున్నది. ప్రస్తుతం వాటిని ప్రైవేటుపరం చేయడం ద్వారా పూర్తిస్థాయిలో ప్రైవేట్‌సంస్థగా మార్చనున్నది. భారతీయరైల్వే లక్షలమందికి ఉపాధి కల్పిస్తూ దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. సరుకు రవాణా రైళ్లు, కారిడార్లను కూడా ప్రైవేటుకు అప్పగిస్తే రైల్వేకు ఇక మిగిలేది రైల్వేవ్యాగన్ల తయారీ ఫ్యాక్టరీలు, లోకోషెడ్లు, కోచ్‌ ఫ్యాక్టరీలు మాత్రమే. 

లాభాలు వచ్చే డీఎఫ్‌సీలు ప్రైవేటుకు..

వాస్తవంగా ఇప్పటివరకు కొన్ని ప్రైవేటు సంస్థలు తమ సరుకు రవాణా కోసం వ్యాగన్లను బుక్‌చేసుకొంటున్నాయి. అయితే భవిష్యత్‌లో ఎంపికచేసిన రూట్లలో సరుకు రవాణాను మొత్తం ప్రైవేటుసంస్థలకు అప్పగించనున్నారు. ఇందులో తక్కువ డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్స్‌ (డీఎఫ్‌సీ)ను రైల్వే ఉంచుకుని, లాభాలు వచ్చే డీఎఫ్‌సీలను ప్రైవేటుసంస్థలకు అప్పగించేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తున్నది. ప్రయాణికుల రైళ్ల ప్రైవేటీకరణపై కొంత వ్యతిరేకత వచ్చినా.. సరుకు రవాణా రైళ్లపై మాత్రం పెద్దగా వ్యతిరేకత రాదని రైల్వేశాఖ అంచనా వేస్తున్నది. దీంతో వాటి ప్రైవేటీకరణ ప్రక్రియ సులువుగా పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. 

డీఎఫ్‌సీలను వేలం ద్వారా ప్రైవేటు సంస్థలకు అప్పగించనుండగా.. ప్రైవేటు ప్రయాణికుల రైళ్లు, సరుకు రవాణా రైళ్లను రైల్వే రెగ్యులేటరీ బోర్డు నియంత్రించనున్నది. గుజరాత్‌లోని పాలన్‌పూర్‌ నుంచి హర్యానాలోని రేవరీ స్టేషన్‌ వరకు 650 కిలోమీటర్ల మార్గాన్ని ప్రత్యేకంగా సరుకు రవాణా కారిడార్‌ను రైల్వేశాఖ నిర్మిస్తున్నది. యూపీలోని దాద్రి నుంచి మహరాష్ట్ర పోర్ట్‌వరకు సరుకు రవాణాకు ప్రత్యేకంగా డీఎఫ్‌సీని వేశారు. ఈ రెండింటినీ ప్రైవేటుకు అప్పగించనున్నట్టు సమాచారం. తర్వాత దశలవారీగా సరుకు రవాణాను మొత్తం ప్రైవేటుపరం చేయనున్నారు. కాగా, 2023 నాటికి ప్రయాణికుల ప్రైవేటు రైళ్లు రానున్నాయి. అప్పటివరకు ప్రైవేటు సరుకు రవాణా రైళ్లు కూడా వచ్చేలా రైల్వేశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. logo