శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 06, 2020 , 02:06:59

పేదలకు ఉచిత బియ్యం

పేదలకు ఉచిత బియ్యం

  • ప్రతి వ్యక్తికి 10 కిలోల చొప్పున పంపిణీ 
  • కరీంనగర్‌లో ప్రారంభించిన మంత్రి గంగుల
  • 89 లక్షల కార్డుదారులకు ప్రయోజనం

కరీంనగర్‌, నమస్తే తెలంగాణ: కరోనా కష్టకాలంలో పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్రంలోని 89 లక్షల కార్డుదారులకు 10 కిలోల ఉచితబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ, పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ప్రారంభించారు. ఆదివారం కరీంనగర్‌ జిల్లా చెర్లబూత్కూర్‌లో బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడారు. కేంద్రం నిర్ణయం ప్రకారం రాష్ట్రంలోని 1.91 కోట్ల మందికి మాత్రమే 5 కేజీల బియ్యం సరఫరా కానుండగా, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో 89 లక్షల మందిని కలుపుకొని 2.80 కోట్ల మందికి బియ్యం అందిస్తున్నదని చెప్పారు. 

గతంలోనూ లాక్‌డౌన్‌ సమయంలో పేదలకు తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. జూలై నుంచి నవంబర్‌ వరకు ఐదునెలల పాటు ఉచిత బియ్యం పంపిణీ చేస్తామని గంగుల స్పష్టంచేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా, ఆశించిన రాబడి లేకున్నా పేదల పట్ల మానవతా దృక్పథంతో ఉచితంగా బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించామన్నా రు. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై నెలకు రూ. 50 కోట్ల ఆర్థిక భారం పడుతున్నదని, ఐదు నెలలకు రూ. 250 కోట్లు ఇందుకు ఖర్చు చేస్తున్నామని గంగుల వెల్లడించారు. 


logo