బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 01, 2020 , 01:51:00

నేటినుంచి ఉచిత బియ్యం

నేటినుంచి ఉచిత బియ్యం

  • అర్హులైన ప్రతి ఒక్కరికి  12 కిలోల చొప్పున పంపిణీ
  • రేషన్‌ షాపుల్లో టోకెన్‌ పద్ధతి.. 2.81 కోట్ల మందికి లబ్ధి 
  • రాష్ట్ర ఖజానాపై  రూ. 1,103 కోట్లు భారం 
  • పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ వెల్లడి

హైదరాబాద్‌/సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ కోసం లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో పేదలు ఇబ్బందిపడకుండా ఉచితంగా రేషన్‌ బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌కార్డులున్న కుటుంబంలో ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే బియ్యంతోపాటు, ప్రతి కుటుంబానికి రూ.1500 అందజేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బియ్యం పంపిణీకి చేపట్టాల్సిన చర్యలపై మంగళవారం పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ పీ సత్యనారాయణరెడ్డి, అధికారులతో పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 87.54 లక్షల ఆహారభద్రత కార్డుల ద్వారా 2.81 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రతిఒక్కరికి 12 కిలోల బియ్యాన్ని ఉచితంగా అందజేస్తామని చెప్పారు. రేషన్‌దుకాణాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రేషన్‌ దు కాణాల వద్ద మూడు ఫీట్ల నిర్ణీతదూరం పాటించాలనే నిబంధన విధిస్తున్నట్టు తెలిపారు. లబ్ధిదారులకు కూప న్లు అందిస్తామని, అందులో పేర్కొన్న సమయానికే వ చ్చి రేషన్‌ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో రేషన్‌ పోర్టబిలిటీ అమలులో ఉన్నందున ఎక్కడైనా బియ్యం తీసుకోవచ్చని స్పష్టంచేశారు. 

ప్రతినెలా రేషన్‌ తీసుకునేవాళ్లు బయోమెట్రిక్‌ పద్ధతి పాటించాల్సిన అవసరం లేదని, మూడునెలలుగా రేషన్‌ తీసుకోనివాళ్లు వేలిముద్ర వేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రేషన్‌ దుకాణాల వద్ద చేతులు శుభ్రంగా ఉంచుకొనేందుకు శానిటైజర్లు, సబ్బు, నీళ్లు అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు. ఉచితంగా రేషన్‌ ఇస్తున్నందుకు ప్రభుత్వంపై రూ.1,103 కోట్ల భారం పడుతున్నదని చెప్పారు. లాక్‌డౌన్‌తో ప్రజలంతా ఇండ్లకే పరిమితమైన క్లిష్ట పరిస్థితుల్లో సీఎం కేసీఆర్‌ వారికి అండగా నిలిచారని చెప్పారు. ప్రభుత్వంపై భారం పడినా ఉచితంగా బియ్యం ఇస్తూ మానవత్వానికి మారుపేరుగా నిలిచారని కొనియాడారు. 

త్వరలో కిలో కంది పప్పు!

ఆహారభద్రత చట్టం పరిధిలోకి వచ్చేవారికి కిలో కందిపప్పును ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల వివరాలను కేంద్రానికి రాష్ట్ర ప్రభు త్వం అందించింది. దీనిప్రకారం  27 వేలట న్నుల కం దిపప్పు కేంద్ర సంస్థ నాఫెడ్‌ ద్వారా రాష్ర్టానికి రావాల్సి ఉన్నది. రాగానే లబ్ధిదారులకు ఇస్తారని సమాచారం.

ఆధార్‌కార్డు ఆధారంగా 1500 నగదు బదిలీ

సీఎం కేసీఆర్‌ పేద కుటుంబాలకు ప్రకటించిన రూ.1500 నగదు బ్యాంకు ఖాతాల్లో జమకానున్నది. ఆహారభద్రత కార్డుల లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలను ఆధార్‌కార్డు ఆధారంగా సమకూర్చుకునే పనిలో పౌరసరఫరాలశాఖ నిమగ్నమైంది. రేషన్‌కార్డుల్లో లబ్ధిదారుల ఆధార్‌కార్డు నంబర్లు ఉన్నాయి. వీటిద్వారా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలను గుర్తించి నగదు జమచేయనున్నారు. ప్రస్తుతం గ్యాస్‌ సబ్సిడీ కూడా ఇలాగే అందుతున్నది. 95 శాతంమంది లబ్ధిదారులకు బ్యాంకు ఖాతా ఉన్నదని, బ్యాంకు ఖాతాలేని వారుంటే చెక్కుల ద్వారా అందజేసే ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నట్టు పౌరసరఫరాలశాఖ సీనియర్‌ అధికారి తెలిపారు. 


logo