శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 27, 2020 , 01:38:57

అందుబాటులోకి ‘అన్నపూర్ణ’

అందుబాటులోకి ‘అన్నపూర్ణ’

  • మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో ఉచిత  భోజన కేంద్రాలు ప్రారంభం
  • దిగొచ్చిన హాస్టల్‌ యజమానులు
  • తీరిన విద్యార్థుల కష్టాలు 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మంత్రి కేటీఆర్‌ చొరవతో గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఉచిత భోజన కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. లాక్‌డౌన్‌ సందర్భంగా నిరుపేదలు, కూలీలు, అన్నార్థుల ఆకలి తీర్చేందుకు అన్నపూర్ణ కేంద్రాలను యథాతథంగా కొనసాగించాలని జీహెచ్‌ఎంసీ అధికారులను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. ఈ మేరకు చర్యలు చేపట్టిన జీహెచ్‌ఎంసీ అధికారులు గురువారం నగరంలోని 80 కేంద్రాల్లో 11 వేల మందికిపైగా ఉచిత భోజనాలు పెట్టారు. నేటి నుంచి 150 కేంద్రాల ద్వారా భోజనాన్ని అందించనున్నట్టు అక్షయపాత్ర నిర్వాహకులు హరేకృష్ణ మూవ్‌మెంట్‌ ప్రతినిధులు చెప్పారు. శుక్రవారం నుంచి రాత్రి సమయాల్లోనూ భోజన కేంద్రాలు తెరిచే ఉంటాయని వారు వెల్లడించారు. లాక్‌డౌన్‌ వల్ల ఎవరూ ఆకలితో బాధపడవద్దన్న ఉద్దేశంతోనే మంత్రి కేటీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు.

వెనక్కితగ్గిన హాస్టల్‌ యజమానులు

ఉన్నఫలంగా హాస్టల్‌ విద్యార్థులు రోడ్లపైకి వచ్చిన అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌ తీసుకుంది. మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో గ్రేటర్‌ ప్రజాప్రతినిధులు బుధవారం అర్థరాత్రి నుంచే రంగంలోకి దిగి హాస్టళ్ల యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపారు. హాస్టళ్లలో ఆశ్రయం పొందుతున్న వారు తమ స్వస్థలాలకు వెళ్లే ఆలోచనను విరమించుకోవాలని నచ్చజెప్పారు. తమ వద్ద ఆశ్రయం పొందుతున్న వారిని సొంత బిడ్డల్లా చూసుకోవాలని హాస్టల్‌ నిర్వాహకులను కోరారు. ఈ మేరకు విద్యార్థులకు వసతి కొనసాగించేందుకు నిర్వాహకులు నిర్ణయించారు. 


logo