సోమవారం 25 మే 2020
Telangana - Mar 30, 2020 , 01:20:09

వలస కార్మికులకు ఉచిత భోజనం

వలస కార్మికులకు ఉచిత భోజనం

  • నిరాశ్రయులు, నడుచుకుంటూ సొంతూళ్లకు వెళ్లేవారికీ ఏర్పాట్లు
  • సీఎం కేసీఆర్‌ ఆదేశంతో పురపాలకశాఖ నిర్ణయం
  • ఔటర్‌, ఇన్నర్‌రింగ్‌ రోడ్లు కలిసేచోట క్యాంపులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రంలో వలస కార్మికులు, నిరాశ్రయులు, నడుచుకుంటూ వెళ్లేవారికి ఉచిత భోజన సదుపాయం కల్పించాలని పురపాలకశాఖ నిర్ణయించింది. ఆకలితో ఏ ఒక్కరూ అలమటించకూడదన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు పురపాలకశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌ సత్యనారాయణ ఆదివారం ఆదేశాలు జారీచేశారు. హైదరాబాద్‌ శివారులోని బోడుప్పల్‌, పీర్జాదిగూడ, జవహర్‌నగర్‌, నిజాంపేట్‌, బడంగ్‌పేట్‌, మీర్‌పేట్‌, బండ్లగూడ జాగీర్‌ వంటి కార్పొరేషన్లలో అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా ఉచితంగా ఆహారాన్ని సరఫరా చేయాలని మున్సిపల్‌ కమిషనర్లకు సూ చించారు. 

ఇందుకోసం హరేకృష్ణ చారిటబుల్‌ ఫౌండేషన్‌ను సంప్రదించి.. ప్రతి కార్పొరేషన్‌లో ఒకట్రెండు ఎన్జీవోల ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని స్పష్టంచేశారు. రోడ్ల వెంట నడుచుకుంటూ వెళ్తున్న దినసరి కూలీలు, ఇతర ప్రజల కోసం ఔటర్‌, ఇన్నర్‌ రింగ్‌ రోడ్లు కలిసే చోట ప్రత్యేకంగా క్యాంపులను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. భోజనం, తాగునీరు, మందులు వంటివి సమకూర్చాలని, 24 గంటలు ప్రాధాన్యతాక్రమంలో ఈ పనిని చేపట్టాలని స్పష్టంచేశారు.


logo