శనివారం 06 జూన్ 2020
Telangana - May 01, 2020 , 01:12:56

నేటినుంచి రెండోవిడుత బియ్యం

నేటినుంచి రెండోవిడుత బియ్యం

  • పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి
  • రేపటినుంచి 1500 జమ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదల ఆకలితీర్చేందుకు ప్రభుత్వం ప్రకటించిన రెండోవిడుత ఉచిత బియ్యం పంపిణీ శుక్రవారం నుంచి ప్రారం భం కానున్నది. తెల్లరేషన్‌కార్డు లబ్ధిదారులు ఒక్కొరికి ఉచితంగా 12 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేసేందుకు పౌరసరఫరాలశాఖ ఏర్పాట్లుచేసింది. ఆహారభద్రత కార్డుఉన్న కుటుంబంలో ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున బియ్యం, ఒక్కోకార్డుపై రూ.1500 నగదు అందించింది. అదేతరహాలో రెండో విడుత శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 87.55 లక్షల ఆహార భద్రత కార్డులున్న వారికి అందించనున్నారు. నిజామాబాద్‌, నల్లగొండ, వరంగల్‌ రూరల్‌, మెదక్‌ జిల్లాల్లో ప్రతీకార్డుదారుడికి కిలో కందిపప్పును కూడా పంపిణీ చేయనున్నారు. రూ.1500 నగదును బ్యాంకు లేదా పోస్టాఫీసు ఖాతాల్లో జమచేయనున్నారు. మే 1న బ్యాంకులకు సెలవు కావడంతో 2వతేదీనుంచి ఈ నగదును జమ చేయనున్నారు. కందిపప్పు 4 జిల్లాల్లోనే ఎందుకు!

కేంద్రప్రభుత్వ ఆదేశాల మేరకు నాఫెడ్‌ ద్వారా రాష్ర్టానికి నెలకు 8,754 టన్నుల కందిపప్పు రావాల్సి ఉన్నది. అయితే ఇప్పటివరకు 3,233 టన్నులు మాత్రమే సరఫరా చేసింది. దీంతో ముందుగా నాలుగు జిల్లాల్లోనే సరఫరా చేయాలని అధికారులు నిర్ణయించారు. నాఫెడ్‌ సరఫరాచేసే దానికి అనుగుణంగా మిగిలిన జిల్లాల్లో 15వ తేదీ తర్వాత పంపిణీ చేయనున్నట్టు వివరించారు.


logo