గురువారం 02 జూలై 2020
Telangana - Jun 26, 2020 , 02:43:33

రాముడికే శఠగోపం

రాముడికే శఠగోపం

  • నకిలీ వెబ్‌సైట్‌తో మోసం 
  • భద్రాచలం పోలీసులకు ఫిర్యాదు

భద్రాచలం: భద్రాద్రి రాముని పేరుతో ఘరానా మోసానికి తెరలేపాడు ఓ ప్రబుద్ధుడు. భక్తుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఆన్‌లైన్‌ దోపిడీకి పాల్పడ్డాడు. దేవస్థాన అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌లోని ఫస్ట్‌ బ్యాంకు కాలనీకి చెందిన కే సదావిజయకుమార్‌ భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో అర్చన జరిపించేందుకు ఇటీవల ఓ వెబ్‌సైట్‌ను పరిశీలించారు. భద్రాచలం దేవస్థానం పేరిట ఉన్న ఓ వెబ్‌సైట్‌లో కనిపించిన నంబర్‌కు ఫోన్‌చేశారు.

 గోత్రనామార్చనకు రూ.516ను స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఖాతాలో జమచేయాలని ఫోన్‌లో మాట్లాడిన జెరుపుల శ్రీకాంత్‌ సూచించడంతో భక్తుడు సదావిజయకుమార్‌ సదరు మొత్తాన్ని బదిలీ చేశారు. అనంతరం తదుపరి వివరాల కోసం భద్రాద్రి దేవస్థాన అధికారులను ఫోన్‌ ద్వారా సంప్రదించగా అసలు విషయం తెలిసింది. తాను చూసింది ఫేక్‌ వెబ్‌సైట్‌ అని గుర్తించారు. ఫేక్‌ వెబ్‌సైట్‌ నడుపుతున్న పాలకుర్తికి చెందిన జెరుపుల శ్రీకాంత్‌పై దేవస్థాన అధికారులు గురువారం భద్రాచలంలోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. logo