ఆదివారం 17 జనవరి 2021
Telangana - Nov 28, 2020 , 21:10:35

అపార్ట్‌మెంట్‌వాసులకు ఉచిత నీటి సరఫరా : సీఎం కేసీఆర్

అపార్ట్‌మెంట్‌వాసులకు ఉచిత నీటి సరఫరా : సీఎం కేసీఆర్

హైదరాబాద్‌ : జంట నగరవాసులకు 20 వేల లీటర్ల వరకు ఉచితంగా మంచినీటి సరఫరా చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని నగరంలోని అపార్ట్‌మెంట్‌ వాసులకు కూడా వర్తింపజేయనున్నట్లు సీఎం కేసీఆర్‌ తాజాగా ప్రకటించారు. గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో టీఆర్‌ఎస్‌ పార్టీ శనివారం ప్రగతి నివేదన సభను నిర్వహించింది. సభకు ముఖ్యఅతిధిగా విచ్చేసిన సీఎం కేసీఆర్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మిషన్‌ భగీరథ పథకం అద్భుతం, అనన్య సామన్యం అన్నారు. తాను ఛాలెంజ్‌ చేసి తొడగొట్టి సాధించి ప్రజలకు అందించబడ్డ పథకం అన్నారు. రాష్ట్రంలో నీటి కోసం తిప్పలు లేవన్నారు. ఇవాళ ట్యాంకర్ల కాడా నీళ్లు పంచాయితీలు లేవన్నారు. దాదాపు 90 శాతం వరకు మంచినీటి సమస్యకు స్వస్తి పలికామన్నారు. మిగతా పనిని కూడా అతి త్వరలోనే పూర్తిచేస్తామన్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రజలకు 24 గంటల మంచినీరు సరఫరా అనేది తన కల అని సీఎం అన్నారు. మీ అందరి దయ, సహకారం, భగవంతుని కృప ఉంటే హైదరాబాద్‌లో అతి తక్కువ కాలంలోనే 24 గంటలపాటు నీళ్లు అందజేస్తామన్నారు.